శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై తొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 69)

శ్రీమద్రామాయణము

బాలకాండ

అరవై తొమ్మిదవ సర్గ

గడిచి తెల్లవారింది. దశరథుడు తెల్లరాజుజామున లేచి కాలకృత్యములు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకొని తన మంత్రి సుమంతుని పిలిపించాడు.

“సుమంతా! రాముని వివాహమునకు మనకు మిథిలకు వెళుతున్నాము. ముందు ధనరాసులు, రత్నములు, ఆభరణములతో కొంతమంది వెళ్లాలి. తరువాత మా వెంట చతురంగ బలములు బయలుదేరాలి. మన పురోహితులు వసిష్ఠుడు, వామదేవుడు, మహాఋషులు జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు కూడా వస్తున్నారు. వారి ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి. ఆలస్యము చేయవద్దు." అని ఆదేశాలు ఇచ్చాడు.

సుమంతుడు దశరథుని ప్రయాణానికి తగు ఏర్పాట్లు చేసాడు. నాలుగు రోజుల ప్రయాణము తరువాత అందరూ మిథిలకు చేరుకున్నారు. జనకుడు వారిని తగు మర్యాదలతో ఆహ్యానించాడు. అతిథి సత్కారములు, విడిది ఏర్పాట్లు చేసాడు. దశరథ మహారాజును కలుసుకొని జనకుడు ఇలా అన్నాడు.

"ఓ దశరథమహారాజా! తమరికి మిథిలాధిపతి జనకుడు స్వాగతము పలుకుతున్నాడు. తమరి రాకతో మా మిథిలా నగరము పావనముఅయింది. తమరి కుమారుల పరాక్రమము అనుపమానము, అద్వితీయము. మా భాగ్యము కొద్దీ వసిష్ఠ మహర్షి మా నగరమునకు వచ్చారు. మాకు ఎంతో ఆనందముగా ఉంది.

ఓ దశరథమహారాజా! మా భాగ్య వంశమున రఘువంశ రాజులతో వియ్యమందడంతో అన్ని విఘ్నములు తొలగిపోయాయి. మా కులము పావనమయింది. రేపు నేను తలపెట్టిన యజ్ఞము పూర్తి అయిన తరువాత వివాహ మహోత్సవ కార్యక్రమము జరుపుటకు అనుమతిని ఇవ్వండి.” అని అన్నాడు జనకుడు.

అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు. “ఓ జనకమహారాజా! తమరు కన్యాదాతలు. తమరు కన్యాదానం చేస్తేనే కదా మేము కన్యను స్వీకరించేది. కాబట్టి కన్యాదాన ముహూర్త నిర్ణయము మీది. తమరు ఎలా చెపుతారో అలాగే చేస్తాము." అని అన్నాడు దశరథుడు.

ఆ మాటలకు జనకుడు ఎంతో సంతోషించాడు. ఆ రాత్రికి దశరధుడు, ఆయన వెంట వచ్చిన మునులు, పురోహితులు, పరివారము మిథిలానగరములో సుఖంగా గడిపారు. దశరథుడు విశ్వామిత్రుని వద్ద ఉన్న రామలక్ష్మణులను చూచి ఎంతో ఆనందించాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో అరవై తొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)