శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై తొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 59)

శ్రీమద్రామాయణము

బాలకాండ

యాభై తొమ్మిదవ సర్గ

ఛండాలరూపంలో ఉన్న త్రిశంకు మాటలు విన్న విశ్వామిత్రుడు జాలి పడ్డాడు. అతని తో ఇలా అన్నాడు.

"ఓ శంకూ బాధ పడకు. నిన్ను, నీ కోరికను, నేను స్వాగతిస్తున్నాను. భయపడకు. నీ వంటి ధర్మాత్మునకు నేను సాయ పడతాను. నీచేత యాగము చేయిస్తాను. ఎంతో మంది మహా ఋషులను నీవు చేయబోయే యాగమునకు ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరముతో అంటే ఈ ఛండాల శరీరముతో స్వర్గమునకు పంపిస్తాను. నీవు నా శరణు పొందావు. నీకు ఏం భయంలేదు. స్వర్గము నీ అరిచేతిలో ఉన్నట్టే."అని అన్నాడు విశ్వామిత్రుడు.

వెంటనే తన కుమారులను పిలిచాడు. యజ్ఞమునకు కావలసిన వస్తువులు సమకూర్చమని ఆదేశించాడు.

విశ్వామిత్రుడు తన శిష్యులను పిలిచాడు. “మీరందరూ వెళ్లి విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞము చేయిస్తున్నాడు. అందరూ రండి అని బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను అందరినీ ఆహ్వానించండి. వారిని మీ వెంట తీసుకొని రండి."అని ఆజ్ఞాపించాడు.

విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు ఆయన శిష్యులు అందరూ నలు దిక్కులకు వెళ్లారు. బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకొని వచ్చారు. ఆ విషయమును విశ్వామిత్రునికి విన్నవించుకున్నారు.

“గురువు గారూ! తమరి ఆదేశము మేరకు అందరికీ మీరు చేయించబోవు యజ్ఞమును గూర్చి తెలిపి తీసుకొని వచ్చాము. కాని మహోదయుడు, వసిష్ఠుని కుమారులు రాలేదు. మీరు చెప్పిన మాటలు విన్న వారు ఈ విధంగా అన్నారు.

‘ఒక ఛండాలుడు యజ్ఞము చేయాలని సంకల్పించడం. దానిని ఒక క్షత్రియు డైన విశ్వామిత్రుడు చేయించడం. బాగుంది. ఆ యజ్ఞములో అర్పించు హవిస్సులు దేవతలు, ఋషులు ఎలా స్వీకరిస్తారు. క్షత్రియుడైన విశ్వామిత్రుని మాటలు విని ఛండాలుడైన త్రిశంకు చేచి భోజనము చేసినవారు బ్రాహ్మణులైనా, ఋషులైనా వారు స్వర్గానికి ఎలావెళతారు? ఇది సంభవమా!
అని చాలా దుర్భాషలాడారు గురువు గారూ!" అని విశ్వామిత్రుని శిష్యులు విశ్వామిత్రునితో అన్నారు.

ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. “ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారు ఇన్ని మాటలు అంటారా! వసిష్ఠకుమారులు అందరూ భస్మమైపోతారు. వారందరూ యమలోకములో శవములను తింటూ ఏడు వందల జన్మలు పడి ఉంటారు. వారందరూ కుక్కమాంసము తినే ముష్టిక జాతిలో పుడతారు. నన్ను పరిహసించిన మహోదయుడు నిషాదుడుగా పుడతాడు. జంతువును చంపి తింటూ చాలాకాలము నిషాదుడుగా
జీవిస్తాడు." అని శపించాడు విశ్వామిత్రుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో యాభై తొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)