శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభయ్యవ సర్గ (Ramayanam - Balakanda - Part 50)
శ్రీమద్రామాయణము
బాలకాండ
యాభయ్యవ సర్గ
రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, మునులు అందరూ మిథిలా నగరము చేరుకున్నారు. జనకుడు చేయు యాగమునకు వచ్చిన ఆహూతులతో మిథిలా నగరము కిక్కిరిసి పోయింది. యాగమునకు వచ్చిన మునులకు వేసిన ఋషివాటికలతో మిథిలా నగరము నిండిపోయింది.అప్పుడు రాముడు విశ్వామితుని చూచి ఇలా అన్నాడు. “ఓ మునీంద్రా! ఇక్కడ అంతా జనసమ్మర్దముగా ఉంది. మనకు ఉండుటకు తగిన ప్రదేశమును నిర్ణయింపుడు." అని అన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు జనసమ్మర్దములేని ప్రదేశములో, జలము బాగా దొరికే ప్రదేశములో తమకు అతిథిగృహమును ఏర్పాటు చేసాడు. ఇంతలో జనకునకు విశ్వామిత్రుడు యాగమునకు వచ్చాడు అన్న విషయం తెలిసింది.
జనక మహారాజు తన పురోహితుడు అయిన శతానందుని, ఋత్విక్కులను వెంట బెట్టుకొని విశ్వామితుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునకు అర్ఘ్యము పాద్యము అర్పించి పూజించాడు. జనకుడు ఇచ్చిన ఆతిథ్యమును సంతోషంతో స్వీకరించాడు విశ్వామిత్రుడు.
"ఓ జనక మహారాజా! నీకు క్షేమమేనా! నీ రాజ్యములో ప్రజలు క్షేమముగా ఉన్నారా! యజ్ఞము ఎట్టి అవాంతరములు లేకుండా సక్రమంగా జరుగుతూ ఉందా!" అని అడిగాడు.
తరువాత విశ్వామిత్రుడు అక్కడకు వచ్చిన ఋత్విక్కులను, ఉపా ధ్యాయులను, పురోహితులను ఉచిత రీతిని కుశల ప్రశ్నలు వేసి వారి క్షేమములు అడిగాడు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునికి నమస్కరించి ఆయనకు ఉచితాసనము సమర్పించాడు. విశ్వా మిత్రుడు ఆసనము మీద కూర్చున్నాడు. తరువాత ఋత్విక్కులు, పురోహితులు, మంత్రులు కూడా తమ తమ ఆసనముల మీద కూర్చున్నారు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.
"ఓ మహర్షీ! మహాత్ములు, పుణ్యాత్ములు అయిన మీరు ఈ యజ్ఞమునకు వచ్చి నన్ను ధన్యుడిని చేసారు. తమరి దర్శనభాగ్యముతో నా యజ్ఞము సఫలమైనది. తమరి అనుగ్రహము నాకు పూర్తిగా లభించింది. ఓ విశ్వామిత్ర మహర్షీ! యజ్ఞము సమాప్తమగుటకు ఇంక పన్నెండు దినములు మిగిలి ఉన్నది. తరువాత వారి వారి హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అందరూ వస్తారు." అని అన్నాడు..
తరువాత జనకుని దృష్టి రామలక్ష్మణుల మీద పడింది. వారిని చూచి జనకుడు విశ్వామిత్రుని ఇలా అడిగాడు.
“ఓ మహర్షి! ఈ రాకుమారులు ఎవరు? వీరు మహా పరాక్రమ వంతుల మాదిరి కనపడుతున్నారు. వీరి నేత్రములు పద్మపత్రముల మాదిరి ఉన్నవి. వీరు దేవతల మాదిరి ప్రకాశిస్తున్నారు. వీరు ఇరువురూ ఒకే పోలికలతో ఉన్నారు. ఇప్పుడిప్పుడే యౌవనములోకి అడుగుపెడుతున్నారు. వీరు ధనుర్బాణములను, ఖడ్గములను ధరించి ఉన్నారు. వీరిని చూస్తుంటే సూర్య చంద్రులు ఒకే సారి ప్రకాశిస్తున్నట్టు ఉంది. వీరు ఏ దేశము రాకుమారులు? మీ వెంట కాలి నడకన వచ్చుటకు కారణమేమి? మా దేశమునకు ఏ పనిమీద వచ్చారు? సెలవియ్యండి." అని వినయంగా అడిగాడు.
అప్పుడు విశ్వామిత్రుడు జనకునితో ఇలా అన్నాడు. “ఓ జనకమహారాజా! వీరు క్షత్రియ కుమారులు. అయోధ్యా నగరమునకు అధిపతి అయిన ఇక్ష్వాకు వంశమునకు చెందిన
దశరథ మహారాజునకు పుత్రులు. నేను సిద్ధాశ్రమములో ఒక యజ్ఞము తలపెట్టాను. ఆ యజ్ఞమును రాక్షసులు భగ్నం చేస్తున్నారు. అందుకని వీరిని వారి తండ్రి అనుమతితో యాగ సంరక్షణకు తీసుకొని వచ్చాను. వీరు ఇరువురు రాక్షసులను సంహరించి యాగమును సంరక్షించారు. తరువాత అహల్యా దర్శనము చేసుకొని, గౌతమ మహామునిని కలుసుకొని, అనంతరము మిథిలకు వచ్చారు. నీ వద్ద ఉన్న ధనుస్సును చూడటానికి కుతూహలపడుతున్నారు.” అని విశ్వామితుడు జనకునితో రామ లక్ష్మణులకు గురించి వివరంగా చెప్పాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో యాభయ్యవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment