శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 76)
శ్రీమద్రామాయణము
బాలకాండ
డెబ్బది ఆరవ సర్గ
అప్పటి వరకూ శ్రీ రాముడు తండ్రి మీద ఉన్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని ఇంక ఊరుకోలేక పోయాడు. తండ్రి వంక చూచి ఆయన అనుమతితో పరశురామునితో ఇలా అన్నాడు.“పరశురామా! మీ గురించి విన్నాను. నీవు తండ్రి ఋణమును తీర్చుకోడానికి యావత్తు క్షత్రియ లోకమును మట్టు బెట్టిన సంగతి నాకు తెలుసు. దానికి నిన్ను అభినందిస్తున్నాను. కాని నాకు నీవు పరీక్ష పెడుతున్నావు. నేను పరాక్రమము లేని వాడిగా నీవు భావిస్తున్నావు. దానిని నేను నాకు జరిగిన అవమానముగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పరాక్రమమును నీకు ప్రదర్శిస్తాను. చూడు.” అని పలికి పరశు రాముని చేతిలోని ఆ దివ్యమైన ధనుస్సును బాణమును తీసుకున్నాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని సవరించాడు. ధనుస్సును ఎక్కుపెట్టాడు. బాణమును ఆ ధనుస్సులో సంధించాడు.
పరశురాముని చూచి ఇలా అన్నాడు. “ఓ పరశురామా! మీరు బ్రాహ్మణులు. నాకు పూజ్యులు. కాబట్టి ఈ బాణమును మీ మీద ప్రయోగింపలేను. కాని సంధించిన బాణము వృధాకారాదు. కాబట్టి ఈ బాణమును దేని మీద ప్రయోగింప వలెనో చెప్పండి. నీ పాదములకు ఎక్కడికైనా పోగల శక్తి ఉంది. నా బాణమును ఆశక్తి మీద ప్రయోగింపనా. లేక నీవు ఇప్పటిదాకా తపస్సు చేసి సంపాదించుకున్న ఉత్తమలోకముల మీద సంధించనా! ఏదో ఒకటి చెప్పు. ఎందుకంటే ఈ విష్ణుబాణము వృధాకావడానికి వీలు లేదు. నీవు పట్టు బట్టి నా చేత ఈ బాణమును సంధింపజేసావు. ఆ ఫలితాన్ని నీవే అనుభవించాలి." అని అడిగాడు రాముడు.
ఆ మాటలకు పరశురాముని బలపరాక్రమములు నశించి పోయాయి. శరీరం నిర్వీర్యము అయింది. అలానే చూస్తూ ఉండి పోయాడు. విష్ణుబాణము సంధించిన రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి మాదిరి కనిపించాడు. ఆశ్చర్యపోయాడు పరశురాముడు. చేతులు జోడించి నమస్కరించాడు.
“ఓ రామా! నీవు సామాన్యుడవు కావు. విష్ణు ధనుస్సును ధరించిన విష్ణుమూర్తివి. నీకు అసాధ్యము ఏమీ లేదు. యుద్ధములో నిన్ను జయించడం ఎవరి తరమూ కాదు. నీ చేతిలో నేను ఓడి పోయాను. నన్ను క్షమించు. నేను క్షత్రియ సంహారము చేసి ఈ భూమి నంతా కశ్యపునకు ఇచ్చాను. అప్పుడు కశ్యపుడు నన్ను ఈ దేశములో నివసించవద్దు అని ఆజ్ఞాపించాడు. అందుకని నేను మహేంద్రపర్వతము మీద తపస్సుచేసుకుంటున్నాను. నువ్వు నా గమనశక్తిని నీ బాణంతో హరిస్తే నేను మహేంద్రగిరికి పోలేను. కాబట్టి నా గమన శక్తిని కొట్టవద్దు. దానికి బదులు నేను తపస్సు చేసి సంపాదించిన నా పుణ్యలోకముల మీద నీ బాణమును సంధించు. తరువాత నేను మహేంద్రగిరికి పోతాను." అని అన్నాడు పరశురాముడు.
పరశురాముని మాటలను మన్నించి రాముడు విష్ణుబాణము ప్రయోగించాడు. పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్యలోకములు అన్నీ ధ్వసం అయ్యాయి. తరువాత పరశురాముడు రామునికి ప్రదక్షిణము చేసి నమస్కరించి, తన దివ్యమైన గమన శక్తితో మహేంద్రపర్వతమునకు వెళ్లిపోయాడు. ఇదంతా ఆశ్చర్యంతో చూచాడు దశరథుడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో డెబ్బది ఆరవ సర్గ సంపూర్ణము.
ఓంతత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment