శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవయ్యవ సర్గ (Ramayanam - Balakanda - Part 60)
శ్రీమద్రామాయణము
బాలకాండ
అరవయ్యవ సర్గ
ఆ ప్రకారంగా వసిష్టకుమారులను, మహెూదయుని శపించిన తరువాత అక్కడకు వచ్చిన ఋత్విక్కులను, బ్రాహ్మణులను, ఋషులను చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు."ఇక్ష్వాకు వంశ రాజు, పరమ ధార్మికుడు అయిన త్రిశంకు నా వద్దకు తనను సశరీరంగా స్వర్గమునకు పంపేటందుకు ఒక యజ్ఞము చేయించమని నా సహాయము కోరాడు. ఆయన కోరికను నేను మన్నించాను. త్రిశంకును ఈ శరీరంతో స్వర్గమునకు పంపడానికి నేను ఒక యజ్ఞము చేస్తున్నాను. ఆ యజ్ఞమునకు మీరందరూ సాయపడాలి." అని అన్నాడు విశ్వామిత్రుడు.
ఆ మాటలు విన్న ఋత్విక్కులు, బ్రాహ్మణులు, ఋషులు తమలో తమరు ఇలా అనుకున్నారు. “ఈ విశ్వామిత్రుడు మహా కోపిష్టి. మన కళ్ల ముందే వసిష్ఠకుమారులను దారుణంగా శపించాడు. ఆయన మాట వినక పోతే మనలకు కూడా శపించగలడు. అందుకని ఆయన చెప్పినట్టు చెయ్యడమే ప్రస్తుత కర్తవ్యము" అని అనుకున్నారు.
తరువాత విశ్వామిత్రునితో ఇలా అన్నారు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! నీవు చెప్పినట్లే మేము చేస్తాము. యజ్ఞమును ప్రారంభం చేస్తాము."అని అన్నారు. తరువాత అందరూ కలిసి యజ్ఞము ఆరంభించారు. యజ్ఞమునకు యాజకుడుగా విశ్వామిత్రుడు ఉన్నాడు. ఋత్విక్కులు వేద మంతములు చదువుతున్నారు. వేదోక్తంగా యజ్ఞము చేస్తున్నారు.
విశ్వామిత్రుడు ఆయా దేవతలను వారి వారి యజ్ఞ భాగములను స్వీకరించుటకు మంత్రపూతంగా ఆహ్వానించాడు. కాని విశ్వామిత్రుని ఆహ్వానమును మన్నించి దేవతలు ఎవరూ వారి వారి హవిర్భాగము లను స్వీకరించుటకు రాలేదు. విశ్వామిత్రునకు కోపం వచ్చింది. యజ్ఞము చేసే స్రువను చేతిలోకి తీసుకున్నాడు. త్రిశంకుని చూచి ఇలా అన్నాడు.
“ఓ త్రిశంకూ! నా తప: ప్రభావాన్ని చూడు. నిన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపిస్తాను. ఇప్పటిదాకా సశరీరంగా ఎవ్వరూ వెళ్లలేని స్వర్గానికి నీవు వెళుతున్నావు. నేను సంపాదించిన తపస్సు ఫలంలో కొంత ధారపోసి నిన్ను స్వర్గానికి పంపుతున్నాను. వెళ్లు. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్లు." అని అన్నాడు.
విశ్వామిత్రుని తప:శక్తితో త్రిశంకు శరీరంతో స్వర్గానికి వెళ్లాడు. మానవ శరీరంతో స్వర్గానికి వస్తున్న త్రిశంకును దేవతలు చూచారు. దేవేంద్రునికి చెప్పారు. త్రిశంకును చూచి దేవేంద్రుడు ఇలా అన్నాడు.
“ఓరి తిశంకూ! నీవు మానవ శరీరంతో స్వర్గంలో అడుగుపెట్టలేవు. నీవు మూఢుడవు. సశరీరంగా స్వర్గములో ఉండలేవని నీకు తెలియదా! అందుకని తల్లక్రిందులుగా భూమి మీద పడు.” అని శపించాడు దేవేంద్రుడు.
“ఓ విశ్వామిత్ర మహర్షీ! నన్ను రక్షించు నన్ను రక్షించు" అని పెద్దగా అరుస్తూ త్రిశంకు తల్లక్రిందులుగా భూమి మీదకు వస్తున్నాడు. అది చూచాడు విశ్వామిత్రుడు.
"ఆగు త్రిశంకూ ఆగు. అక్కడే ఉండు” అని పెద్దగా అరిచాడు.
వెంటనే విశ్వామిత్రుడు అపర బ్రహ్మగా మారిపోయాడు ఆకాశంలో దక్షిణ దిక్కున, ఒక నక్షత్ర మండలాన్ని ఒక సప్తర్షి మండలాన్ని సృష్టించాడు. “ఓ దేవేంద్రా! చూడు. నేను మరొక స్వర్గాన్ని, మరొక దేవేంద్రుడిని సృష్టిస్తున్నాను. అది సాధ్యం కాకపోతే నిన్ను నీ దేవేంద్రలోకాన్ని నాశనం చేస్తాను.” అని అన్నాడు.
ఆ మాటలకు దేవతలు గడగడలాడిపోయారు. దేవతలు, రాక్షసులు, సప్తఋషులు, గంధర్వులు విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! నీకు తెలియనిది ఏమున్నది. ఇతడు మానవుడు. పైగా ఛండాలుడు. ఇతడు శరీరంతో స్వర్గ ప్రవేశమునకు అర్హుడు కాడు కదా!" అని అన్నారు.
దేవతల మాటలతో విశ్వామిత్రుడు శాంతించాడు. “మీరు చెప్పినది నిజమే. కాని నేను ఇతనిని సశరీరంగా స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేను ఇతనిని స్వర్గానికి పంపకపోతే నేను ఇచ్చిన మాట తప్పివాడను అవుతాను కదా! నాకు అసత్య దోషము అంటుతుంది కదా! కాబట్టి నేను సృష్టించిన నక్షత్ర మండలము శాశ్వతంగా అంతరిక్షంలో ఉండేట్టు నాకు అనుమతి ఇవ్వండి. ఆ నక్షత్ర మండలంలో ఈ త్రిశంకు శాశ్వతంగాఉంటాడు." అని అన్నాడు.
దానికి దేవతలు అంగీకరించారు.
దానికి దేవతలు అంగీకరించారు.
“ఓ విశ్వామిత్రా! నీవు చెప్పినట్లే జరుగుతుంది. కాని నీవు సృష్టించిన నక్షత్రమండలము జ్యోతిశ్చక్రము వెలుపల ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ నక్షత్ర మండలములో త్రిశంకు ఇప్పుడు ఉన్నట్టు తల్లక్రిందులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. నీవు సృష్టించిన నక్షత్ర మండలములోని నక్షత్రములు త్రిశంకు చుట్టు తిరుగుతూ అతనిని సేవిస్తూ ఉంటాయి. "అని అన్నారు.
దానికి విశ్వామిత్రుడు సమ్మతించాడు.
దానికి విశ్వామిత్రుడు సమ్మతించాడు.
ఆ విధంగా విశ్వామిత్రుడు తన యజ్ఞమును పూర్తి చేసాడు. యజ్ఞమునకు వచ్చిన ఋత్విక్కులు, ఋషులు బ్రాహ్మణులు క్షేమంగా తమ తమ స్థానములకు తిరిగి వెళ్లారు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో అరవయ్యవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment