శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 35)
శ్రీమద్రామాయణము అరణ్యకాండము ముప్పది ఐదవ సర్గ శూర్పణఖ చెప్పిన విషయాలను సావధానంగా విన్నాడు. రావణుడు. సభచాలించాడు. మంత్రులకు దండనాధులకు వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. శూర్పణఖ చెప్పిన విషయములను ఒకటికి రెండు సార్లు ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు. శూర్పణఖ మాటల్లో అతనికి నచ్చింది సీత సౌందర్యవర్ణన. ఎక్కడ తగలాలో అక్యడే తగిలింది శూర్పణఖ వదిలిన మాటల బాణము. అంతా రహస్యంగా జరగాలి అనుకున్నాడు. మారువేషంలో రథశాలకు వెళ్లాడు. సారధిని వెంటనే రథము సిద్ధం చేయమన్నాడు. సారథి రథం సిద్ధం చేసాడు. రథానికి గాడిదలను కట్టాడు. వాటి ముఖాలు పిశాచాల మాదిరి ఉన్నాయి. రావణుడు రథం ఎక్కి సముద్రం వైపుకు వెళ్లాడు. రావణుడు సముద్రం తీరం వెంట తన రథములో ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఎన్నో ముని ఆశ్రమములను చూస్తున్నాడు. ఆ అరణ్యములలో నాగులు, పక్షులు, గంధర్వులు, కింనరులు, వైఖానసులు, వాలఖిల్యులు, ఋషులు, సిద్ధులు, చారణులు స్వేచ్ఛగా నివసిస్తున్నారు. దారిలో రావణునికి దేవతలు ప్రయాణిస్తున్న విమానాలు కనపడుతున్నాయి. ఈ ప్రకారంగా అనేకములైన అరణ్యములను ఉద్యానవనములను, సరస్సులను దాటుకుంటా ప్రయాణిస్తున్నాడు రావణుడు. రావణుడు ప్రయాణిస్తున్న ప్రదేశమును...