శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది ఒకటవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 31)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ముప్పది ఒకటవ సర్గ

(ఈ సర్గ ప్రాచ్యప్రతిలో లేదు. ఇది ప్రక్షిప్తము అనగా తరువాత చేర్చబడినది అని పండితుల అభిప్రాయము)

ఖరుడు, దూషణుడు తమతమ సేనలతో సహా యుద్ధంలో మరణించారు అన్న వార్త జనస్థానంలో దావానలంలా పాకిపోయింది. వెంటనే అకంపనుడు అనే రాక్షసుడు లంకానగరానికి బయలు దేరాడు. రావణుని కలుసుకున్నాడు.

“ఓ రావణా! నేను జనస్థానము నుండి వస్తున్నాను. అక్కడ మీ ప్రతినిధులుగా ఉన్న ఖరుడు, దూషణుడు, వారి సైన్యము పూర్తిగా యుద్ధంలో చంపబడ్డారు. నేను మాత్రము తప్పించుకొని ఈ వార్త తమకు చెబుదామని వచ్చాను.” అని జరిగింది క్లుప్తంగా వివరించాడు.

ఆ మాటలు విన్న దశగ్రీవుడు కోపంతో మండి పడ్డాడు. అకంపనుని చూచి ఇలా అన్నాడు.
"ఓ అకంపనా! ఇది నిజమా! నా అధీనంలో ఉన్న జనస్థానమును నాశనం చేసి, ఖరదూషణాదులను చంపిన వాడు ఎవరు? వాడికి ఆయువు మూడిందా! లేకపోతే ఇలా ఎందుకు చేస్తాడు. నాకు అపకారము చేసిన తరువాత దేవేంద్రుడైనా, కుబేరుడైనా, యముడైనా ఆఖరుకు విష్ణువైనా సుఖంగా బతకలేరు కదా! ఇంక వీడెంత? వాడెవరో వాడికి నా సంగతి తెలియనట్టుంది. నేను యముడికి యముడను. అగ్నిని కూడా కాల్చివేయగల సమర్థుడను. మృత్యుదేవతకే మృత్యువును. నాకు కోపం వస్తే సూర్యుడిని, అగ్నిని కూడా దహించివేస్తాను. వాయువును కూడా శాసించగలను. అకంపనా! ఇంతకూ వాడెవడు? ఎక్కడ నుంచి వచ్చాడు. ఎక్కడ ఉంటాడు?" అని కోపంగా అడిగాడు రావణుడు.

ప్రళయాగ్నితో సమానమైన రావణుని కోపం చూచి అకంపనుడు భయంతో వణికిపోయాడు. "నన్ను తమరు చంపను అని అభయం ఇస్తే జరిగింది చెబుతాను" అని అన్నాడు గడగడా వణుకుతూ.

రావణుడు కొంచెం శాంతించాడు. “అలాగే అభయం ఇచ్చాను. ఏం జరిగిందో సవిస్తరంగా చెప్పు" అని అన్నాడు. అకంపనుడు ఇలా చెప్పసాగాడు.

"అయోధ్యానగరమును పరిపాలించు దశరథుని కుమారుడు రాముడు. యువకుడు. మహా పరాక్రమశాలి. ఆజానుబాహుడు. గొప్ప వీరుడు. అతడే ఒంటరిగా ఖరుని, దూషణుని, ససైన్యంగా సంహరించాడు.” అని మరలా క్లుప్తంగానే చెప్పాడు ఏం చెబితే ఏమవుతుందో అని భయంతో.
ఆ మాటలు విన్న రావణుడు ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చాడు. రావణునిలో ఇదివరకు ఉన్న కోపం స్థానంలో ఆలోచన చోటు చేసుకుంది. “అకంపనా! రాముడు ఒంటరిగా జనస్థానమునకు వచ్చాడా లేక ఇంద్రుని, దేవతలను తోడుగా తీసుకొని వచ్చాడా?" అని అడిగాడు, రాముని వెనుక ఉన్న శక్తులు ఏమిటో తెలుసుకుందామనే ఆలోచనతో.

రావణుని కోపం తగ్గగానే అకంపనుడిలో ధైర్యం పుంజుకుంది. మరలా రాముడి గురించి చెప్పసాగాడు.

"ఆ రాముడు మహాతేజస్సు కలవాడు. సర్వశ్రేష్ఠధనుర్ధారి. దివ్యాస్త్ర సంపన్నుడు. ఇంతెందుకు దేవేంద్రునితో సమానమైన వాడు. ఆ రాముడి వెంట లక్ష్మణుడు అని అతని తమ్ముడు ఉన్నాడు. అన్నకంటే మించిన వాడు. మహా బలశాలి. రామ లక్ష్మణుల చేరికతో అగ్నికి వాయువు తోడైనట్టే. అటువంటి రాముడు ఒంటరిగానే జనస్థానమును సర్వనాశనం చేసాడు. అంతేగానీ తమరు అన్నట్టు దేవేంద్రుడు గానీ, దేవతలు గానీ జనస్థానమునకు రాలేదు. రాముడు ప్రయోగించిన బాణములు కాలసర్పముల వలె జనస్థానములో ఉన్న రాక్షసులను కబళించి వేసాయి.
ఓ రాక్షసరాజా! రాముడు ఒక్కడైనా ప్రతి రాక్షసుని ముందు ఒక్కోరాముడిలాగా ప్రత్యక్షం అయి వాళ్లను నాశనం చేసాడు. " అని అన్నాడు అకంపనుడు.

అకంపనుని మాటలు సావధానంగా విన్నాడు రావణుడు. ఎవరిని పంపినా లాభం లేదు అనుకున్నాడు. తానే జనస్థానమునకు పోవాలి అని నిశ్చయించుకున్నాడు.

“అకంపనా! ఇంక నీవు వెళ్లవచ్చు. నేనుస్వయంగా జనస్థానమునకు వెళ్తాను.” అని అన్నాడు.

“రాక్షసరాజా! నా మనవి వినండి. రాముడు సామాన్యుడు కాడు. రాముని జయించడం మన వల్లకాదు. రాముడికి కోపం వస్తే వేగవంతమైన నదీప్రవాహాన్ని కూడా నిలువరించగల సమర్థుడు. రాముడు భూమ్యాకాశాలను ఏకం చేయగల వీరుడు. సప్తసముద్రము లను ఏకం చేసి ఈ భూమిని ముంచివేయగల పరాక్రమశాలి. రాముడు ఈ లోకములనన్నిటినీ నాశనం చేసి మరలా సృష్టించగల మేటి. (సృష్టి, స్థితి, లయకారకుడు అని అర్థం. రాముడు భగవంతుడు అని అకంపనుడి అభిప్రాయం). ఓ రావణా! నీవుగానీ, నీ రాక్షస సైన్యము కానీ రాముని జయించడం కల్ల. నీవే కాదు. దేవాసురులు ఏకమై వచ్చినా రాముని యుద్ధంలో ఎదుర్కొనలేరు. కాని రావణా! ఎటువంటి వాడికైనా ఒక బలహీనత ఉంటుంది కదా! ఆ మార్గంలో వెళితే రాముని చంపవచ్చు. ఆ రామునికి సీత అనే అతిలోకసౌందర్యవతి భార్య ఉంది. మంచి యౌవనవతి. దేవతా స్త్రీలుగానీ, అప్సరసలు కానీ అందంలో ఆమెకు సాటిరారు. సీత అంటే రాముడికి పంచప్రాణాలు. సీత లేకుండా రాముడు బతకలేడు. నీవు కనక సీతను అపహరించి తీసుకొని వస్తే, సీత మీద బెంగతో రాముడు ప్రాణాలు విడుస్తాడు. రాముని చంపడానికి ఇది ఒకటే మార్గము.” అని ఒక ఉపాయం చెప్పాడు అకంపనుడు.

రావణునికి ఈ మాటలు కర్ణపేయంగా వినపడ్డాయి. ఒక దెబ్బతో రెండు పిట్టలు. సీతను అపహరిస్తే అటు రాముడు చస్తాడు, ఇటు సీతా తనకు దక్కుతుంది. ఇలా వక్రంగా ఆలోచించాడు రావణుడు, అకంపనుని చూచి ఇలా అన్నాడు.

"అకంపనా! మంచి ఆలోచన చెప్పావు. నేను ఒక్కడినే రేపే జనస్థానమునకు వెళ్లి, సీతను నా రథము మీద కూర్చుండపెట్టుకొని లంకకు తీసుకొని వస్తాను.” అని అన్నాడు.

వెంటనే మంచి గాడిదలు కట్టిన రథమును సిద్ధం చేయమన్నాడు. గాడిదలు కట్టిన రథంలో రావణుడు ఆకాశమార్గంలో జనస్థానమునకు వెళ్లాడు. జనస్థానము దగ్గర ఉన్న రాముని వద్దకు వెళ్లే ముందు, రావణుడు మారీచుని వద్దకు వెళ్లాడు. రావణుని చూచి మారీచుడు అతనికి సకల ఉపచారములు చేసాడు. భక్ష్యములను, భోజన పదార్థములను సమర్పించాడు. రావణుడు భోజనం చేసి మారీచుడు చూపిన ఉచితాసనము మీద కూర్చున్నాడు. అప్పుడు మారీచుడు రావణునితో ఇలా అన్నాడు.

“రాక్షసరాజా! నీకు జయము కలుగు గాక! లంకలో అందరూ క్షేమమే కదా! ఎందుకంటే ఏ కార్యమైనా నీ కనుసైగతో పూర్తి చేయగల సమర్థుడవు, అటువంటిది నీవే స్వయంగా ఇక్కడకు వస్తే
నాకు ఏదో సందేహముగా ఉంది. అందుకని అడిగాను. తమరు ఏదో తొందరపని మీద ఇక్కడకు వచ్చి ఉంటారు అని అనుకుంటాను." అని అన్నాడు మారీచుడు, “ఏం పని మీద వచ్చారు" అని సూటిగా రావణుని అడక్కుండా మారీచుని మాటలు విన్న రావణునికి మారీచుని మనసులోని సందేహం అర్థం అయింది. అందుకని సూటిగానే చెప్పాడు.

“మారీచా! ఎవరో రాముడు అట. జనస్థానములో ఉన్న ఖరుడు, దూషణుడు, వారి 14,000 సైన్యమును ఒంటి చేత్తో తుదముట్టించాడట. ఎవరికీ తేరిపార చూడటానికి శక్యం కాని జనస్థానమును సర్వనాశనం చేసాడట. ఆ రాముని ఉపాయంతో చంపవలెనని అనుకుంటున్నాను. ఆ రామునికి తన భార్య సీత అంటే ప్రాణము. ఆ సీతను అపహరిస్తే, రాముడు ప్రాణాలు విడుస్తాడు. అందుకని రాముని భార్య సీతను అపహరించవలెనని అనుకుం టున్నాను. దానికీ నీ సాయం కావాలి." అని సూటిగా అడిగాడు రావణుడు.

ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు పడ్డాడు మారీచుడు. “రావణా! నీకు ఇటువంటి ఆలోచన చెప్పిన వాడు ఎవరు? రాముని భార్య సీతను అపహరించమని చెప్పిన ఆ దుర్మారుడు, దుష్టుడు ఎవరు? వాడు నీకు ఆప్తుడు కాదు. నీకు పరమశత్రువు. నీ నాశనం కోరి నీకు ఇటువంటి ఆలోచన కలిగించాడు. "సీతను అపహరించాలి" అనే ఆలోచనే నీ సర్వనాశనానికి దారితీస్తుంది. నీకు ఈ ఆలోచన చెప్పివాడు ఎవరో కానీ, నిన్ను తప్పుదోవ పట్టించాడు. వాడు నీకు శత్రువు కాకపోతే నీకు కాలసర్పము నోటిలో కోరలు పీకమని చెబుతాడా?

రావణా! నేను చెబుతున్నాను విను. రాముడు ఒక మదగజము. దాని కాళ్ల కిందపడి నలిగిపోతావు. రాముడు ఒక సింహము. ఆ సింహము జూలుపట్టి లాగకు. లేడిపిల్ల మాదిరి దాని కోరలకు బలి అయిపోతావు. రాముడు ఒక సుడిగుండము. అనవసరంగా ఆ సుడిగుండములో దూకకు. మరలా ప్రాణాలతో బయటకు రాలేవు. ఆ ప్రవాహవేగానికి కొట్టుకుపోతావు. ఓ లంకేశ్వరా! నా మాటవిను. తిరిగి లంకకు వెళ్లు. హాయిగా లంకను పాలించు. నీ భార్యలతో సుఖించు. రాముడిని తన భార్యతో ఆ అడవిలోనే ఉండనీ. రాముని జోలికి పోకు.” అని హెచ్చరించాడు మారీచుడు. రావణుడు మారీచుని మాటలు విని తిరిగి లంకకు వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)