శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది రెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 32)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ముప్పది రెండవ సర్గ

తన అన్నలు ఖరుడు, దూషణుడు, వారి 14,000 సైన్యము తన కళ్లముందు నాశనం కావడం చూచి తట్టుకోలేక పోయింది శూర్పణఖ. ఒక్క రాముని చేతిలోనే ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు చావడం చూచి పెద్దగా కేకలుపెట్టింది. భయంతో శూర్పణఖ వణికిపోయింది. వెంటనే ఈ విషయం తన అన్న రావణునకు చెప్పడానికి శూర్పణఖ లంకకు పరుగెత్తింది.

లంకానగరంలో, రావణుడు, మూర్తీభవించిన దేవేంద్రుని వలె, సభాప్రాంగణంలో, తన బంగారు సింహాసనము మీద, కూర్చుని ఉన్నాడు. రావణుని చుట్టు అతని మంత్రులు కూర్చుని ఉన్నారు.
రావణుడు సామాన్యుడు కాడు. దేవతలను, గంధర్వులను యుద్ధములో గెలిచినవాడు. ముల్లోకములలో అతనికి తిరుగు లేదు. శత్రువులకు యముడు లాగా వెలుగుతున్నాడు రావణుడు. దేవాసుర యుద్ధములో అతని శరీరమునకు ఇంద్రుని వజ్రాయుధము వలనా, విష్ణువు చక్రాయుధము వలన తగిలిన గాయముల మచ్చలు అతని విజయాలకు చిహ్నాలుగా రావణుని ఒంటిమీద ప్రకాశిస్తున్నాయి. రావరణుని ఒంటికి తగిలి దేవతల ఆయుధములు తమ శక్తిని కోల్పోయాయి.

రావణుడు దశకంఠుడు. అంటే పది తలలు కలవాడు. అతనికి ఇరువది చేతులు, పది తలలు. ఆ కనకపు సింహాసనము మీద వెండి కొండమాదిరి ప్రకాశిస్తున్నాడు రావణుడు. రావణుడు పరాక్రమవంతుడే కాదు. ఇతరుల భార్యలు అంటే అతనికి మక్కువ ఎక్కువ. ఒకసారి భోగవతీ నగరానికి పోయి, తక్షకుని భార్యను బలాత్కారంగా తీసుకొని వచ్చాడు. రావణునికి ధర్మాచరణము మీద నమ్మకము లేదు. రావణుడు కుబేరుని ఓడించి అతని వద్ద ఉన్న పుష్పక విమానమును అపహరించాడు.

రావణుడు దివ్యాస్త్రములను ఎంత నేర్పుగా ప్రయోగిస్తాడో, అంతే నేర్పుతో సాధుజనులు చేయు యజ్ఞయాగములను భగ్నం చేస్తాడు. రావణునికి కోపం వస్తే సుందర ఉద్యానవనములను, అందమైన వనములను, సరస్సులను నాశనం చేస్తాడు. ఎదుటివారు బాధపడుతుంటే ఆనందించే తత్వం రావణునిది. రావణుడు ఎంతటి అధర్మపరుడైనా గొప్ప తపశ్శాలి. పూర్వము బ్రహ్మను గూర్చి పదివేల సంవత్సరములు తపస్సు చేసాడు. తన శిరస్సులను ఖండించి బ్రహ్మదేవునికి సమర్పించాడు. దాని ప్రతిఫలంగా బ్రహ్మదేవుని వద్దనుండి తనకు యుద్ధములో దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచములు, పక్షిజాతులు, సర్పజాతులు, ఒక్క మానవులు తప్ప ఏ ఇతర జీవ జాతుల నుండి కూడా తనకు మరణము లేకుండా వరం పొందాడు. మానవులు తనను ఏమీ చేయలేరని గుడ్డినమ్మకం రావణునిది.

రావణునికి దేవతలు అంటే మంట. ఋత్విక్కులు యజ్ఞయాగములలో హవిస్సులు దేవతలకు ఇవ్వకుండా ఆ యజ్ఞములను నాశనం చేసేవాడు. రావణుడు బ్రాహ్మణులను, ఋషులను, మునులను క్రూరంగా చంపేవాడు. అతని హృదయము పాషాణము. జాలి అనే పదానికి రావణునికి అర్థం తెలియదు. ప్రజలను హింసించడంలో ఆసక్తి చూపేవాడు.

అటువంటి రావణునికి శూర్పణఖ చెల్లెలు. తన గోడు చెప్పుకోడానికి శూర్పణఖ పరుగు పరుగున రావణుని వద్దకు వచ్చింది. కోయబడిన తన ముక్కు, చెవులను రావణుని చూపించి ఇలా
పలికింది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)