శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 33)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ముప్పది మూడవ సర్గ

“అన్నా రావణా! అక్కడ జనస్థానములో జరగకూడని ఘోరాలు జరిగిపోతూ ఉంటే నువ్వు ఇక్కడ, సంతోషంగా బంగారు సింహాసనము మీద కూర్చుని రాజభోగములు, అంత:పుర స్త్రీలతో కామసుఖాలు అనుభవిస్తున్నావా! నీ రాజ్యములో ఏమి జరుగుతూ ఉందో తెలుసుకోవాలి అన్న జ్ఞానం కూడా నీకు లేదా! నీ వలె కామోప భోగములలో మునిగి తేలుతూ రాజ్యక్షేమమును మరిచే రాజును ప్రజలు గౌరవించరు. అది తెలుసుకో! రాజు ఏ కాలంలో చేయాల్సిన పనులను ఆయాకాలములలో చేయక పోతే, ఆ రాజు, అతని రాజ్యము నశించిపోవడం తథ్యం. ప్రజలకు దూరంగా ఉంటూ, గూఢచారుల ద్వారా ప్రజల కష్టనష్టములు తెలుసుకోకుండా, ఇంద్రియలోలుడై ప్రవర్తించేరాజును ప్రజలు పదవీచ్యుతుడిని చేస్తారు. తమ ఇంద్రియములను తాము నిగ్రహించుకోలేని రాజులు, ప్రజలను ఏమి రక్షిస్తారు? అత్యంత బలవంతులైన దేవతలు, గంధర్వులు, దానవులు నీకు ప్రబల విరోధులు. వారి వలన నీకు ఎప్పుడూ ముప్పు పొంచి ఉంది. కాని నీవు వారి కదలికలను గూఢచారుల వలన తెలుసుకోకుండా ప్రమత్తుడవై ఉంటున్నావు. అటువంటి వాడివి నీవు రాజుగా ఎలా ఉండగలవు?

ఓ రావణా! రాజు అయిన వాడు తన కోశాగారమును, గూఢచార వ్యవస్థను, పరిపాలనా వ్యవహారములను, తన అధీనములో ఉంచుకొని జాగరూకతతో ప్రవర్తించాలి. అలా చేయకపోతే నీకూ, మామూలు మనిషికి తేడా లేదు. 

ఓ రాజా! నీకు గూఢచారులు కళ్లలాంటి వారు. వారిని నీవు నిర్లక్ష్యం చేస్తే, నీవు గుడ్డివాడి కింద లెక్క. నీవే కాదు నీ మంత్రులు కూడా అసమర్థులు అని తెలుస్తూ ఉంది. లేకపోతే కనీసం వారు అయినా జనస్థానంలో ఏమి జరుగుతూ ఉందో తమ గూఢచార వ్యవస్థద్వారా తెలుసుకోకుండా ఉంటారా!
ఒక్క మానవుడు, రాముడు అనే వాడు, 14,000 మంది రాక్షస వీరులను ఒంటి చేత్తో మట్టుపెట్టాడు. ఇది నీకు తెలుసా! ఆ రాముడు రాక్షసులను చంపి దండకారణ్యములో ఉన్న ఋషులకు మునులకు రక్షణ కల్పించాడు. జనస్థానములో రాక్షసులకు నిలువనీడలేకుండా చేసాడు. ఇవన్నీ నీకు తెలియవు. నీ సుఖములు, భోగలాలసత నీది. అధికార మదంతో నీవు ఏదీ పట్టించుకోవు. నీ రాజ్యము ప్రమాదంలో ఉంది అన్న విషయాన్ని కూడా నీవు గ్రహించలేకపోతున్నావు.

ఓ రావణా! నీవు గర్వాంధుడవు. మొండివాడివి. ప్రమత్తుడివి. ఇతరుల కష్టములను చూచి ఆనందించేవాడివి. అటువంటి నీవు కష్టములలో ఉంటే నీకు ఎవరూ సాయం చెయ్యరని, నీ మొహం కూడా చూడరని గుర్తుపెట్టుకో! నీ లాంటి గర్వాంధుడిని, ప్రజల కష్టసుఖములు పట్టించుకోనివాడిని, కోపిష్టిని ప్రజలే అంతమొం దిస్తారు. కార్యాకార్య విచక్షణ తెలియని రాజు రాజ్యభ్రష్టు డవుతాడు. ఒకసారి రాజ్యభ్రష్టత పొందిన రాజు, ఎంతటి సమర్థుడైనా, ప్రజల చేత గడ్డిపరక కన్నా హీనంగా చూడబడతాడు. అందుకని రాజు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఏమరుపాటు పనికిరాదు. అటువంటి రాజును ప్రజలు గౌరవిస్తారు. నీతి మంతుడైన రాజును, ఎల్లప్పుడూ అపత్తంగా ఉండే రాజును, అతడిని ప్రజలు దేవుడి వలె పూజిస్తారు.

ఓ అన్నా! రావణా! నీలో పైన చెప్పిన సుగుణములు ఏవీ లేవు. అందుకనే నీకు జనస్థానములో జరిగిన విషయములు ఏమీ తెలియవు. ఎందుకంటే నీవు మునులను., ఋషులను అవమానించడం, చంపడం, కామోపభోగములను అనుభవించడం, వీటితోనే కాలం గడుపుతున్నావు. నీకు విచక్షణా జ్ఞానం లేదు. మంచి చెడులను నిర్ణయించే బుద్ధిలేదు. అందుకే నీవు అతి త్వరలో ఆపదలలో చిక్కుకుంటావు. నీ రాజ్యం నశిస్తుంది. తర్వాత నీ ఇష్టం.” అని నానా విధాలుగా తిట్టి ముగించింది శూర్పణఖ.

ఆ మాటలు అన్నది వేరేవాళ్లు అయితే రావణుడు వాడి తలనరికి ఉండేవాడు. కానీ ఈ మాటలు అన్నది స్వయానా తన చెల్లెలు. ఎంతో ఆపద వస్తేనే గానీ ఆమె అలా అనదు. అందుకని శూర్పణఖ మాటలలో అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు రావణుడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పదిమూడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)