శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది నాలుగవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 34)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ముప్పది నాలుగవ సర్గ

నిండు సభలో, మంత్రి సామంత దండనాధుల ముందు తనను తన చెల్లెలు శూర్పణఖ ఆ ప్రకారంగా కించపరిచి మాట్లాడటం సహించలేకపోయాడు రావణుడు. ఆమె మాటలలో నిజం ఉన్నా, ఆ నిజాన్ని ఒప్పుకోడానికి అతని అహం అంగీకరించలేదు. అందుకని పెద్ద స్వరంతో ఇలా అన్నాడు.

"శూర్పణఖా! ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? రాముడు రాముడు అంటున్నావు. ఎవరా రాముడు! అతని బలపరాక్రమములు ఏపాటివి? అతను ఎలా ఉంటాడు? అతడు దండకారణ్యములోకి ఎందుకు ప్రవేశించాడు? నా సోదరులు ఖరుని, దూషణుని చంపాడు అంటున్నావు. అతని వద్ద ఏయే ఆయుధములు ఉన్నాయి. అనవసరమైన మాటలు మాని అసలు విషయం చెప్పు!" అని అన్నాడు రావణుడు.

అప్పటికి శూర్పణఖకు కూడా ఆవేశం చల్లారింది. రావణునికి ఉన్నది ఉన్నట్టు చెప్పడం మంచిది అని తలచి ఇలా చెప్పసాగింది.

“ఓ రాక్షసేంద్రా! ఆ రాముడు అయోధ్యాధిపతి దశరథుని కుమారుడు. అతడు ఆజానుబాహుడు. అరవిందళాయతాక్షుడు. ముని వేషములో ఉన్నాడు కానీ ధనుర్బాణములను ధరించాడు. సౌందర్యములో మన్మధుని మించినవాడు. అతడు నారాచ బాణములను అత్యంత వేగముగా ప్రయోగించగల నేర్పుగలవాడు. అతడు ఎప్పుడు బాణం తీస్తాడో ఎప్పుడు సంధిస్తాడో ఎప్పుడు వేస్తాడో ఎవరికి తెలియదు. కాని ఆబాణాలుతగిలి రాక్షసులు చావడం మాత్రం కనపడుతుంది.
అతని ధనుస్సుమాత్రం ఎల్లప్పుడు ఒంగి వర్తులాకారంలో ఉంటుంది. అతని యుద్ధము నేను ప్రత్యక్షముగా చూచాను. అతడు ఖరదూషణులను, వారి సేనాధిపతులను, 14,000 సైనికులను ఒకటిన్నర ముహూర్తకాలములో సంహరించాడు. (ముహూర్తము అంటే 48 నిమిషముల కాలము. అంటే మొత్తము యుద్ధము 72 నిమిషము లలో ముగిసిపోయింది అని అర్థము.). ఆ యుద్ధములో నేను తప్ప తక్కిన రాక్షసులు అందరూ మరణించారు. నేను స్త్రీని కాబట్టి నన్ను చంపలేదు అని అనుకుంటున్నాను.

ఆ రామునికి ఒక తమ్ముడు ఉన్నాడు. వాడి పేరు లక్ష్మణుడు. అతనికి మహాకోపము. అన్నతో సమానమైన బలపరాక్రమములు కలవాడు. అతనిని జయించడం కూడా చాలా కష్టము. రామునికి కుడిభుజము లక్షణుడు. ఇంక ఆ రామునికి ఒక భార్య ఉంది. ఆమె పేరు సీత. మహా సౌందర్యవతి. దేవతాస్త్రీలు, అప్సరసలు, గంధర్వ కాంతలు అందరూ అందంలో ఆమె కాలిగోటికి కూడా చాలరు.
ముల్లోకములలో సీత వంటి సౌందర్యవతిని, దేవ, దానవ, గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలలో నేను ఇంతవరకు చూడలేదు. రాముడు తన భార్యను అమితంగా ప్రేమిస్తాడు. అటువంటి సీత ప్రేమను పొందిన రాముడు దేవేంద్రుని కన్నా గొప్పవాడు. 

(ఇప్పటిదాకా ఉన్నది ఉన్నట్టు చెప్పిన శూర్పణఖ మాట మార్చింది.) 

రావణా! నా ఉద్దేశంలో సీత లాంటి సౌందర్యవతి నీ వంటి వాడి దగ్గర ఉండాలి కానీ ఆ మానవునికి భార్యగా తగదు. నీవే ఆమెకు తగిన భర్తవు. ఆమె సౌందర్యమును చూచిన తరువాత నీవే ఆమెకు తగినవాడివి అనుకొని, ఆ మాట చెప్పడానికి, సీతను తీసుకురావడానికి వారి వద్దకు వెళ్లాను. ఆ సీతను బలవంతంగా నీ వద్దకు తీసుకు రావడానికి ప్రయత్నించాను. అపుడు ఆ ధూర్తుడైన లక్ష్మణుడు నన్ను పట్టుకొని నా ముక్కు చెవులు కోసి నన్ను అవమానించాడు. నా సంగతి అటుంచు. ఈ సీతను నీవు ఒకసారి చూస్తే ఆమె లేకుండా తిరిగి లంకానగరానికి రావు. ఆమె చూపులు అనే మన్మధ బాణములకు బలి అయిపోతావు. నా కైతే ఆమె నీకు భార్యగా తగినది అనిపించింది. నీకు కూడా అదే ఉద్దేశ్యం ఉంటే వెంటనే బయలు దేరు. ఆ రామలక్ష్మణులను చంపి సీతను తీసుకొని రా. నీ భార్యగా చేసుకో. అమరసుఖాలు అనుభవించు. ఆ రామలక్ష్మణులను చంపి, రాముని చేతిలో చచ్చిన రాక్షసుల ఆత్మలకు శాంతి చేకూర్చు.
లక్షణుని చంపితేనే నా అవమానానికి ప్రతీకారం చేసిన వాడివి అవుతావు. రామలక్ష్మణులు చస్తే సీత నీ వశం అవుతుంది. సీతలాంటి సౌందర్యరాసి భార్యగా ఉన్న నిన్ను ముల్లోకాలు శ్లాఘిస్తాయి. నీ ఇష్టం అయితే నేను చెప్పినట్టు చెయ్యి. సీత మంచి మాటలతో నీకు లొంగకుంటే, బలత్కారంగానైనా తీసుకొనిరా! నీ భార్యగా చేసుకో! రాక్షసేంద్రా! అన్నింటి కన్నా ముందు, ఆ రాముడు నీ రాక్షససేనలను సర్వనాశనం చేసాడు అని గుర్తుంచుకో! రాముని సంహరించకపోతే దండ కారణ్యములో నీ సార్వభౌమత్వానికి విలువ ఉండదు. తరువాత నీ ఇష్టం.” అని లేని పోని మాటలతో రావణుని రెచ్చగొట్టింది శూర్పణఖ.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది నాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)