శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 35)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ముప్పది ఐదవ సర్గ

శూర్పణఖ చెప్పిన విషయాలను సావధానంగా విన్నాడు. రావణుడు. సభచాలించాడు. మంత్రులకు దండనాధులకు వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. శూర్పణఖ చెప్పిన విషయములను ఒకటికి రెండు సార్లు ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు.

శూర్పణఖ మాటల్లో అతనికి నచ్చింది సీత సౌందర్యవర్ణన. ఎక్కడ తగలాలో అక్యడే తగిలింది శూర్పణఖ వదిలిన మాటల బాణము. అంతా రహస్యంగా జరగాలి అనుకున్నాడు. మారువేషంలో రథశాలకు వెళ్లాడు. సారధిని వెంటనే రథము సిద్ధం చేయమన్నాడు. సారథి రథం సిద్ధం చేసాడు. రథానికి గాడిదలను కట్టాడు. వాటి ముఖాలు పిశాచాల మాదిరి ఉన్నాయి. రావణుడు రథం ఎక్కి సముద్రం వైపుకు వెళ్లాడు.

రావణుడు సముద్రం తీరం వెంట తన రథములో ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఎన్నో ముని ఆశ్రమములను చూస్తున్నాడు. ఆ అరణ్యములలో నాగులు, పక్షులు, గంధర్వులు, కింనరులు, వైఖానసులు, వాలఖిల్యులు, ఋషులు, సిద్ధులు, చారణులు స్వేచ్ఛగా నివసిస్తున్నారు. దారిలో రావణునికి దేవతలు ప్రయాణిస్తున్న విమానాలు కనపడుతున్నాయి. ఈ ప్రకారంగా అనేకములైన
అరణ్యములను ఉద్యానవనములను, సరస్సులను దాటుకుంటా ప్రయాణిస్తున్నాడు రావణుడు.
రావణుడు ప్రయాణిస్తున్న ప్రదేశమును జలప్రాయ ప్రదేశము అని అంటారు. ఆ ప్రదేశములో ఒక పెద్ద వటవృక్షము ఉంది. దాని కొమ్మలు, ఊడలు నూరు యోజనముల మేర విస్తరించి ఉన్నాయి. ఆ చెట్టు మీద కొంత మంది ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. వాలఖిల్యులు అనే ఋషులు కేవలము చంద్రకిరణములను మాత్రం ఆహారంగా తీసుకుంటూ ఆ కొమ్మలకు తలకిందులుగా వేలాడుతూ తపస్సుచేసుకుంటున్నారు.

ఒక సారి గరుడుడు తన తల్లి దాస్య విముక్తి కొరకు స్వర్గలోకము నుండి అమృతము తీసుకొని రావడానికి వెళుతున్నాడు. ఆహారంగా ఒక ఏనుగును, ఒక తాబేలును రెండు కాళ్లతో పట్టుకొని ఎగురుతున్నాడు. అంతలో విశాలమైన ఈ వటవృక్షము కనిపించింది. గరుడుడు నూరుయోజనముల పొడవు గల ఒక బలిష్టమైన కొమ్మమీద ఆ గజ,కచ్ఛపములతో వాలాడు. గరుడుని బరువుకు ఆ కొమ్మ పెళపెళమని విరిగింది. ఆ కొమ్మ విరిగితే దాని మీద తపస్సు చేసుకుంటున్న ఋషులకు, వేలాడుతున్న వాలఖిల్యులకు తపోభంగము అవుతుందని, గజకచ్ఛపములను చెరి ఒక కాలితో పట్టుకొని, ఆ కొమ్మను నోట కరచుకొని మరలా పైకి ఎగిరాడు. వారిని ఒక సమతల ప్రదేశముమీద దింపి, ఆ కొమ్మను నిషాదులు ఉన్న చోట విసిరేసాడు. తరువాత గరుడుడు గజ కచ్ఛపములను ఆరగించి, తరువాత అమృతం తేవడానికి స్వర్గమునకు వెళ్లాడు.

రావణుడు ఆ వటవృక్షమును దాటుకుంటూ వెళ్లాడు. అలా ప్రయాణిస్తూ రావణుడు సముద్రమును దాటాడు. సముద్రమునకు ఆవల ఉన్న ఒక ఆశ్రమమునకు వెళ్లాడు. అది మారీచుడు అనే రాక్షసుని ఆశ్రమము. మారీచుడు జన్మత: రాక్షసుడే అయినా ముని వృత్తి స్వీకరించి, జటావల్కలములు ధరించి ఆ ఆశ్రమంలో తపస్సుచేసుకుంటున్నాడు. రావణుడు తన ఆశ్రమమునకు రావడం చూచాడు మారీచుడు. రావణునికి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచిత రీతిని సత్కరించాడు. రావణునికి భోజన, పానీయాలు సమకూర్చాడు. కాస్త సేద దీరిన తరువాత మారీచుడు రావణుని ఇలా అడిగాడు.

“రావణా! రాక రాక ఇన్నాళ్లకు ఈ మారీచుని ఆశ్రమానికి వచ్చావు. ఏమి కారణము? లంకలో అంతా క్షేమంగా ఉన్నారు కదా!" అని కుశల ప్రశ్నలు వేసాడు. అప్పుడు రావణుడు మారీచునితో ఈ విధంగా అన్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)