శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది ఆరవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 36)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ముప్పది ఆరవ సర్గ
మారీచుడు రావణుని కన్నా పెద్దవాడు. అందుకని రావణుడు మారీచుని గౌరవంగా సంబోధిస్తున్నాడు.“ఓ తాతా! మారీచా! నేను చెప్పేమాటలను శ్రద్ధగా విను. ప్రస్తుతము నేను చాలా కష్టాలలో ఉన్నాను. నువ్వే నాకు మార్గం చూపించాలి. నా సోదరుడు ఖరుడు, దూషణుడు, వారి సేనాధిపతులు, 14,000 రాక్షస సేనలు, నరమాంస భక్షకుడైన త్రిశిరుడు, నా ఆజ్ఞమేరకు దండకారణ్యంలో స్థావరం ఏర్పరచుకొని జనస్థానంలో ఉంటున్నారు అని నీకు తెలుసు కదా!
ఈ మధ్య ఎవరో రాముడు అట. దండకారణ్యమునకు వచ్చాడు. మన వాళ్లు అతనిని ప్రతిఘటించారు. ఇద్దరి మధ్య పోరు సాగింది. మన వాళ్లు సాయుధులు, రథములు మొదలగు వాహనములు కలవారు. కాని ఆ రాముడు కేవలం ధనుస్సు మాత్రమే ఆయుధంగా కలవాడు. అతనికి ఏ వాహనమూ లేదు. కాని యుద్ధంలో రాముడు మన సేనలు 14,000 మందిని తుదముట్టించాడు. వారినే కాకుండా మహాబలవంతులు పరాక్రమవంతులు అయిన ఖరుని, దూషణుని, త్రిశిరుని కూడా చంపాడు.
ఇంతకూ ఆ రాముడు ఎవరంటే, అయోధ్యా రాజు దశరథుని కుమారుడు. రాముడు చిన్నప్పటి నుండి దుష్టుడు. దుర్మార్గుడు. ఇంద్రియలోలుడు. ఎప్పుడూ ఇతరులను హింసిస్తూ ఉండేవాడు. అధర్మపరుడు అటువంటి రాముని ఆగడములు సహించలేక అతని తండ్రి దశరథుడు రాముని, భార్యాసహితంగా దేశంనుంచి వెళ్లగొట్టాడు. ఆ రాముడు ఇప్పుడు దండకారణ్యమునకు వచ్చాడు. మనవాళ్లను అన్యాయంగా అక్రమంగా చంపాడు.
మారీచా! అంతేకాదు. రాముడు ఇంకో ఘోరం కూడా చేసాడు. తనకే కదా బలం, దరం ఉన్నాయని విర్రవీగుతూ, ఏ పాపమూ ఎరుగని నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోసి తన భార్యముందు నా చెల్లెలును అవమానించాడు. దీనికి ప్రతీకారము చెయ్యాలని నిశ్చయించుకున్నాను. రాముడు నా చెల్లెలును అవమానించాడు కాబట్టి నేను కూడా అతని భార్యను అవమానించాలి. రాముని భార్యను అపహరించి లంకకు తీసుకొని రావాలి. ఈ కార్యంలో నాకు నీ సహాయం కావాలి. ఎందుకంటే, నీవు నా పక్కన ఉంటే నాకు కొండంత బలం. నీ సహాయంతో నేను దేవతలను కూడా జయించగలను. నాకు సాయం చెయ్యడానికి నీవే సమర్థుడవు. నీ కన్నా బలవంతుడు, పరాక్రమ వంతుడు ముల్లోకాలలో ఎవరున్నారు. నీకు బలము, పరాక్రమమేకాదు, చతురోపాయములలో కూడా ప్రావీణ్యం ఉంది. ఉపాయంతో ఏ కార్యమునైనా సాధించగల నేర్పు ఉంది. పైగా నీకు ఎన్నో మాయలు తెలుసు. అందుకనే నీ దగ్గరకు వచ్చాను. నీ సాయం అర్ధిస్తున్నాను. ఇంతకూ నీవు చేయాల్సిన పని ఏమిటంటే రాముడు, అతని భార్య సీత, అతని తమ్ముడు లక్ష్మణుడు దండకారణ్యంలో ఒక పర్ణశాలలో నివసిస్తున్నారు. నీవు ఒక బంగారు వర్ణం కల లేడి రూపం ధరించి, సీతకు కనపడేటట్టు అటు ఇటు సంచరించు. నీ అందమైన రూపం చూచి. సీత తనకు ఆ బంగారు లేడి కావాలి అని రాముని అడుగుతుంది. నిన్ను పట్టుకోడానికి, ముందు రాముడు, తరువాత లక్ష్మణుడు నీ వెంట వస్తారు. నీవు వారికి అందకుండా దూరంగా పరుగెత్తు. రామలక్ష్మణులు నిన్ను వెంబడిస్తారు. అప్పుడు సీత ఒంటరిగా ఉంటుంది. అప్పుడు నేను సీతను అపహరిస్తాను. తన భార్య సీత లేకపోవడంతో రాముడు మానసికంగా, శారీరకంగా బలం కోల్పోతాడు. అపుడు సమయం చూచి నేను రాముని సంహరిస్తాను. యుద్ధములో ప్రాణాలు కోల్పోయిన 14,000 మంది రాక్షసులకు, నా సోదరులు ఖర,దూషణాదులకు ఆత్మశాంతి కలిగిస్తాను. నా చెల్లెలు రాముని మీద పెంచుకున్న పగ, ప్రతీకారము చల్లారుస్తాను. నాకీ సాయం చేసి పెట్టు." అని బతిమాలాడు.
రావణుడు చెబుతున్న కథ మారీచుడు శ్రద్ధగా విన్నాడు కానీ రాముని పేరు వినగానే మారీచునికి గొంతులో తడి ఆరిపోయింది. శరీరం వణికిపోయింది,. పెదాలు ఎండిపోయాయి. అలాగే
గుడ్లప్పగించి రావణుని వంక చూస్తున్నాడు. రావణుడు చెప్పడం ఆపి మారీచుని మొహంలోకి చూచాడు. మారీచుడు ధైర్యము కూడగట్టుకొని గొంతు సవరించుకొని రావణునితో ఇలా అన్నాడు.
గుడ్లప్పగించి రావణుని వంక చూస్తున్నాడు. రావణుడు చెప్పడం ఆపి మారీచుని మొహంలోకి చూచాడు. మారీచుడు ధైర్యము కూడగట్టుకొని గొంతు సవరించుకొని రావణునితో ఇలా అన్నాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment