శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 37)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ముప్పది ఏడవ సర్గ

“ఓ రాక్షసరాజా! నీ చుట్టూ ఎల్లప్పుడూ నిన్ను పొగిడేవాళ్లు, ప్రియంగా మాట్లాడేవాళ్లు ఉంటారు కానీ నీకు హితము చెప్పేవాళ్లు ఉండరు. ఒకవేళ అలాంటి వాళ్లు ఉన్నా నీలాంటి రాజులు వాళ్లు చెప్పే మాటలు వినరు. ఎందుకంటే అవి మీకు చెవులకు ఇంపుగా తోచవు కాబట్టి. నీవు ఎవరి మీద కైనా యుద్ధానికి పోయేముందు వారి గురించి తెలుసుకోడానికి గూఢచారులను నియమించావా? అలా నియమించి ఉంటే నీకు రాముని గురించి తెలిసి ఉండేది. నీకు రాముని గురించి ఏమీ తెలియదు అని తెలుస్తూ ఉంది. రాముడు గుణవంతుడు, పరాక్రమవంతుడు. వీరుడు. రాముడు తలుచుకుంటే ఈ భూమి మీద రాక్షసుడు అనేవాడు లేకుండా చేయగలడు. రాముడు అంత సమర్థుడు.

ఇప్పుడు నీవు సీత గురించి మాట్లాడుతున్నావు. ఆ సీత నీకు మృత్యువు అయిందేమో అని నా అనుమానము. లేకపోతే నీకు సీతను అపహరించవలెనని ఆలోచన పుట్టదు. దానికి నన్ను సాయం అడగవు. సీతాపహరణంలో నేను నీకు సాయం చేస్తే నాకు కూడా మృత్యువు తప్పదు. నీవు లంకారాజ్యానికి రాజుగా ఉన్నందుకు, లంక సర్వనాశనం కాక తప్పదు. నీ వలన లంకా వాసులు అష్టకష్టాలు పడక తప్పదు.

ఓ రావణా! నీ వంటి వాడు రాజుగా ఉంటే, ఆ రాజే కాదు అతడు పాలించే రాజ్యము కూడా నశించిపోతుంది. ఇంక అసలు విషయం చెబుతాను విను. రాముడు తండ్రిచేత వెళ్లకొట్టబడలేదు. నీకు ఎవరో కల్పించి చెప్పారు. రాజ్యమునుండి వెళ్లగొట్టబడేంత చెడ్డపనులు చేసేవాడు కాదు రాముడు. రాముడు నీవు అనుకున్నంత లుబ్ధుడు, దుశ్శీలుడు, దుష్టుడు, అధర్మపరుడు కాడు.
అసలు విషయం నేను చెబుతాను విను. దశరథుని భార్య కైక రాముని అడవులకు పంపమని దశరథుని వరం కోరితే, తల్లితండ్రుల మాట ప్రకారము అడవులకు వచ్చాడు రాముడు. కేవలము తండ్రి మాటను గౌరవించడానికి సమస్త రాజభోగములను, రాజ్యమును విడిచి అరణ్యవాసం చేస్తున్నాడు. అంతేగాని నీవు అనుకున్నట్టు రాజ్యం నుండి వెళ్ల గొట్టబడలేదు.
(ఇక్కడ మారీచుడు చెప్పినట్టు వాల్మీకి ఒక శ్లోకం రాసాడు. అది ఇప్పుడు ఒక నానుడి అయిపోయింది.)

రామో విగ్రహవాన్ ధర్మ: సాధు: సత్య పరాక్రమ:| రాజాసర్వస్య లోకస్య దేవానాం మఘవానివ.॥

రాముడు సాక్షాత్తు ధర్మ స్వరూపుడు. రాముని శరీరమే ధర్మానికి ప్రతీక. రాముడు సాధువు. నిజమైన పరాక్రమవంతుడు. దేవేంద్రుని వలె సకలలోకములను పాలించగల సమర్థుడు. రాముని భార్య సీత. రాముడు ఆమెను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడు తుంటాడు. సూర్యుని నుండి తేజస్సును వేరుచేయునట్లు రాముని నుండి సీతను వేరుచేయాలనే దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది. రామబాణము అనే మంటలలోకి నీవు శలభము వలె దూకపోతున్నావు. జాగ్రత్త. నా మాటవిను. సుఖంగా రాజ్యం చేసుకో. రాముని జోలికి వెళ్లకు. కోరి కోరి రాముని కోపజ్వాలలో పడి దగ్ధంకాకు.
రాముని రక్షణలో ఉన్నంత కాలము సీతను నీవు హరించలేవు. ఆ సీత కూడా రాముని విడిచి ఉండలేదు. అందుకే కదా సమస్తరాజభోగములను తృణప్రాయంగా త్యజించి రాముని వెంట అడవులకు వచ్చింది. సీతంటే ఎవరనుకున్నావు? అయోనిజ. మిథిలాధిపతి జనకమహారాజు కూతురు. ఆమె నీవంటి దుర్మార్గులకు అగ్నిజ్వాల వంటిది. కాబట్టి నా మాట విని సీత జోలికి పోకు.
ఇటువంటి వ్యర్ధమైన పనికి ఎందుకు పూనుకుంటావు?

సీతను అపహరిస్తే నిన్ను రాముడు ఎదుర్కొంటాడు. రాముని ఎదుటపడ్డ నీకు మరణం తప్పదు. ఎంతో కాలము రాజ్యము పాలిస్తూ, రాజభోగములు అనుభవించవలసిన వాడివి. అర్ధాంతరంగా నీ జీవితాన్ని ఎందుకు అంతం చేసుకుంటావు. నాలుగు కాలాలపాటు బతకాలని ఉంటే రాముని జోలికి పోకు. నా జోలికి రాకు.

నామాట మీద నమ్మకం లేకపోతే, నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడుకదా! అతనితో ఆలోచించు. నీ ఆలోచన మంచిదో కాదో వారిని అడిగి తెలుసుకో. వారు చెప్పినట్టు చెయ్యి. రామునితో వైరం పెట్టుకొనే ముందు, రాముని బలాన్ని నీ బలాన్ని తులనాత్మకంగా పరిశీలించు. హితాహితములు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకో. అంతేగానీ తొందరపాటు నిర్ణయం తీసుకొని కష్టాలపాలుగాకు.

ఇంతెందుకు, రాముడితో నా స్వానుభవం గురించి చెబుతాను విను. అప్పుడు నీకు తెలుస్తుంది, రామునితో వైరం మంచిదో కాదో!"అని మారీచుడు రామునితో తన అనుభవాన్ని ఈ విధంగా చెప్పాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పదిఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)