శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది ఎనిమిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 38)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ముప్పది ఎనిమిదవ సర్గ

“ఓ దానవేంద్రా! ఆ రోజుల్లో నేను మహా పరాక్రమంతో నాకు ఎదురు ఎవరూ లేరనే గర్వంతో భూమి అంతా తిరుగుతుండేవాడిని. చేతిలో పరిఘను ఆయుధంగా ధరించి అడ్డం వచ్చిన మునులను, ఋషులను చంపుతూ, వారి మాంసము తింటూ ఇష్టం వచ్చినట్టు సంచరించేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడు అనే ఋషి ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞాన్ని మేము భగ్నం చేసేవాళ్లము. మా బాధలు తట్టుకోలేక విశ్వామిత్రుడు రాముని తండ్రి దశరథుని వద్దకు పోయి

"ఓ దశరథ మహారాజా! మారీచుడు అనే రాక్షసుని వలన మాకు చాలా కష్టాలు కలుగుతున్నాయి. వాడి వలన మాకు చాలా భయంగా ఉంది. నీవు రాముని పంపి మా యజ్ఞాలు మారీచుని బారి
నుండి కాపాడు" అని అడిగాడు. దశరథుడు కొంచెం సేపు తటపటాయించి, తరువాత రాముని విశ్వామిత్రుని వెంట పంపాడు. రాముడు విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షిస్తున్నాడు.

ఇదంతా తెలియని నేను విశ్వామిత్రుని యజ్ఞమును భగ్నం చేయడానికి నా పరిఘను చేత పట్టుకొని అట్టహాసంగా విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్లాను. ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్న నన్ను చూచి రాముడు తన వింటికి నారి సంధించాడు. నేను రాముని వంక చూచాను. ఇంకా మీసములు కూడా రాని బాలుడు కదా అని రాముని గురించి నేను పట్టించుకోలేదు. నేను గబా గబా విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్న వేదిక వద్దకు వెళ్లాను.

రాముడు ఒక బాణమును సంధించి నా మీద ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకు నేను ఎగిరి నూరుయోజనముల దూరంలో ఉన్న సాగరంలో పడ్డాను. ఏం జరిగిందో తెలుసుకొనేటప్పటికి నేను నట్టనడిసముద్రంలో ఉన్నాను. రాముడు నన్ను చంపాలనుకోలేదు అందుకని సముద్రంలో పడవేసాడు. లేకపోతే నీతో ఇలా మాట్లాడటానికి నేను మిగిలి ఉండేవాడిని కాదు. ఆ ప్రకారంగా సాగరజలాలలో పడ్డ నాకు ఎంతో సేపటికి గానీ స్పృహ రాలేదు. తరువాత నానా పాట్లు పడి లంకానగరం చేరుకున్నాను. తరువాత తెలిసింది నన్ను సాగరంలో పడేట్టు కొట్టిన తరువాత రాముడు నా తోటి రాక్షసుల నందరినీ సంహరించాడని.

ఓ రావణా! అప్పుడు రాముడు బాలుడు. ఇంకా అస్త్రవిద్య పూర్తిగా నేర్చుకోలేదు. ఇప్పుడు చూచావుగా రాముని ప్రతాపము. 14,000 వేల మందిని ముహూర్తకాలంలో చంపాడు. కాబట్టి రాముడితో విరోధము పెట్టుకోకు. తరువాత నీ ఇష్టం.

లంకా నగరము దూరంగా సముద్రమధ్యలో ఉంది కాబట్టి లంకావాసులందరూ భోగాలు అనుభవిస్తూ సుఖంగా జీవిస్తున్నారు. నీ పుణ్యమా అని వారిని ఆ సుఖాలకు దూరం చెయ్యకు. సీత కారణంగా లంకానగరం నాశనం చెయ్యకు. ఇనుముతో కూడిన అగ్ని సమ్మెట దెబ్బలు తిన్నట్టు, నీవు రాజుగా ఉన్న కారణంగా లంకానగరం అంతా ఆపదలలో చిక్కుకుంటుంది. నీ మూలంగా రాక్షసులు అంతా మరణిస్తే, వారి భార్యలకు దిక్కు ఎవ్వరు. ఒక్క స్త్రీ కారణం ఎంతోమంది రాక్షసస్త్రీలను అనాధలుగా చేస్తావా! నువ్వు సీతను అపహరించినట్టు వాళ్లను కూడా ఎవరైనా అపహరిస్తే వాళ్లకు దిక్కెవ్వరు?

ఓ దానవేంద్రా! నీకు ఎంతో మంది అందమైన అప్సరసలవంటి భార్యలు ఉన్నారు కదా! ఇంకా ఈ పరభార్యల మీద నీకు ఎందుకయ్యా వ్యామోహము. పరదారాపహరణము పాపం అని తెలియదా! నా మాట విను. నీ భార్యలతో సంతృప్తి చెందు. వారితో సుఖించు. సీతను మరిచిపో. నీవు నాలుగు కాలాల పాటు నీభార్యలతో రాజభోగాలు అనుభవించాలంటే రామునితో వైరం పెట్టుకోకు.
నేను ఇన్ని చెప్పినా వినకుండా సీతను అపహరిస్తే, రాముని కోపాగ్నిలో మాడి మసి అయిపోతావు. నీ లంకా నగరం అంతా నాశనం అయిపోతుంది. నీవు బంధు మిత్రులతో సహా యమసదనానికి
ప్రయాణం కడతావు." అని రావణునికి హితోపదేశం చేసాడు మారీచుడు.

మారీచుడు రావణుని వంక చూచాడు. రావణునిలో ఏమాతం మార్పు కనిపించలేదు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)