శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది తొమ్మిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 39)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ముప్పది తొమ్మిదవ సర్గ

తాను చేసిన హితోపదేశములు రావణునికి తలకెక్కలేదని గ్రహించాడు మారీచుడు. ఇంకా తన అనుభవాలు చెప్పడం మొదలెట్టాడు.

“ఓ రాక్షసరాజా! రాముని చేతిలో దెబ్బతిన్న నాకు ఇంకా బుద్ధిరాలేదు. నేను మాయారూపములు ధరించడంలో సిద్ధహస్తుణ్ణి. నేను ఒక మృగరూపము ధరించి, ఇంకా ఇద్దరు రాక్షసులను నా వెంట తీసుకొని దండకారణ్యమునకుపోయాను. అప్పుడు నా రూపము మహా భయంకరంగా ఉండేది. పెద్ద దేహము, ఎర్రటి నాలుక, వాడి అయిన కోరలు, మహాభయంకారాకారముతో దండకారణ్యములో సంచరిస్తూ మునులను, ఋషులను బెదిరిస్తూ వారిని హింసిస్తూ, వారిని చంపి తింటూ ఉండేవాడిని.

ఒకసారి నాకు రాముడు తారసపడ్డాడు. అంతకు ముందు రాముడు నన్ను కొట్టిన దెబ్బ నాకు గుర్తుకు వచ్చింది. రాముడు ఇప్పుడు మునివేషములో ఉన్నాడు. నన్నేమి చెయ్యగలడు అని అనుకొన్నాను. అంతకు ముందు రాముడు నన్ను కొట్టిన దెబ్బకు ప్రతీకారము తీర్చుకోవాలి అనుకున్నాను. వెంటనే మహోగ్రరూపంతో రాముని మీదికి దూకాను.

తన మీదికి దూకుతున్న నన్ను చూచి రాముడు, తన ధనుస్సు నుండి మూడు బాణములు ప్రయోగించాడు. ఆ బాణములు వాయు వేగంతో వచ్చి నాకు తాకాయి. రామ బాణములను చూచి నాకు భయం వేసి పక్కకు తప్పుకున్నాను. కాని నా వెంట ఉన్న ఇద్దరు రాక్షసులు ఆ బాణాలకు బలి అయ్యారు.

మొదటి సారి రాముని చేతిలో దెబ్బ తిన్నాను. రెండవసారి రామ బాణము నుండి తప్పించుకున్నాను. ఇంక మరలా రాముని జోలికి పోదలుచుకోలేదు. అందుకని అప్పటి నుండి ముని వృత్తి అవలంబించి ఇక్క ఆశ్రమము నిర్మిచుకొని సన్యాసిగా జీవించు చున్నాను.
జటాజూటములతో నార చీరలతో ఎవరు కనపడ్డా నాకు రాముడే గుర్తుకువస్తున్నాడు. రాముడు కలలో కనిపించినా భయంతో వణికిపోతున్నాను. అసలు నాకు “ర” అనే అక్షరంలో ప్రారంభం అయ్యే ఏ వస్సువును చూచినా రాముని చూచినట్టే భయం కలుగుతూ ఉంది. నాకు రామ బాణము శక్తి తెలుసు కాబట్టి ఇంతదాకా చెప్పవలసి వచ్చినది. తరువాత నీ ఇష్టం.

నీకు ఇష్టం అయితే రామునితో యుద్ధం చెయ్యి. లేకపోతే మానెయ్యి. కాని నన్ను మాత్రము ఇందులోకి లాగకు. నేను నాలుగు కాలాల పాటు జీవించాలని నీకు ఉంటే, నా ముందు రాముని మాట ఎత్తకు. నీవు చేసే పాపపు పనులకు నన్ను బాధ్యుడిని చేయకు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను మాత్రము నీ వెంటరాను. నీకు సాయం చెయ్యను. ఆ రాముడు రాక్షసుల పాలిట మృత్యువు అని నీవు తెలుసుకోలేకపోతున్నావు.

ఓ రావణా! ఇందులో రాముని తప్పు ఏముంది చెప్పు. ఆ శూర్పణఖ మాటలు విని ఖరుడు, దూషణుడు రాముని తో యుద్ధానికి పోకపోతే వ్యవహారము ఇంతవరకూ రాదు కదా! 14,000 మంది బలి అయ్యేవారుకాదు కదా! రాముడు తనంత తాను నీ స్థావరమునకు వచ్చి నీతో యుద్ధము చేయలేదుకదా! నీ సోదరులను, సైన్యాది పతులను అపార సేనలను పోగొట్టుకున్నా ఇంకా నీకు బుద్ధిరాలేదా! మిగిలిన బంధువులను, మిత్రులను రామ బాణములకు బలి చేయదలచుకున్నావా! నా హితోక్తులు విని నీవు రామునితో వైరము మానకపోతే నీకు సర్వనాశనం తప్పదు." అని అన్నాడు మారీచుడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)