శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 40)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
నలుబదవ సర్గ
మారీచుడు సుదీర్ఘంగా చెప్పిన హితోక్తులు రావణునికి రుచించలేదు. చావబోయేవాడికి అమృత తుల్యమైన ఔషధము రుచించనట్టు మారీచుని మాటలు రావణునికి తలకెక్కలేదు. పైగా తన ముందు తన శత్రువు అయిన రాముని మారీచుడు పొగడటం చూచి రావణునికి కోపం వచ్చింది.“మారీచా! నీవు ఏవేవో వ్యర్ధములైన మాటలు మాట్లాడు తున్నావు. వాటి వల్ల ఏమీ ప్రయోజనము లేదు. నీవు పొగిడిన రాముడు కేవలం ఒక మానవమాత్రుడు. పైగా మూర్ఖుడు. నీ మాటలు విని ఒక మానవునికి భయపడే పిరికిపంద కాడు ఈ రావణుడు. ఒక స్త్రీకోరిన కోరికలు తీర్చడానికి, తల్లితండ్రులను బంధుమిత్రులను విడిచి భార్యతో సహా పారిపోయిన పిరికి పంద ఆ రాముడు.
ఆ రాముడు నా ప్రియాతి ప్రియమైన సోదరుడు ఖరుని చంపాడు. దానికి ప్రతీకారంగా నేను కూడా రాముడు తన ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించే అతని భార్యను అపహరిస్తాను. దానికి నీ సాయం కావాలి తప్పదు. నేను ఒక నిర్ణయం తీసుకున్న తరువాత, దేవేంద్రుడు దిగివచ్చినా నా నిర్ణయం మార్చుకోను. నేను నిన్ను సాయం చెయ్యమని అడిగాను అంతే కానీ, నా నిర్ణయం తప్పా ఒప్పా అని నేను నిన్ను అడగలేదు. కాబట్టి నీవు అలా మాట్లాడటం తగదు. అయినా, నీ మాటలు నేను పట్టించుకోనవసరం లేదు. మంత్రులు రాజు అడిగినప్పుడు మాత్రమే తగిన సమాధానము వినయంగా చేతులు కట్టుకొని మరీ చెప్పాలి. అదీకూడా రాజుకు ఇష్టమైనవి, అంగీకారయోగ్యమైన మాటలు మాత్రమే చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు.
ఓ మారీచా! నీవు చెప్పేది ఎంత హితమైనా, చెప్పేవిధానంలో తిరస్కారధోరణి ఉంటే ఆ హితోక్తులను రాజులు హర్షించరు. నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. నేను నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను. అటువంటి నాతో ఇంత పరుషంగా మాట్లాడతావా! నేను నిన్ను సాయం చెయ్యమని అడిగాను. నేను చెయ్యబోయే పని మంచిదా చెడ్డదా! నేను చెయ్యగలనా లేదా! నేను సమర్థుడినా కాదా! అని నేను నిన్ను అడగలేదు. కాబట్టి నేను చెప్పింది విను. ఈ కార్యంలో నీవు నాకు సాయం చేస్తున్నావు. ఇది నా ఆజ్ఞ. నీవు ఏమి చెయ్యాలో చెబుతాను శ్రద్ధగా విను. నీవు మాయారూపములు ధరించుటలో ప్రజ్ఞాశాలివి. అందుకని నీవు ఒక బంగారు వర్ణము కల లేడి రూపము ధరించు. రాముని ఆశ్రమమునకు వెళ్లు. సీత చూచేట్టు ఆ పరిసరములలో సంచరించు. ఆమె నిన్ను చూచి నీ మీద ఆసక్తి పెంచుకుంటుంది. తరువాత నీ ఇష్టం. ఎటైనా పరుగెత్తు.
సీత మృగరూపంలో ఉన్న నిన్ను చూచి "ఆ బంగారు లేడి నాకు కావాలి" అని రాముని అడుగుతుంది. భార్య మాటలు విని రాముడు ధనుర్బాణములు ధరించి నిన్ను పట్టుకోడానికి నీ వెంట వస్తాడు. నీవు పరుగెత్తు. చాలా దూరం పోయిన తరువాత “హా సీతా హా లక్ష్మణా" అనిపెద్దగా రాముని గొంతుకతో, రాముడు అరిచినట్టు అరువు. ఆశ్రమంలో ఉన్న లక్ష్మణుడు ఆ అరుపులు వింటాడు. కంగారు పడుతూ రాముని వెదుక్కుంటూ వస్తాడు. రాముడు లక్ష్మణుడు ఆశ్రమంలో లేని సమయంలో నేను ఆశ్రమంలో ప్రవేసించి సీతను బలవంతంగా తీసుకొని వస్తాను. నీవు రామ బాణమునకు అందకుండా పరుగెత్తు. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్లిపో. నీవు నాకు ఈ పని చేసి పెడితే, నీకు నా రాజ్యంలో అర్థ రాజ్యం ఇస్తాను.
ఓ మారీచా! వెంటనే బయలుదేరు. నేను నీ వెంటనే నా రథం మీద వస్తాను. నీవు రాముని తీసుకొని అడవులలోకి పరుగెత్తు. నేను సీతను అపహరించి లంకకు తీసుకొని వస్తాను. మనం లంకలో కలుసుకుందాము. నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపుతాను. లేకపోతే బలవంతంగా నైనా నీతో ఈ పని చేయిస్తాను. రాజును ఎదిరించి ఎవరూ సుఖంగా బతకలేరు అన్న సత్యాన్ని తెలుసుకో!
మారీచా! ఇంకొక విషయం. నీవు రాముని చేతిలో చావ వచ్చు, చావ కుండా తప్పించుకోనూవచ్చు. కాని నేను చెప్పినట్టు చేయకపోతే నా చేతిలో నీ చావు తప్పదు. కాబట్టి బాగా ఆలోచించుకొని ఏది మంచిదో అది చెయ్యి." అని తన నిర్ణయాన్ని తెలియజేసాడు రావణుడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment