శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది ఏడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 27)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ఇరువది ఏడవ సర్గ

త్రిశిరస్సుడు అనే సైన్యాధిపతి ఖరుడు రాముని వైపు దూసుకువెళ్లడం చూచాడు. వెంటనే త్రిశిరస్సుడు ఖరుడి వద్దకు వచ్చాడు.

“ఓ వీరుడా! ఒక సాధారణ మానవుని సంహరించడానికి నీవు వెళ్లవలెనా! మేము లేమా! నాకు అనుజ్ఞ ఇమ్ము. నేను వెళ్లి రాముని సంహరిస్తాను. ఈ రాముడి చావు నా చేతిలో ఉంది. నేను చంపుతాను. లేకపోతే రాముని చేతిలో నేను చస్తాను. నువ్వు మాత్రం చూస్తూ ఉండు. ఒక వేళ నేను రాముణ్ణి చంపితే మనం అందరం ఆనందంతో జనస్థానమునకు వెళ్లాము. లేక రాముడు నన్ను చంపితే, అప్పుడు నువ్వే వెళ్లి రాముని చంపవచ్చును." అని అన్నాడు త్రిశిరుడు.

ఆమాటలు విన్న ఖరుడు ఆనందంతో త్రిశిరునికి రామునితో యుద్ధము చేయమని అనుమతి ఇచ్చాడు. త్రిశిరుడు తన రథము ఎక్కి రాముని మీదికి యుద్ధమునకు వెళ్లాడు. రాముని మీద బాణములను వర్షము వలె కురిపించాడు. ఆ బాణములనన్నింటికీ రాముడు మధ్యలోనే తుంచాడు.
రాముడు త్రిశిరస్సుల మధ్య పోరు భయంకరంగా జరిగింది. త్రిశిరుడు రాముని నుదుటిపై తగిలేటట్టు మూడు బాణములను వదిలాడు. రాముడు కోపించి సర్పములవలె దూసుకు వెళ్లే నాలుగు బాణములను త్రిశిరుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. మరొక నాలుగు బాణములతో త్రిశిరుడు ఎక్కిన రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. త్రిశిరుడు తేరుకొనే లోపల రాముడు అతని రథము నడుపుతున్న సారధిని చంపాడు. మరొక బాణంతో
పతాకమును విరిచాడు.
త్రిశిరుడు రథమునుండి పైకి ఎగరబోయాడు. ఎగిరే ఆ త్రిశిరుని గుండెలకు గురిపెట్టి రాముడు నాలుగు బాణములను ప్రయోగించాడు. మరొక మూడు బాణములను సంధించి త్రిశిరుని మూడు తలలను ఖండించాడు. త్రిశిరుని తలలు తాటికాయల మాదిరి నేలమీద పడ్డాయి. ఆ వెంటనే త్రిశిరుని శరీరము నేలమీద పడింది.

ఎప్పుడైతే త్రిశిరుడు చచ్చాడో, అతని సేనలు చెల్లాచెదురుగా పారిపోయాయి. రాక్షస సేనలు వెనుతిరిగి పారిపోవడం చూచాడు ఖరుడు. త్రిశిరుడు చచ్చాడు అని తెలుసుకున్నాడు ఖరుడు. పారిపోతున్న సేనలను కూడగట్టుకొని రాముని మీదికి యుద్ధానికి వెళ్లాడు ఖరుడు.

శ్రీమద్రామాయణము,
అరణ్యకాండము ఇరువది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)