శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది ఆరవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 26)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఇరువది ఆరవ సర్గ
తన సైన్యము అంతా రాముని బాణములకు ఆహుతి కావడం చూచాడు దూషణుడు. దూషణుడు తన వెంట వచ్చిన రాక్షస సేనలను ఐదువేల మందిని తీసుకొని రాముని మీదికి వెళ్లాడు. ఆ ఐదువేల మంది రాక్షస సైన్యము రాముని చుట్టు ముట్టారు. రాముని మీద శూలములు, పట్టిసములు, కత్తులు, రాళ్లు, చెట్లు, బాణములు వర్షంలా కురిపిస్తున్నారు. రాముడు కూడా తన బాణములతో వారు తన మీదికి విసురుతున్న శూలములను, పట్టిసములను, కత్తులను, చెట్లను, సమర్ధంగా ఎదుర్కొంటున్నాడు.రాక్షసులు తన మీద ఆయుధములు ప్రయోగించే కొద్దీ రాముని కోపం పెరుగుతూ ఉంది. రాముడు వేలకొలది బాణములతో దూషణుని సైన్యమును కప్పివేసాడు. ఇది చూచిన దూషణుడు రాముని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. రాముడు అర్ధచంద్రాకారములో ఉన్న బాణముతో దూషణుని విల్లు విరిచాడు. నాలుగుబాణములతో దూషణుని రథమునకు కట్టిన హయములను చంపాడు. మరొక అర్థచంద్రబాణముతో సారధి తల నరికాడు. మూడుబాణములతో దూషణుని కొట్టాడు.
దూషణుని ధనుస్సు విరిగింది. రథం కూలింది. సారథి చచ్చాడు. దూషణుడు నేలమీదికి దూకాడు. ఒక పెద్ద పరిఘను తీసుకున్నాడు. రాముని మీదికి పరుగెత్తాడు. అది చూచి రాముడు రెండు బాణములతో దూషణుని రెండు చేతులను బుజాల వద్ద నరికాడు. వాడి చేతులు పరిఘతో సహా నేలకూలాయి. చేతులు విరిగిన దూషణుడు నిలువునా కింద పడ్డాడు. ఇది చూచి దూషణుని సేనాధి పతులు అయిన మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాథీ అను ముగ్గురు తమ తమ ఆయుధములను తీసుకొని రాముని మీదికి వెళ్లారు. మహాకపాలుడు శూలమును, స్థూలాక్షుడు పట్టిసమును, ప్రమాథి గండ్రగొడ్డలిని ధరించారు. వారిని చూచి రాముడు వారి మీద బాణవర్షము కురిపించాడు. మహాకపాలుని తల నరికాడు. స్థూలాక్షుని కళ్లలో రాముడు వదిలిన బాణములు గుచ్చుకున్నాయి. ప్రమాథి గుండెలను చీల్చాడు రాముడు. ఆ ప్రకారంగా రాముడు దూషణుని, అతని సేనాధి పతులు ముగ్గురను, ఐదువేలమంది సైనికులను మట్టుబెట్టాడు.
తన సోదరుడు దూషణుడు అతని సైన్యము సమూలంగా నాశనం అవడం చూచాడు ఖరుడు. తన సేనాధి పతులను పిలిచాడు.
"సేనానాయకులారా! నా సోదరుడు దూషణుడు అతని సైన్యము రాముని చేతిలో హతం అయ్యారు. మీరు మీ మీ సేనలతో రాముని హతమార్చండి. వెళ్లండి" అని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా తన సేనానాయకులను ఆజ్ఞాపించిన ఖరుడు తాను కూడా ఆయుధములు ధరించి రాముని మీదికి పరుగెత్తాడు. ఖరుని సేనానాయకులైన శ్యేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాశనుడు అనే పన్నెండు మంది సేనానాయకులు ఖరుని వెంట రాముని మీదికి ఉరికారు.
రాముడు తన వజ్రసమానములైన బాణములతో ఖరుని సేనలను తుత్తునియలు చేసాడు. రాముడు కర్ణి అనే పేరుగల నూరు బాణములతోనూ, మరో వెయ్యిమందిని వాడి అయిన బాణములతోనూ సంహరించాడు. రాముని చేత చంపబడ్డ రాక్షసుల శరీరములతో ఆ ప్రాంతమంతా కప్పబడిపోయింది.
ఏ వాహనమూ లేకుండా, ఇతర సైన్యసాయము లేకుండా రాముడు ఒంటరిగా ధనుర్ధారియై 14,000 మంది రాక్షసులను మట్టుబెట్టాడు. వారిలో ఖరుడు, త్రిశిరుడు మిగిలారు. తన సైన్యము అంతా సర్వనాశనం కావడం చూచి ఖరుడు కోపంతో రగిలిపోయాడు. తన రథం ఎక్కి, ఆయుధములను ధరించి, రాముని మీదికి వెళ్లాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment