శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 25)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ఇరువది ఐదవ సర్గ

ఖరుడు తన రధాన్ని తన సేనల ముందు నిలబెట్టాడు. ధనుర్బాణములతో నేలమీద నిలుచుని ఉన్న రాముని చూచాడు.

"రథమును రాముని మీదికి నడిపిపంచు" అని సారధిని ఆజ్ఞాపించాడు ఖరుడు.

ఖరుని ఆజ్ఞను అందుకొని సారథి రథమును రాముని మీదికి పోనిచ్చాడు. అది చూచి రాక్షస సేనలు కూడా రాముని మీదికి తమ తమ రథములను నడిపించాయి. రాముని చుట్టుముట్టాయి. రాముని మీద బాణముల వర్షము కురిపించాయి.

ఆ బాణఘాతములను రాముడు చిరునవ్వుతో స్వీకరించాడు. ఆ బాణములు తన దేహమును బాధించినా ఓర్చుకున్నాడు. రాక్షసులు ప్రయోగించిన బాణములతో, ఆయుధముల దెబ్బలతో రాముని శరీరం అంతా రక్తసిక్తము అయింది. కాని రాముడు చలించలేదు.

అన్ని వేల మంది రాక్షసులు ఒక్కుమ్మడిగా ఒంటరిగా ఉన్న రాముని చుట్టుముట్టి గాయపరచడం చూచి ఆకాశంలో నిలబడ్డ దేవతలు, గంధర్వులు ఎంతో వ్యధచెందారు. అన్ని దెబ్బలు తింటేగానీ, రామునికి రాక్షసులను చంపాలి అన్నంత కోపం రాలేదు. (రాముడు కోపం తెచ్చుకున్నాడు అన్న మాటకు అర్థం ఇదేకాబోలు.)

అప్పుడు రాముడు కోపంతో కంపించి పోయాడు. తన ధనుస్సును మండలాకారంగా వంచి వేలకొలది బాణములను రాక్షసుల మీద ప్రయోగించాడు. (ధనుస్సు నిలువుగా ఉంటుంది. ఎక్కుపెడితో గుండ్రంగా వంగుతుంది. రాముని ధనుస్సు గుండ్రంగా ఉంది అంటే రాముడు ఎంత వేగంగా బాణాలు ప్రయోగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు)

రాముడు తన వద్దఉన్న దివ్యాస్త్రములను వెంట వెంటనే ఒకదాని వెంట ఒకటిగా రాక్షసుల మీద ప్రయోగించాడు. రాముని బాణముల ధాటికి తట్టుకోలేక రాక్షస సైన్యము నేలకొరిగింది. రాముడు వదిలిన ఒక్కొక్క బాణము ఒక్కొక్క రాక్షసుని గుండెలు చీల్చింది. రాముడు ప్రయోగించిన వేలకొలది బాణములు వేలకొలది రాక్షసులను మట్టుబెట్టాయి. రాముడు తన బాణములతో రాక్షసుల రథములను విరగ్గొట్టాడు. హయములను, గజములను చంపాడు. పతాకములను విరిచాడు. రథికులు, ఆశ్వికులు, పదాతి దళము అందరూ రామ బాణములకు ఆహుతి అయ్యారు. రాముని బాణముల దెబ్బలకు తాళలేక రాక్షసులు చేయు హాహాకారములతో ఆ ప్రాంతము అంతా మార్మోగి పోయింది.

చావగా మిగిలిన రాక్షస వీరులు రాముని మీదికి గండ్రగొడ్డళ్లను, శూలములను, కత్తులను విసిరారు. రాముడు నిర్విరామంగా బాణప్రయోగం చేస్తూ వారు విసిరిన నానారకాల ఆయుధములను మధ్యలోనే తుంచేసాడు. ఆ ఆయుధములు ప్రయోగించిన వారి కంఠములు ఖండించాడు. అలా రాక్షసుల తలకాయలు తెగి పడుతుంటే, ఆ ప్రాంతమంతా రాక్షసుల కళేబరాలతో నిండిపోయింది. చావగా మిగిలిన రాక్షసులు పరుగు పరుగున ఖరుని వద్దకు పోయి దాక్కున్నారు.
ఖరుని పక్కనే ఉన్న దూషణుడు వారినందరినీ ఓదార్చి, ధైర్యము చెప్పి, వారినందరినీ వెంటబెట్టుకొని పట్టరాని కోపంతో రాముని మీదికి ఉరికాడు. దూషణుని నాయకత్వంలో రాక్షసులు చేతికి అందిన రాళ్లను, చెట్లను పట్టుకొని రాముని మీదికి లంఘించారు. రాముని మీదికి చెట్లను రాళ్లను విసిరారు. రాముడు వాటిని తన శరములతో పిండి పిండి చేసాడు.

ఆ ప్రకారంగా రాక్షసులకు రామునికి ఘోరయుద్ధము జరిగింది. ఇలా కాదని రాక్షసులు అందరూ రాముని చుట్టుచేరి ఆయుధములను ప్రయోగించారు. అది చూచిన రాముడు వారి మీద గాంధర్వము అనే అస్త్రమును పయోగించాడు. అస్త్రప్రభావంతో రాక్షసులకు తాము ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో తెలియడం లేదు. రాముడు ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు వదులుతున్నాడో తెలియడం లేదు. రాముని ధనుస్సు మండలాకారంలో ఉండటం మాత్రం కనపడుతూ ఉంది వారికి. కాని రాముని ధనుస్సునుండి వెలువడిన బాణములు రాక్షసులను హతమారుస్తున్నాయి.

ఆ ప్రాంతమంతా రాక్షసుల తలలతోనూ, కాళ్లతోనూ, మొండెములతోనూ నిండిపోయింది. వారి వారి ఆయుథములు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వారే కాదు వారు ఎక్కి వచ్చిన గుర్రములు, ఏనుగులు కూడా చచ్చి పడి ఉన్నాయి. రథములు, వాటికి కట్టిన పతాకములు తునా తునకలుగా విరిగిపడి ఉన్నాయి. రాక్షసుల మృతకళేబరములతో ఆ ప్రాంతం అంతా భయంకరంగా, భీభత్సంగా ఉంది.

శ్రీమద్రామాయణము
అరణ్యపర్వము ఇరువది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)