శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది నాలుగవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 24)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఇరువది నాలుగవ సర్గ
జనస్థానములో ఖరుడికి కనపడ్డ దుశ్శకునములు అన్నీ పంచవటిలో ఉన్న రామలక్ష్మణులకు కూడా కనపడ్డాయి. వాటిని చూచిన రాముడు లక్షణునితో ఇలా అన్నాడు.“లక్ష్మణా! ఆకాశంలో కనపడే దుశ్శకునములను చూచావు కదా! ఇవన్నీ రాక్షస సంహారాన్ని సూచిస్తున్నాయి. ఇటువంటి శకునములు ఒక మహాయుద్ధమునకు ముందుకనపడతాయి. అరణ్యములో మృగములు అరిచే అరుపులు వింటుంటే మనకు కూడా అపాయము కలుగుతుంది అని అనిపిస్తూ ఉంది. ప్రాణాపాయము కూడా కలగ వచ్చు. కాబట్టి ఇక్కడ ఒక మహాయుద్ధము జరగబోతోంది అనుటలో సందేహము లేదు.
లక్ష్మణా! జాగ్రత్తగా విను. రాక్షసుల అరుపులు, భేరీనినాదములు వినిపిస్తున్నాయి. రాక్షసులు మనమీదికి యుద్ధానికి వస్తున్నారు. కాబట్టి మనము జరగబోయే దానికి దుఃఖిస్తూ కూర్చోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. నీవు ధనుర్బాణములు ధరించి, సీతను తీసుకొని, చెట్లతోనూ, పొదలతోనూ కప్పబడి ఉన్న ఆ గుహలో ప్రవేశించు. నా మాటకు అడ్డు చెప్పవద్దు.
“నేనే రాక్షసులను చంపుతాను." అనే మాటలు చెప్పవద్దు. మనకు సీత క్షేమము ముఖ్యము. నీవు సీతకు రక్షణగా ఉండు. నేను రాక్షసులను చంపుతాను. అంటే నీవు రాక్షసులను చంపలేవని కాదు. నీవు వీరాధివీరుడవు, శూరుడవు. నీవు ఒక్కడివే అందరు రాక్షసులను మట్టుపెట్టగలవు. కానీ నేను ఒక్కడినే రాక్షస సంహారము చేయవలెనని కోరికగా ఉంది. అందుకనీ నీవు సీతను తీసుకొని వెళ్లు." అని అన్నాడు రాముడు.
రాముని మాటను మీరలేక, లక్ష్మణుడు, సీతను తీసుకొని గుహలోకి ప్రవేశించాడు. రాముడు కవచమును ధరించాడు. ధనుర్బాణములు తీసుకున్నాడు. ధనుష్టంకారము చేసాడు. రాముడు మొదటిసారిగా రాక్షసులతో యుద్ధ చేయబోతున్నాడు. అందుకని ఆకాశంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు అందరూ సమావేశమయ్యారు.
“రాముడు ఒక్కడు. రాక్షస సేనలు 14,000 ఎలా యుద్ధం చేస్తాడు.” అని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. వాళ్ల కళ్లకు రాముడు ప్రళయ కాల రుద్రుడిలా కనపడుతున్నాడు.
ఇంతలో రాక్షస సైన్యము అక్కడకు చేరుకుంది. నాలుగు పక్కల నుండి రాక్షసులు రాముని చుట్టుముట్టారు. పెద్దగా కేకలుపెడుతున్నారు. కొందరు ధనుస్సులను ఠంగు ఠంగున మోగిస్తున్నారు. యుద్ధభేరీలు మోగుతున్నాయి. ఆ భయంకర ధ్వనులకు అడవిలో ఉన్న క్రూరమృగములు సైతము పారిపోయాయి. రాక్షస సైన్యము నలుదిక్కుల నుండి రాముని దగ్గర దగ్గరగా వస్తూ ఉంది.
రాముడు చుట్టూ చూచాడు. తనను చుట్టుముట్టిన రాక్షసులను పరికించి చూచాడు. అమ్ములపొదిలోనుండి బాణములను తీసాడు. రాక్షసుల మీదికి సంధించాడు. రాక్షస సంహారం కోసరము తీవ్రమైన కోపమును తెచ్చుకున్నాడు.
రాముని కోపం ఆవహించింది. రాక్షసుల మీద కోపంతో ఊగిపోయాడు రాముడు. దక్షయజ్ఞంలో విజృంభించిన రుద్రునిలా ప్రకాశించాడు రాముడు. రాక్షస సైన్యము ఆయుధములతో రాముని చుట్టుముట్టింది.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment