శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 23)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఇరువది మూడవ సర్గ
రాముని మీదికి ఉత్సాహంగా బయలుదేరిన ఖరునికి ఎన్నో దుశ్శకునములు గోచరించాయి. వారి మీద రక్తవర్షము కురిసింది. ఖరుని రథమునకు కట్టిన గుర్రములు సమతలప్రదేశము మీద కూడా తడబడుతూ పరుగెడుతున్నాయి. దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుని చుట్టూ నల్లని వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఖరుని రథముమీద ఎగురుతున్న ధ్వజము మీద నిలబడింది. అనేకములైన క్రూర మృగములు జనస్థానము వద్ద గుమిగూడి వికృతంగా అరుస్తున్నాయి. ఒక పక్కనుంచి నక్కలు తలలు పైకెత్తి ఏదో అమంగళము జరగబోతున్నట్టు కూస్తున్నాయి. పక్షులు, డేగలు, గ్రద్దలు ఖరుని రథానికి అడ్డంగా ఎగురుతున్నాయి.ఇంతలో సాయం సమయం అయింది.. గ్రహణ కాలం కాకుండానే రాహువు సూర్యుని మింగుతున్నాడా అన్నట్టు సూర్యుడు అస్తమించాడు. ఆకాశంనుండి ఉల్కాపాతం జరిగింది. స్వల్పంగా భూమి కంపించింది. రథం మీద కూర్చుని పెద్దగా అరుస్తున్న ఖరుడికి ఎడమ భుజము అదిరింది. మాట తడబడుతూ ఉంది. కళ్లు మండటం మొదలెట్టాయి. ఇన్ని అపశకునాలు కనపడుతున్నా ఖరుడు చలించలేదు. వెనుకకు మరలలేదు. ముందుకు దూకుతున్నాడు.
"సైనికులారా! ఈ ఉత్పాతాలకు భయపడకండి. ఇలాంటివి పిరికి వాళ్లను భయపెడతాయి కానీ మనలను కాదు. ధైర్యంగా ముందుకు దూకండి. ఆ రామలక్ష్మణులను చంపి గానీ వెనకకు తిరగ వద్దు. వాళ్లను చంపి వాళ్ల రక్తం తాగితేనే గానీ నా సోదరి శూర్పణఖ అవమానము చల్లారదు. మనం ఎన్నడూ యుద్ధంలో ఓడిపోలేదు. ఇప్పుడూ ఓడిపోము. నేను తల్చుకుంటే ఆ దేవేంద్రుని కూడా సంహరించగలను. ఈ మానవులు ఎంత?" అని ఖరుడు తనకు తానే ధైర్యము చెప్పుకుంటూ సేనలను ఉత్సాహపరుస్తున్నాడు.
ఈ విధంగా రాక్షసులు యుద్ధానికి కదలడం చూచి ఆ అడవిలో ఉన్న ఋషులు, మునులు, ఏంజరుగుతుందో అని ఆతురతగా చూస్తున్నారు. అందరూ లోక క్షేమాన్ని కోరి (అంటే రాక్షస సంహారాన్ని కోరి) ప్రార్థనలు చేస్తున్నారు. “చక్రాయుధమును ధరించిన శ్రీమహావిష్ణువు దానవులను సంహరించినట్టు ధనుర్ధారి అయిన రాముడు రాక్షస సంహారము చేయుగాక!" అని మనసులో ఆకాంక్షిస్తున్నారు.
ఇంక పైనుంచి దేవతలు విమానములు ఎక్కి రాక్షస సైన్యమును చూస్తున్నారు. ఖరుని సేనలో పన్నెండు మంది మహావీరులైన రాక్షసులు ఉన్నారు. వారు శ్యేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాశనుడు ( పైన చెప్పి పేర్లలో వారి అలవాట్లు, గుణగణాలు ప్రతిబింబిస్తున్నాయి. ఉదాహరణకు శ్యేనగామి = పక్షిలా తిరిగేవాడు. యజ్ఞశత్రువు = యజ్ఞములను పాడుచేసేవాడు, విహంగముడు=పక్షిలా ఎగిరేవాడు, పరుషుడు=ఎప్పుడూ పరుషంగా, కఠినంగా మాట్లాడేవాడు, రుధిరాశనుడు=రక్తంతాగేవాడు.). వీరే కాకుండాదూషణుని వెంట మహాకపాలి, స్థూలాక్షుడు, ప్రమాథీ, త్రిశిరస్సుడు అనే మరో నలుగురు రాక్షస సేనానాయకులు తమ తమ సేనలతో నడుస్తున్నారు. వీరందరూ రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి వెళుతున్నారు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment