శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది రెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 22)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ఇరువది రెండవ సర్గ

శూర్పణఖ తనను అన్న సూటీ పోటీ మాటలు అన్నీ మౌనంగా విన్నాడు ఖరుడు. అవమానభారంతో కుమిలిపోయాడు. అతనిలో పౌరుషం పెల్లుబికింది. కోపం తారస్థాయికి చేరుకుంది. శూర్పణఖను చూచి ఇలా అన్నాడు.

"నీకు జరిగిన అవమానము నాకు జరిగినట్టే భావిస్తాను. నాకు పట్టలేనంతగా కోపం వస్తూ ఉంది. ప్రతీకార జ్వాలలలో రగిలిపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఒక మానవుడికి నేను భయపడడమా! ఆ మానవుడు ఒక అల్పాయుష్కుడు. వాడి ప్రాణాలు హరిస్తాను. నీవు ఏడవకు. వాడి మరణవార్తను నీకు త్వరలో తెలియజేస్తాను. ఇప్పుడే వాడితో యుద్ధానికి వెళుతున్నాను. నా గొడ్డలితో వాడిని నరుకుతాను. వాడి వెచ్చని రక్తాన్ని నీకు పానీయంగా అందిస్తాను. ఇది నా నిర్ణయము." అని పలికాడు ఖరుడు.

“అదేంటి అన్నయ్యా! నీ పరాక్రమం గురించి నాకు తెలీయదా. నీకు సాటి వీరుడు ముల్లోకములలో ఎవరు ఉన్నారు. రాక్షస వీరులలో నీకు సాటిగలవారు ఎవరున్నారు.” అని పొగిడింది.

శూర్పణఖ మాటలతో ఉప్పొంగి పోయాడు ఖరుడు. వెంటనే తన సేనాపతులను పిలిచాడు.

"సేనాపతీ! మన దగ్గర 14 వేల మంది సైనికులు ఉన్నారు. కదా. వారినందరినీ యుద్ధమునకు సిద్ధం చేయండి. నేనే స్వయంగా వారికి నాయకత్వము వహిస్తాను. నా కొరకు ఒక రథము, ఆయుధములు, ధనుస్సులు, బాణములు సిద్ధం చేయండి. మనమందరమూ ఆ రాముని మీదికి యుద్ధానికి పోతున్నాము.” అని ప్రకటించాడు.

ఖరుడి మాట వినగానే దూషణుడు ఖరుడు కోరినట్టు రథం సిద్ధం చేసాడు. రథం తీసుకొచ్చి ఖరుడి ముందు నిలిపాడు. ఖరుడు ఆ రథం ఎక్కాడు. ఖరునికి దూషణునికి రక్షణగా రాక్షస వీరులు చుట్టు వలయాకారంలో నిలబడ్డారు. ఖరుడు అందరికీ బయలుదేరుటకు అనుజ్ఞ ఇచ్చాడు. జనస్థానమునుండి 14,000 మంది రాక్షసవీరులు ముద్గరలు, పట్టిసములు, శూలములు, పరశువులు, కత్తులు, చక్రాయుధములు, తోమరములు, శక్తి ఆయుధములు, పరిఘలు, కార్ముకములు (బాణములు), గదాయుధములు, ముసలములు, వజ్రాయుధములు ధరించి, రాముని మీదికి యుద్ధానికి బయలుదేరారు.

ముందు సైనికులు నడువగా ఖరుని రథము వారిని అనుసరించింది. ఖరుడు కోపంతో ఊగి పోతున్నాడు.

“త్వరగా పదండి. శత్రువును చంపండి. నరకండి" అని పెద్దగా అరుస్తున్నాడు.

ఖరుని అరుపులతో, రాక్షసవీరుల పదఘట్టనలతో ఆ అరణ్యము మార్మోగిపోయింది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)