శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది ఒకటవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 21)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఇరువది ఒకటవ సర్గ
పదునాలుగు మంది రాక్షస వీరులను వెంటబెట్టుకొని వెళ్లిన శూర్పణఖ వెంటనే ఒంటరిగా రావడం చూచి ఆశ్చర్యపోయాడు ఖరుడు."ఏంటి శూర్పణఖా! ఏమయింది. నీవు కోరితేనేకదా నీ వెంట 14 మంది రాక్షస వీరులను పంపాను. మరలా ఏడుస్తూ వచ్చావెందుకు. ఊరికే అలా భయపడితే ఎలాగా! నేను ఉన్నాగా నీకెందుకు భయం. ఏం జరిగిందో చెప్పు" అన్నాడు ఖరుడు.
ఖరుని చూచి వ్యంగ్యంగా ఇలా అంది శూర్పణఖ. "ముక్కు చెవులూ కోయించుకొని రక్తం కారుకుంటూ ఏడ్చుకుంటూ నీదగ్గరకు వచ్చానా! నీవు నన్ను ఓదార్చావు కదా! రామలక్ష్మణులను చంపడానికి 14 మంది రాక్షస వీరులను పంపావు కదా! మహావీరుల మాదిరి శూలాలు ధరించి ఆ 14మంది నా వెంట వచ్చారు కదా! క్షణకాలంలో రాముడిచేతిలో గుండెలు పగిలి చచ్చారు. ఇదీ మనవాళ్ల ప్రతాపం. ఇంక భయపడక చస్తానా! వాళ్లందరూ అలా క్షణకాలంలో నేలమీద పడగానే నాకు వణుకు పుట్టింది. పరుగెత్తుకుంటూ వచ్చాను.
ఓ ఖరా! నాకు భయంగా ఉంది. రామలక్ష్మణులు ఏవైపు నుంచి అన్నా రావచ్చు. నిన్ను, నన్ను చంపవచ్చు నీకు నా మీద జాలి దయ ఉంటే, ఆ రామలక్ష్మణులను ఎదిరించే శక్తి, బలము ఉంటే,
దండకారణ్యములో నివాసమేర్పరచుకొన్న ఆ రామలక్ష్మణులను వెంటనే చంపు. వాళ్లు సామాన్యులు కాదు. రాక్షసులను చంపడానికి వచ్చిన దేవతలు. నీవు కనక రాముడిని చంపకపోతే నేను నీ ఎదుటనే ఆత్మహత్య చేసుకొని చస్తాను. అయినా నీకు ఇంత సైన్యము, ఇంత బలము, పరాక్రమములు ఉండి ఏం ప్రయోజనం. ఇద్దరిని చంపలేకపోయావు. అసలు నువ్వు అయినా రాముని ఎదుట నిలిచి యుద్ధం చెయ్యగలవా అని నా అనుమానము.
ఖరా! వాళ్లు సామాన్య మానవులు. నీ సైన్యము ఆ మానవులను చంపలేకపోయాయి. నీవేదో పెద్ద పరాక్రమవంతుడవని డంబాలు పలుకుతున్నావు. నీ పరాక్రమము శూరత్వము ఎందుకు తగలపెట్టనా! నా మాటవిని ఈ జనస్థానము వదిలి ఎక్కడికన్నా వెళ్లి బతుకు పో! నువ్వు రాక్షసకులంలో చెడ బుట్టావు. అందుకే మానవులకు భయపడుతున్నావు.
ఓ ఖరా! ఆఖరుసారిగా చెబుతున్నాను విను. నీకు రాముని ఎదిరించే వీరత్వము ఉంటే, నీ సైన్యంతో వెళ్లి రామలక్ష్మణులను చంపు. లేకపోతే, నీ బంధుమిత్రులతో ఈ జనస్థానము వదిలి పారిపో! అదే ఉత్తమము. రాముని తేజస్సు ముందు నీవు నిలువలేవు. అందుకే నా ముక్కు చెవులు కోసినా ఇంకా రామలక్ష్మణులు బతికే ఉన్నారు.” అని సూటిపోటీ మాటలతో ఖరుని రెచ్చగొట్టింది శూర్పణఖ.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment