శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 20)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ఇరువదవ సర్గ

శూర్పణఖ ఆ పదునాలుగు మంది రాక్షస వీరులను రాముని పర్ణశాలకు తీసుకొని వెళ్లింది. పర్ణశాల ముందు కూర్చుని ఉన్న రామలక్ష్మణులను వారికి చూపించింది. ఆ రాక్షసులు బలవంతులైన రామలక్ష్మణులను, సౌందర్యరాసి అయిన సీతను చూచారు.

రాముడు కూడా శూర్పణఖ వెంట వచ్చిన రాక్షసులను చూచాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. "లక్ష్మణా! నేను వెళ్లి ఆ రాక్షసులను సంహరించి వస్తాను. నీవు ఇక్కడే ఉండి సీతను రక్షిస్తూ ఉండు." అని అన్నాడు.

లక్ష్మణుడు సరే అని సీత రక్షణ బాధ్యతను స్వీకరించాడు. రాముడు తన ధనుస్సుకు నారిని సంధించాడు. ఆ రాక్షసులను చూచి ఇలా అన్నాడు.

“ఓ రాక్షసులారా! నా పేరు రాముడు. నా తమ్ముడి పేరు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. మేము వనవాసము నిమిత్తము ఈ దండకారణ్యములో ప్రవేశించాము. మేము ముని వృత్తిలో ఉన్నాము. కందమూలములు, ఫలములు తింటూ కాలక్షేపము చేస్తున్నాము. మేము గానీ, మా లాంటి తాపసులు కానీ మీకు ఎలాంటి అపకారము చెయ్యలేదు. మీరు ఎందుకు మాబోటి తాపసులను బాధిస్తున్నారు. చంపుతున్నారు. మీలాంటి దుర్మార్గులను చంపడానికే మేము ధనుర్బాణములను ధరించాము. మీకు ప్రాణముల మీద ఆశ ఉంటే వెనక్కు తిరిగి వెళ్లిపోండి. లేకపోతే ఇక్కడే ఉండి మీ ప్రాణాలు పోగొట్టుకోండి." అని అన్నాడు రాముడు.

ఆ మాటలు విన్న రాక్షస వీరులు కోపంతో ఊగిపోయారు. ఇప్పటి దాకా వారిని చూచి భయపడ్డవారే గానీ, వారిని ఎదిరించి భయపెట్టిన వారు లేరు. అలాంటిది వీళ్లు ఎదిరిస్తున్నారు అంటే కోపం ఆపుకోలేకపోయారు.

“మా ప్రభువు ఖరుడు. నీవు ఆయన చెల్లెలు ముక్కు చెవులుకోసి, అవమానించి, ఆయనకు కోపం తెప్పించావు. నీవు ఇంక బతకడం కల్ల. ఎందుకంటే మేము 14 మంది ఉన్నాము. నీవు ఒక్కడివి. మమ్ములను ఎలా ఎదుర్కొంటావు? మేము కనక మా చేతిలో ఉన్న శూలములు మొదలగు ఆయుధములు నీ మీద ప్రయోగిస్తే నీవు నీ ధనుస్సు వదిలిపారిపోతావు. కాచుకో!" అంటూ ఆ 14 మంది రాక్షసులు రాముని మీదికి తమ తమ ఆయుధములను విసిరారు.

రాముడు ఒక్కొక్క ఆయుధమును ఒక్కొక్కబాణంతో ముక్కలు చేసాడు. తరువాత రాముడు 14 నారాచములను వారి మీద ప్రయోగించాడు. ఆ బాణములు సూటిగా వచ్చి ఆ రాక్షసుల గుండెలను చీల్చివేసాయి. వారి శరీరములు రక్తముతో తడిసి ముద్ద అయినాయి. వారి గుండెలు చీలడంతో, ఆ 14 మంది రాక్షసులు నేల మీద పడి ప్రాణాలు వదిలారు.

శూర్పణఖ ఆశ్చర్యంలో ఆ రాక్షసుల వంక చూచింది. రామలక్ష్మణుల వంక చూచింది. శూర్పణఖకు కోపము, భయము, ఒక్కసారిగా ఆవహించాయి. పెద్దగా అరవడం మొదలు పెట్టింది. అక్కడి నుండి పరుగెత్తింది. ఖరుని వద్దకు పరుగుపరుగున వచ్చింది. ఖరుని ముందు నేల మీద పడి భోరు భోరున ఏడుస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)