శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పంతొమ్మిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 19)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
పంతొమ్మిదవ సర్గ
ముక్కులలో నుండి చెవుల నుండి రక్తం కారుతూ తన ముందు నేల మీద పడి రోదిస్తూ ఉన్న చెల్లెలు శూర్పణఖను చూచాడు ఖరుడు. ఆమెను రెండుచేతులతో లేవనెత్తాడు.“చెల్లెలా శూర్పణఖా! ఏమిటీ ఘోరము. ఎవరు చేసారీ పని? నీవు ఎవరో తెలిసే ఈ పని చేసాడా! వాడు తాచు పాముతో ఆడుకుంటున్నాడు అని మరిచిపోయినట్టున్నాడు. వాడికి మూడింది. వాడికి కాలపాశం మెడకు చుట్టుకోబట్టే ఇలాంటి పని చేసాడు. ఎవడు వాడు! ఎక్కడ ఉంటాడు! ఉన్నది ఉన్నట్టు చెప్పు.
అయినా నీవు సహజంగా బలవంతురాలివి కదా! పైగా కామరూపివి. నిన్ను చూస్తే యముడిని చూచినట్టే కదా! అలాంటి నీకు ఈ గతి పట్టించిన వాడు ఎవడు? వాడు దేవతా! గంధర్వుడా! భూతమా! లేక ఎవరన్నా పరాక్రమ వంతుడైన ఋషిపుంగవుడా! ఎందుకంటే సాక్షాత్తు దేవేంద్రుడు కూడా నాకు అపకారం చెయ్యడానికి వెనుకాడుతాడు. అటువంటిది నీవు నా చెల్లెలు అని తెలిసికూడా నీకు అవమానం చేసాడంటే వాడికి ఆయువు మూడింది.
ఇప్పుడే నేను వాడిని సంహరించి నీకు జరిగిన అవమానమునకు ప్రతీకారము చేస్తాను. వాడి శరీరమును కాకులు, గ్రద్దలు తింటాయి. దేవతలు గానీ, గంధర్వులు కానీ, రాక్షసులు గానీ,
పిశాచములు గానీ ఎవరు అడ్డం వచ్చినా సరే వాడిని చంపకుండా విడువను. చెల్లెలా! చెప్పు. నీ భయందోళనలనుండి తేరుకొని అన్నీ వివరంగా చెప్పు.” అని అడిగాడు ఖరుడు.
పిశాచములు గానీ ఎవరు అడ్డం వచ్చినా సరే వాడిని చంపకుండా విడువను. చెల్లెలా! చెప్పు. నీ భయందోళనలనుండి తేరుకొని అన్నీ వివరంగా చెప్పు.” అని అడిగాడు ఖరుడు.
శూర్పణఖ కళ్లనుండి నీళ్లు కారుతున్నాయి. కళ్లు తుడుచుకుంటూ ఖరునితో ఇలా చెప్పింది. “ఎవరో అయోధ్యను పరిపాలించే దశరథమహారాజు కుమారులట. పేరు రాముడు, లక్ష్మణుడు. వారు సుకుమారులు. సుందరాకారులు. కాని మంచి బలంగా ఉన్నారు. మునివేషములో ఉన్నా చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. వారి ముఖంలో రాజసం తొణికిసలాడుతూ ఉంది. వారు దేవతలో మనుష్యులో చెప్పలేను. వారి పక్కనే ఒక సౌందర్యవతి అయిన స్త్రీ ఉంది. ఆ స్త్రీమూలంగానే నాకు ఈ అవమానము జరిగింది. నువ్వు వెళ్లి ఆ స్త్రీని, ఆ ఇద్దరు యువకులను చంపి వారి రక్తముతో నా దాహము తీర్చు. అప్పటి దాకా నా పగ చల్లారదు.” అని రోషంతో పలికింది శూర్పణఖ.
ఆమె మాటలకు రగిలిపోయాడు ఖరుడు. వెంటనే తన వద్ద ఉన్న అత్యధిక బలసంపన్నులైన 14 మంది రాక్షస వీరులను పిలిపించాడు.
“ఓ రాక్షసవీరులారా! ముని వేషములో ఉన్న ఇద్దరు క్షత్రియ కుమారులు, ఒక స్త్రీ దండకారణ్యములో ప్రవేశించారట. మీరు వెళ్లి ఆ ముని కుమారులను, ఆ స్త్రీని చంపండి. వారి రక్తము నా సోదరి శూర్పణఖ తాగవలెనని కోరుతూ ఉంది. వెళ్లండి. వాళ్లను చంపి వారి రక్తమును పట్టి తీసుకురండి." అని ఆజ్ఞాపించాడు ఖరుడు.
ఆ 14 మంది రాక్షసవీరులూ శూర్పణఖను తీసుకొని రామలక్ష్మణులను వెతుక్కుంటూ వెళ్లారు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment