శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 28)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఇరువది ఎనిమిదవ సర్గ
రాముని మీదికి పోతున్నాడే కానీ ఖరునికి లోలోపల భయంగానే ఉంది. ఎందుకంటే అప్పటికే రాముడు మహా వీరులు, అసమాన బలవంతులు అయిన దూషణుని, త్రిశిరుని సంహరించాడు. ఇంక తన వంతు వచ్చింది అనుకున్నాడు. పైగా సైన్యము అంతా నశించి పోయింది. కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు. కొద్దిమందితో రాముని ఎదుర్కోగలనా అని సందేహిస్తున్నాడు. కానీ ధైర్యంగా ముందుకు దూకాడు.ఖరుడు రాముని మీద నారాచములను(ఇనుప ములికలు అమర్చిన బాణములను) ప్రయోగించాడు. ఖరుడు ఒక చోట ఉండకుండా రణభూమి అంతా కలయ తిరుగుతూ, బాణ ప్రయోగం చేస్తున్నాడు. రాముని కదలనీయకుండా నాలుగు దిక్కులను తన బాణములతో కప్పివేసాడు.
రాముడు తన ధనుస్సు ఎక్కుపెట్టాడు. ఖరుడు సంధించిన బాణములను ఛిన్నాభిన్నం చేసాడు రాముడు. తన బాణములతో ఆకాశం అంతా నింపాడు రాముడు. సూర్యుడు కూడా కనపడటం లేదు. రాముడు ఖరుడు ఒకరితో ఒకరు భీకరంగా పోరాడుతున్నారు. ఖరుడు రాముని మీద నారాచములు, నాళీకములు, వికర్ణికలు మొదలగు బాణపరంపరలు ప్రయోగించాడు. ఆ సమయంలో రథము మీద ఉన్న ఖరుడు యమధర్మరాజు మాదిరి కనిపించాడు.
అప్పటికే యుద్ధము చేసి పదునాలుగువేలమంది రాక్షసులను చంపిన రాముడు బాగా అలసిపోయి ఉంటాడు అని అనుకొన్నాడు ఖరుడు. కాని రామునిముఖంలో అలసట ఏమాత్రం కనిపించడం లేదు. పైగా రాముడు ఖరుని చంపడానికి అవకాశము కొరకు ఎదురు చూస్తున్నాడు అని ఖరునికి తెలియదు.
ఖరుడు రాముని ధనుస్సును సగ భాగంలో విరగగొట్టాడు. మరొక బాణంతో రాముని కవచమును విరిచాడు. రాముని కవచము విరిగి నేలమీద పడింది. అదే అవకాశముగా, ఖరుడు రాముని శరీరం అంతా బాణములతో కొట్టాడు. విజయోత్సాహంతో పెద్దగా అరిచాడు. రాముడు వెంటనే తనకు అగస్త్యమహాముని ఇచ్చిన వైష్ణవ ధనుస్సుకు నారి బిగించి సంధించాడు. ముందు ఖరుని ధ్వజమును కూల్చాడు. అది చూచిన ఖరుడు కోపించి రాముని మర్మస్థానముల మీద నాలుగు తీవ్రమైన బాణములు ప్రయోగించాడు. ఆ బాణములు రాముని శరీరమునకు తగిలి రాముని శరీరం అంతా రక్తంతో తడిసి ముద్ద అయింది.
రాముని కోపము కట్టలు తెంచుకుంది. ఒక బాణముతో ఖరుని శిరస్సును, రెండు బాణములతో ఖరుని రెండు చేతులను, మూడు అర్థచంద్రాకారపు బాణములతో ఖరుని వక్షస్థలమును కొట్టాడు. ఎలాగైనా ఖరుని చంపాలని నిశ్చయించుకొన్న రాముడు ఖరుని మీద తీవ్రమైన 13 నారాచములను ప్రయోగించాడు. అందులో ఒక బాణముతో ఖరుని రథము యొక్క నొగలను, నాలుగు బాణములతో నాలుగు గుర్రాలను, ఒక బాణముతో రథ సారథిని, మూడు బాణములతో రధం ముందు భాగమును, రెండు బాణములతో ఖరుని రథము ఇరుసులను, ఒక బాణముతో ఖరుని కంఠమును కొట్టాడు. ఇలా 13 బాణములతో ఖరుని ఆపాదమస్తకము కొట్టాడు రాముడు.
ఖరునికి రథము విరిగిపోయింది. సారథి చచ్చాడు. రథానికి కట్టిన గుర్రాలు నేలకూలాయి. విల్లు విరిగిపోయింది. చేసేది లేక ఖరుడు తన గదను తీసుకొని నేలమీదికి దూకాడు. ఖరుని ఆ విధంగా కొట్టినందుకు ఆకాశంలలో నిలబడి చూస్తున్న దేవతాసమూహములు రాముని అభినందించారు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment