శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది తొమ్మిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 29)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఇరువది తొమ్మిదవ సర్గ
ఒంటరిగా గద ధరించి తన మీదికి వస్తున్న ఖరుని చూచి రాముడు ఇలా అన్నాడు. “ఓ రాక్షసాధమా! నీవు సామాన్యుడివి కావు. చతురంగ బలములు కలిగిన 14,000 మంది సేనలకు అధిపతివి. కాని సాధు జనులు అసహ్యించుకొనే ఎన్నో అకృత్యాలు చేసావు. నీవలన సాధు జనులకు ప్రాణ భయం కలిగింది. ఎల్లప్పుడూ పాపకృత్యములు చేసే నీ వంటి పాపాత్ముడు ఎల్లకాలము జీవించలేడు. అతని పాపములే అతనిని నాశనం చేస్తాయి. అసలు నిన్ను ఆ జనులేచంపాల్సింది. కానీ వారి బదులుగా నేను నిన్ను చంపుతున్నాను. కాని నీవు చేస్తున్నది తప్పు, పాపము అని నీకు తెలియదు. అందుకే ఇన్ని పాపపు పనులు చేసావు. చేసిన పాపములకు ఫలితము అనుభవిస్తున్నావు.
ఈ దండకారణ్యములో ఎంతో మంది ఋషులు, మునులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు. వారు నీకు ఏమి అపకారము చేసారని వారిని అనేక బాధలు పెట్టావు. అడ్డం వచ్చిన వారిని చంపావు. నీకు ధనబలము, అంగ బలమ, సైనిక బలము ఉంది కదా అని విర్రవీగావు. కాని సాధుజనుల ఆగ్రహము ముందు నీ బలము నిలువలేదు. అందుకే పతనమయ్యావు.
నీవే కాదు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కూడా తాను చేసిన పాపపు పనులకు ఫలితమును అనుభవింపక తప్పదు. విషం కలిపిన అన్నం తింటే వెంటనే ఎలా మరణం సంభవిస్తుందో, పాపపు పనులుచేస్తే, ఆ పాపఫలము కూడా వెంటనే కట్టికుడుపుతుంది. దుష్ట శిక్షణ కొరకు ఈ దండకారణ్యములో ఉన్న ఋషులు, మునులు నన్ను ఆశయించారు. అందుకే నేను దుష్టుడవైన నిన్ను చంపుతున్నాను. ఓ ఖరుడా! ఇప్పటిదాకా నీవు నీ అనుచరులు ఈ దండకారణ్యములో ఉన్న మునులను, ఋషులను ఎలా యమపురికి పంపారో, అలాగే నీవు కూడా నీ అనుచరులను అనుసరించి యమపురికి వెళుతున్నావు. నీవు చంపిన మునులందరూ స్వర్గ ద్వారముల వద్ద నిలబడి, నువ్వు నరకానికి పోవడం కళ్లారా చూస్తారు. ఓ దురాత్ముడా! కాచుకో! ఒకే ఒక్క బాణంతో నీ తల తాటి పండు మాదిరి నేల మీద దొర్లుతుంది.” అని తన ధనుస్సు ఎక్కుపెట్టాడు రాముడు.
రాముని సూటీ పోటీ మాటలు విన్న ఖరుడు అవమాన భారంతో కోపంతో రగిలిపోయాడు. "ఓ రామా! ఇదేంటి! నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు. నా సైన్యము నశించినా నేను ఇంకా బతికే ఉన్నాను. అప్పుడే నన్ను గెల్చానని గర్వపడుతున్నావు. నిన్ను నీవే అభినందించుకుంటున్నావు.
నీకు తెలుసో లేదో పరాక్రమ వంతులు, వీరులు తమ విజయాన్ని తాము ఎప్పుడూ చెప్పుకోరు. ఇతరులు చెబితే ఆనందిస్తారు. వినయము వివేకము లేని నీ వంటి క్షత్రియాధములు మాత్రమే తమను తాము అభినందించుకుంటారు. అదే పని నీవు చేస్తున్నావు. నిన్ను నీవే పొగుడుకుంటున్నావు.
నీకు తెలుసో లేదో పరాక్రమ వంతులు, వీరులు తమ విజయాన్ని తాము ఎప్పుడూ చెప్పుకోరు. ఇతరులు చెబితే ఆనందిస్తారు. వినయము వివేకము లేని నీ వంటి క్షత్రియాధములు మాత్రమే తమను తాము అభినందించుకుంటారు. అదే పని నీవు చేస్తున్నావు. నిన్ను నీవే పొగుడుకుంటున్నావు.
రామా! నీకు మృత్యువు ఆసన్నమయింది. ముందు అది తెలుసుకో. నిన్ను అభినందించుకోడం మానుకో! లేకపోతే కాలిన దర్భలాగా మసి అయిపోతావు. నీ ఎదుట పాశమును చేత ధరించిన కాల యముడి వలె గదాయుధమును ధరించి కదులుతున్న పర్వతము మాదిరి నిలబడ్డ నన్ను చూస్తున్నావు కదా! జీవులు యముని కాలపాశమునకు బలి అయినట్టు నువ్వు నా గదాయుధమునకు బలి అవుతావు.
ఓ రామా! ఇంకా నీ గురించి ఎంతో చెప్పాలి. కానీ సూర్యాస్తమయము కాబోతోంది. సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదని నియమం ఉంది కదా! అందుకని చెప్పడం లేదు. నీవు నా సేనలను 14,000 మందిని మట్టుబెట్టావు. ఈ రోజు నేను నిన్ను చంపి వాళ్ల బంధు మిత్రుల కన్నీళ్లు తుడుస్తాను.” ఇలా మాట్లాడిన ఖరుడు తన గదను రాముని మీదికి విసిరాడు. రాముడు ఒకే ఒక బాణంతో ఆ గదను ముక్కలు చేసాడు. ఆ ముక్కలు ఉల్కాపాతముల వలె నేలమీద పడ్డాయి.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment