శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదకొండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 11)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
పదకొండవ సర్గ
ఆ అడవిలో రాముడు ముందు నడుస్తున్నాడు. సీత మధ్యలో ఉంది. వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. వారు అనేకములైన కొండలను, సెలయేళ్లను దాటుకుంటూ వెళుతున్నారు. నదీతీరములలో ఇసుక తిన్నెల మీద ఎగురుతున్న సారస పక్షులను, చక్రవాక పక్షులను, జలపక్షులను చూస్తూ ఆనందిస్తున్నారు. గుంపులు గుంపులుగా పోవుచున్న వన్యప్రాణులను చూచి, ఆగి అవి వెళ్లిన మీదట వెళుతున్నారు. సాయంత్రము అయింది. వారు ఒక సరస్సునుసమీపించారు.
ఆ సరస్సులో నుండి గీతాలాపనలు, వాద్య ధ్వనులు శ్రవణానందంగా వినిపిస్తున్నాయి. కాని ఆ దరిదాపులలో మానవ సంచారము లేదు. సీతారామలక్ష్మణులు ఆ ధ్వనులు విని
ఆశ్చర్యపోయారు. తమ వెంట వస్తున్న ఋషులను ఆ వాద్య ధ్వనులు ఎక్కడినుండి వస్తున్నాయి అని అడిగారు. అందులో ధర్మభృతుడు అనే వృద్ధుడైన ఒక ఋషిఇలా చెప్పసాగాడు.
“రామా! ఈ సరస్సుపేరు పంచ అప్సర సరస్సు. ఈ తటాకము అన్ని ఋతువులలోనూ ఒకే విధంగా నీటితో నిండి ఉంటుంది. ఈ సరస్సును మాణ్ణకర్ణి అనే ఋషి నిర్మించాడు. మాణ్ణకర్ణి అనే ఆ ఋషి పదివేల సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేసాడు. ఆ తపస్సుకు దిక్పాలకులు వణికిపోయారు. ఎవరి పదవిని కోరి ఆ ఋషి తపస్సు చేస్తున్నాడో అని భయపడ్డారు. వెంటనే వారుమెరుపు తీగల వలె మెరిసిపోతున్న ఐదుగురు అప్సరసలను పిలిపించారు. ఆ ఋషి తపస్సును భగ్నం చేయమని వారిని పంపారు.
ఆ అప్సరసలు మాణ్ణకర్ణి వద్దకు వచ్చారు. తమ శృంగార హావభావాలతో ఆ మునిని ఆకట్టుకున్నారు. తమకు దాసుడిగా చేసుకున్నారు. శృంగార చేష్టలలో ఓలలాడించారు. ఆ ముని తన తపోబలంతో యువకుడిగా మారిపోయాడు. ఆ ఐదుగురు అప్సరసలను పెళ్లి చేసుకున్నాడు. వారి కొరకు ఈ సరస్సును సృష్టించి, ఈ సరస్సు అడుగుభాగంలో ఒక గృహమును ఏర్పరిచి అందులో వారితో పాటు నివసిస్తున్నాడు. ఆ ఐదుగురు అప్సరసలు ఆలపించే గీతాలు, వాద్య ధ్వనులే మీరు వింటున్నారు.” అని అన్నాడు.
ఆ మాటలు విన్న రామలక్ష్మణులు సీత ఆశ్చర్యపోయారు. రాముడు అక్కడ కొన్ని మున్యాశ్రమములు చూచాడు. ఆ ఆశ్రమములలో ఉన్న మునులు రాముని సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించారు. రాముడు ఆ ముని ఆశ్రమములలో కొంత కాలము నివసించాడు. తరువాత రాముడు ఆ అడవిలో ఎన్నో ఆశ్రమములు సందర్శించాడు. ఆయా ఆశ్రమములలో కొంత కాలము నివసించాడు.
ఒక ఆశ్రమములో పది మాసములు, మరొక ఆశ్రమములో ఒక సంవత్సరము, మరొక ఆశ్రమములో నాలుగు మాసములు, ఐదు మాసములు, ఆరు మాసములు, ఒక మాసము, ఒకటిన్నర మాసము, మూడు మాసములు, ఎనిమిది మాసములు ఈ ప్రకారంగా రాముడు, సీత, లక్ష్మణుడు ఒక్కొక్క ఆశ్రమములో పై చెప్పిన విధంగా నివసిం చారు. ఆ విధంగా ముని ఆశ్రమములలో నివసిస్తూ రాముడు, సీత, లక్ష్మణుడు తమ వనవాస కాలములో పది సంవత్సరములు ఆనందంగాగడిపారు. తరువాత ధర్మజ్ఞుడైన రాముడు, సీతతో, లక్ష్మణునితో ఆయా ఆశ్రమములలో నివసిస్తూ, తుదకు సుతీక్షుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. రాముడు సుతీక్షుని ఆశ్రమంలో కొంతకాలము
నివసించాడు.
ఒకరోజు రాముడు సుతీక్ష మహామునిని చూచి ఇలా అన్నాడు. “మహాత్మా! అగస్త్యుడు ఈ అరణ్యములోనే ఆశ్రమము నిర్మించుకొని నివసిస్తున్నాడు అని వారి గురించి కథలు కధలు గా విన్నాము. మాకు ఆయనను దర్శించవలెనని కోరికగా ఉంది. ఆయన ఆశ్రమము ఎక్కడ ఉందో దయచేసి తెలియజేయండి." అని ప్రార్థించాడు.
“రామా! మంచి పని చేస్తున్నావు. నేనే నిన్ను అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లమని చెబుదాము అని అనుకుంటున్నాను. ఇంతలో నీవే అడిగావు. చాలా సంతోషము. ఈ ఆశ్రమము నుండి నాలుగు యోజనముల దూరంలో దక్షిణ దిశగా అగస్త్యుని సోదరుడు (అగస్త్యభ్రాత) ఆశ్రమము కలదు.
రామా! నీవు అగస్త్య భ్రాత ఆశ్రమములో ఒక రాత్రి ఉండి మరునాడు అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లు. అగస్త్య భ్రాత ఆశ్రమమునకు ఒక యోజన దూరంలో అగస్త్యుని ఆశ్రమము ఉంది." అని అన్నాడు.
తరువాత రాముడు సుతీక్షుని వద్ద అనుజ్ఞ తీసుకొని అగస్త్యుని ఆశ్రమమునకు బయలు దేరాడు. దక్షిణ దిశగా నాలుగు యోజనములు ప్రయాణము చేసి అగస్త్య భ్రాత ఆశ్రమమును
చేరుకున్నారు. ఫలవృక్షములు సమృద్ధిగా కల ఆ ప్రాంతమును చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు.
"లక్ష్మణా! ఇక్కడ ఉన్న ఫలవృక్షములు, పిప్పళ్ల చెట్లు, ఆశ్రమము బయట ఉన్న సమిధలు, సేకరించిన దర్భలు, ఆరవేసిన నార చీరలు, చూస్తుంటే సుతీక్ష మహాముని చెప్పిన అగస్త్య భ్రాత ఆశ్రమము ఇదే అని తెలుస్తోంది. అటు చూడు, ఆ ఆశ్రమము పైనుండి అగ్ని హోత్రము నుండి వెలువడే పొగ ఆకాశంలోకి ఎలా పోతోందో! సందేహము లేదు. ఇదే అగస్త్య భ్రాత ఆశ్రమము.
లక్ష్మణా! నీకు తెలుసా! అగస్త్యుడు ఈ దక్షిణ ప్రాంతము అరణ్యములలో నివసించు బ్రాహ్మణులకు తాపసులకు ఎంతో ఉపకారము చేసాడు. ఎలాగంటే ఈ అడవిలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు ఇక్కడ నివసించే బాహ్మణులను, తాపసులను మోసం చేసి చంపి తినేవారు. ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడిగా వేషం వేసుకొనేవాడు. "ఈ రోజు నా తండ్రి ఆబ్దికము మీరు భోజనానికి భోక్తగా రావాలి" అని బ్రాహ్మణులను తన ఇంటికి తీసుకొని వెళ్లేవాడు. వాతాపి ఒక గొర్రెగా మారి పోయేవాడు. శాస్త్రములలో చెప్పబడిన శ్రాద్ధకర్మల విధి ప్రకారము ఇల్వలుడు ఆ గొర్రెను చంపి ఆ మాంసముతో భోక్తగా వచ్చిన బ్రాహ్మణునకు భోజనం పెట్టేవాడు.
బాహ్మణుడు భోజనం చేసిన తరువాత “వాతాపీ! బయటకు రా!" అని బిగ్గరగా అరిచేవాడు. ఆ బ్రాహ్మణుని పొట్టలో ఉన్న వాతాపి గొర్రెగా మారి, ఆ బ్రాహ్మణుని పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేవాడు. వాతాపి, ఇల్వలుడు ఇద్దరూ కలిసి ఆ బ్రాహ్మణుని చంపి తినేవారు. ఈ ప్రకారము ఆ రాక్షసులు ఇద్దరూ ఎంతో మంది బ్రాహ్మణులను చంపారు. ఈ సంగతి తెలిసి దేవతలు, బాహ్మణులు అగస్త్యుని శరణు వేడారు. అగస్త్యుడు సరేఅన్నాడు.
ఒక రోజు అగస్త్యుడు ఇల్వలుని ఇంటికి భోక్తగా వెళ్లాడు. వాతాపి గొర్రెగా మారాడు. ఇల్వలుడు వాతాపిని చంపి ఆ మాంసమును వండి అగస్త్యునికి వడ్డించాడు. అగస్త్యుడు తృప్తిగా భోజనం చేసాడు. "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అంటూ బ్రేవ్మంటూ త్రేన్చాడు. అంతే. అగస్త్యుని పొట్టలో ఉన్న వాతాపి జీర్ణం అయిపోయాడు. ఇది తెలియని ఇల్వలుడు “వాతాపీ! బయటకు రా! అని అరిచాడు. ఎంత అరిచినా వాతాపి రాలేదు.
అగస్త్యుడు నవ్వాడు. "ఇంకెక్కడి వాతాపి. వాడు నా పొట్టలో ఎప్పుడో జీర్ణం అయిపోయాడు.” అన్నాడు తన పొట్ట నిమురుకుంటూ. దానికి కోపించి ఇల్వలుడు అగస్త్యుని మీద దాడి చేసాడు. అగస్త్యుడు తన తపోశక్తితో ఇల్వలుని భస్మం చేసాడు. ఆ ప్రకారంగా అగస్త్యుడు ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులకు, మునులకు రాక్షస బాధ తొలగించాడు. ఆ అగస్త్యుని సోదరుడే ఈ అగస్త్య భ్రాత" అని వివరించాడు రాముడు.
అంతలో సాయంత్రం అయింది. రామలక్ష్మణులు సాయంసంధ్యలు నిర్వర్తించారు. అగస్త్యభ్రాత ఆశ్రమములోనికి ప్రవేశించి ఆయనకు పాదాభివందనము చేసారు. అగస్త్యభ్రాత కూడా రాముని సాదరంగా ఆహ్వానించాడు. ఫలములు పుష్పములు ఇచ్చి సత్కరించాడు. రాముడు, లక్ష్మణుడు, సీత ఆ రాత్రికి ఆ ఆశ్రమములోనే ఉన్నారు.
మరునాడు ఉదయమే లేచి రాముడు సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకొని అగస్త్య భ్రాత వద్దకు వెళ్లి అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లుటకు ఆయన అనుమతి కోరాడు. అగస్త్య భ్రాత రామునికి తన అన్న అగస్త్యుని ఆశ్రమమునకు పోవుటకు మార్గము చెప్పాడు. రాముడు, సీత, లక్ష్మణులు వెంట రాగా అగస్త్య ఆశ్రమమునకు బయలుదేరాడు. అగస్త్య భ్రాత చెప్పిన గుర్తుల ప్రకారము ప్రయాణం చేస్తున్నాడు.
ఒకచోట ఫలవృక్షములు మెండుగా కనిపించాయి. లేళ్లు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. హెూమధూమము పైకి లేస్తోంది. దానిని బట్టి అగస్త్యుని ఆశ్రమము అక్కడకు దగ్గరలోనే ఉంది అని రాముడు అనుకొన్నాడు. అంతలోనే నారచీరలు ఆరవేసి ఉన్న ఆశ్రమ ప్రాంగణము కనపడింది. మృగములు తమ సహజ వైరము మరిచి ప్రశాంతంగా సంచరిస్తున్నాయి.
“ఎవరి తపోప్రభావంచేత రాక్షసులు ఈ ప్రాంతానికి రావడానికి భయపడుతుంటారో ఆ అగస్త్య మహా ముని ఆశ్రమము ఇదే. ఇక్కడకు దేవతలు గంధర్వులు నియమం తప్పకుండా వచ్చి అగస్త్య మహామునిని సేవిస్తుంటారు.
ఈ అగస్త్య మహాముని ఆశ్రమములో అబద్ధాలు చెప్పేవారికి, క్రూరులకు, వంచకులకు, సాటి మానవులను హింసించేవారికి స్థానము లేదు. ఎంతో మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేసి, స్వర్గానికి వెళ్లారు. ఈ ఆశ్రమ ప్రాంతములో ఎవరైనా తపస్సు చేసి కోరికలు కోరుకుంటే వాటిని దేవతలు తప్పకుండా నెరవేరుస్తారు. ఇదీ ఆ ఆశ్రమ మహాత్యం.
లక్ష్మణా! ముందు నీవు ఆశ్రమములోనికి ప్రవేశించి నేను, సీత మహాముని దర్శనానికి వచ్చామని అగస్త్యునికి విన్నవించు" అని రాముడు లక్ష్మణునితో అన్నాడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment