శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 10)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
పదవ సర్గ
తన భార్య సీత చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. సీతతో ఇలా అన్నాడు.“ఓ జనకరాజపుత్రీ! సీతా! నీకు అన్ని ధర్మాలూ తెలుసు. నీవు పలికిన పలుకులు నీ సాత్విక ప్రవృత్తికి తగినట్టుగానూ, ధర్మబద్ధంగానూ, యుక్తియుక్తంగానూ ఉన్నాయి. దీనులను రక్షించడానికే క్షత్రియులు ఆయుధములు చేపడతారని నీవే చెప్పావు కదా! ఈ దండకారణ్యములో ఎంతో మంది మునులు ఉన్నారు. వారికి తపస్సు తప్ప వేరొక పని లేదు. వారందరూ పూజనీయులు. గౌరవింపతగ్గవారు. అటువంటి వారిని రాక్షసులు అనేక రకాలుగా బాధలు పెడుతున్నారు. చంపుతున్నారు. ఆ పరిస్థితులలో మునులు తమ బాధలనుండి రక్షించమని నన్ను శరణుకోరారు.ఆ మునులు ఎవరికీ అపకారముచెయ్యరు. దొరికిన కందమూలములు, ఫలములు తిని తపస్సు చేసుకుంటున్నారు. అటువంటి వారికి ఈ రాక్షసుల వలన శాంతి, సుఖము లేకుండా పోయాయి. నరమాంస భక్షకులైన రాక్షసులు ఎప్పుడు ఎవరిని చంపుతారో అని భయంతో వణికిపోతున్నారు. వారందరూ రాక్షసుల బారినుండి తమను కాపాడమని నన్ను అర్ధించారు.
ఒక క్షత్రియుడుగా, ఒక రాజుగా నేనే వారి వద్దకుపోయి, “మీకు నేను ఏమి సేవ చేయాలి" అని అడగడం పోయి, వారే నా దగ్గరకు వచ్చి తమను కాపాడమని నన్ను అర్ధించారు. అందుకు ఒక రాజుగా నేను సిగ్గుపడాలి. నేను వారిని “నేను మీకు ఏమిసేవ చేయగలను" అని అడిగినప్పుడు వారు చెప్పిన మాటలను నీకు చెబుతున్నాను.
“రామా! ఈ దండకారణ్యములో కామరూపులైన రాక్షసులు స్థావరములు ఏర్పరచుకొని ఉన్నారు. వారు నరమాంసభక్షకులు. మేము హోమాలు, యాగాలు చేస్తుంటే వాటిని పాడుచేస్తున్నారు. అదేమని అడిగితే చంపుతున్నారు. మా తపోబలముచేత వారిని మేము ఎదుర్కోగలము, చంపగలము. కాని ఎంతో కష్టపడి ఆర్జించిన మా తపోమహిమలను ఈ నీచుల కోసరం వెచ్చించడం మాకు ఇష్టం లేదు. అందుచేత, ఆ రాక్షసులు మమ్ములను ఎన్ని బాధలు పెడుతున్నా, మా యజ్ఞాలు పాడుచేస్తున్నా, మమ్ములను చంపుతున్నా, భరిస్తున్నాము, సహిస్తున్నాము. ఇప్పుడు నీవు వచ్చావు కాబట్టి, నిన్ను అర్ధిస్తున్నాము. ఈ ప్రాంతము నీ రాజ్యములో ఉన్నది కాబట్టి నీవే మాకు రక్షకుడవు."
సీతా! ఈ ప్రకారంగా వారు నాతో పలికిన పలుకులు విని నేను ఊరుకోలేకపోయాను. వారికి అపకారము చేస్తున్న రాక్షసులను సంహరిస్తానని వారికి మాట ఇచ్చాను. ఆ మాట నెరవేర్చడం క్షత్రియునిగా నా కర్తవ్యం. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకూ వారికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికే ప్రయత్నిస్తాను. అవసరం అయితే మీ అందరినీ, నా ప్రాణాలను సైతం విడిచిపెడతాను కానీ ఆ బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాను. ఇదే నా నిశ్చయము. ఒక
క్షత్రియునిగా, ఒక రాజుగా, వారు అడగకపోయినా, నేను వారి కష్టాలు తీర్చాలి. వారికి రక్షణ కల్పించాలి. వారే అడిగినప్పుడు ఇంక వేరుచెప్పాలా!
ఓ సీతా! నీకు తగినట్టు నీవు చెప్పావు. అందులో తప్పులేదు. నిన్ను నేను నా ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. మునులకు ఇచ్చిన మాటనుకూడా నెరవేరుస్తాను." అని అన్నాడు రాముడు.
తరువాత అందరూ దండకారణ్యములోనికి ప్రవేశించారు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment