శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - తొమ్మిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 9)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

తొమ్మిదవ సర్గ


రాముడు, లక్ష్మణుడు, సీత అరణ్యమార్గములో పోతూ ఉన్నారు. అప్పుడు సీత రాముని చూచి ఇలా పలికింది.

“నాధా! ధర్మము, ధర్మ సంపాదన చాలా నిశితమైనవి. కోరికలకు, వ్యసనములకు దూరంగా ఉన్నవారే ధర్మముగా జీవించగలరు. వ్యసనములకు మూలము కామము. కామము వలన ముఖ్యంగా మూడు వ్యసనములు కలుగుతాయి. అందులో మొదటిది అసత్యము పలకడం. రెండవది పరుల భార్యలను కోరడం. మూడవది ఎదుటి వారి మీద ఎలాంటి విరోధము లేకుండానే వారిని హింసించడం.

ఇంక నీ సంగతి తీసుకుంటే నీవు సత్యవాక్పరిపాలకుడవు. అసత్యము పలకడం అంటే ఎలాంటిదో నీకు తెలియదు. ఇంక నీకు పరస్త్రీలమీద వాంఛ మనసులో కానీ, వాక్కులో కానీ, కర్మలో గానీ లేదు. అది నాకు తెలుసు. నీవు తండ్రిమాటకు విలువ ఇచ్చి రాజ్యమును త్యజించి, అడవులకు వచ్చావు. పైగా నీవు జితేంద్రియుడవు. ఇంతకన్నా సుగుణములు ఇంకా ఏమి కావాలి. ఇంక మూడవది ఎదుటి వారిమీద ఎలాంటి వైరభావము లేకపోయినా, వారిని వధించడం. ఈ వ్యసనము నీకు ఎందుకో వచ్చింది. కారణం తెలియదు. ఈ దండకారణ్యములో నివసించు రాక్షసులను చంపుతానని ఋషులకు మాట ఇచ్చావు. ఆ కార్యక్రమము మీద నీవు లక్ష్మణునితో కలిసి ఆయుధములు ధరించి బయలుదేరావు. ఇది చూచి నా మనసు చాలా వికలమయింది. దీని గురించి నేను అన్ని విధాలా ఆలోచించాను. నా మనసుకు సరిఅయిన సమాధానము దొరకలేదు.
నీవు ఈ విధంగా ధనుర్బాణములను, కత్తులను ధరించి దండకారణ్యములోనికి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే చేతిలో ధనుర్బాణములు ఉంటే దొరికిన మృగాన్ని చంపాలి అన్న ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినపుడు అమాయకమైన మృగాలను చంపకుండా వదులుతావా! చేతిలో ధనుస్సు, కత్తి ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా హింస చేయవలెనని బుద్ధిపుట్టడం క్షత్రియులకు సహజం. దీని గురించి నీకు ఒక కధచెబుతాను.

ఒక వనములో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సుకు విఘ్నం కలిగించాలని అనుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఒక భటుని రూపంలో చేతిలో ఒక కత్తితో ఆ ఋషి దగ్గరకు వచ్చాడు. “ఓ మహాత్మా! నేను అత్యవసరమైన పని మీద వెళుతున్నాను. నేను వచ్చువరకు ఈ ఖడ్గమును తమరి దగ్గర ఉంచండి. నా పని అయిపోయిన తరువాత వచ్చి తీసుకుంటాను." అని అన్నాడు. ఆ ఋషి సరే అన్నాడు. ఆ ఖడ్గమును తన ఆశ్రమములో ఒక మూల పెట్టించాడు. భటుని రూపంలో ఉన్న ఇంద్రుడు వెళ్లిపోయాడు.

తాను ఆశమములో లేని సమయములో ఆ కత్తిని ఎవరైనా ఎత్తుకుపోతారని, ఆ ఋషి ఎప్పుడూ ఆ కత్తిని తనతోపాటు తీసుకొని వెళుతూ ఉండేవాడు. ఎల్లప్పుడూ కత్తి అతని వద్ద ఉండటంతో ఆ కత్తిని ఉపయోగించడం మొదలు పెట్టాడు. ఆ ఋషి బుద్ధి క్రూరంగా మారిపోయింది. వినోదం కొరకు ఏదో ఒక జంతువును చంపడం అలవాటు అయింది. క్రమంగా అతని బుద్ధి తపస్సు మీదినుండి వేటమీదికి మళ్లింది. తుదకు ఆ ఋషికి నరకం సంప్రాప్తించింది. ఇంద్రుడి కోరిక నెరవేరింది.

నాథా! సత్త్వగుణ సంపన్నుడు అయిన ఆ ఋషి కూడా ఎల్లప్పుడూ ఆయుధము తన వద్ద ఉండటం వల్ల, అతని మనసు క్రూరంగా మారిపోయింది. ఆయుధములకు ఆ శక్తి ఉంది. ఆయుధము, అగ్ని రెండూ ప్రమాదహేతువులు అని మీకు తెలియనిది కాదు. మీ దగ్గర నాకు ఉన్న చనువు వలన మీకు చెబుతున్నాను. అంతేగానీ ఈ విషయములు అన్నీ మీకు తెలియవు అని కాదు.

నాధా! ఈ అడవిలో ఉన్న రాక్షసులకు మీకూ ఎలాంటి వైరము లేదు. వారు మనకు ఎలాంటి అపకారమూ చేయలేదు. కేవలము మీ వద్ద ఆయుధములు ఉన్న కారణంగా వాళ్లను చంపాలి అని అనుకుంటున్నారు. ఆ ఆలోచన మంచిది కాదు అని నా అభిప్రాయము. వారు ఏ అపరాధమూ చేయకుండా వారిని శిక్షించడం లోకసమ్మతం కాదు. ప్రజలు దానిని హర్షించరు. ప్రజారక్షణ కోసరం ఆయుధములను ధరించడం క్షత్రియధర్మము. దానిని నేను కాదనను. కాని మీరు ప్రస్తుతము ముని వృత్తిలో ఉన్నారు. మీరు క్షత్రియధర్మము పాటించడం అనుచితము అని
నా అభిప్రాయము. అయినా అడవులు ఎక్కడ! ఆయుధములు ఎక్కడ! క్షత్రియధర్మమెక్కడ! తపోవృత్తి ఎక్కడ! ఇవి పరస్పరమూ విరుద్ధముగా ఉన్నాయి కదా! కాబట్టి మీరు దేశధర్మమును పాటించడం మంచిది. అంటే మీరు ప్రస్తుతము వనములో ముని వృత్తిలో ఉన్నారు కాబట్టి మునుల వలె ప్రవర్తించడం మంచిది. అంతేకానీ హింసకు పాల్పడకూడదు.

మీరు అయోధ్యకు వెళ్లిన తరువాత మీ ఇష్టం వచ్చినట్టు ఆయుధములు ధరించి క్షత్రియ ధర్మమును పాటించవచ్చును. నీ తల్లి తండ్రులు నిన్ను నార చీరలు ధరించి. జటలు కట్టుకొని వనవాసము చేయమని నిర్దేశించారు. వారి ఆజ్ఞప్రకారము ముని వృత్తిలో ఉంటే వారూ సంతోషిస్తారు. అదే ధర్మము. ధర్మాచరణమే మీ కర్తవ్యము. కాబట్టి నాధా! మీరు అడవులలో ఉన్నారు కాబట్టి మంచి బుద్ధితో సత్వగుణమును, తపోధర్మమును పాటించండి. క్షాత్రమును వదిలిపెట్టండి. అనవసరంగా నీకు ఏ మాత్రం హాని చేయని వారిని హింసించకండి.

ఏదో స్త్రీ చాపల్యంతో మాట్లాడాను. ఏమీ అనుకోకండి. ఎందుకంటే తమరికి తెలియని ధర్మము లేదు. నేను చెప్పానని కాకుండా ఈ విషయం లక్ష్మణునితో కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి." అని సీత మెత్త మెత్తగా తన అభిప్రాయాన్ని రామునికి తెలియజేసింది.

శ్రీమద్రామాయణము
అరణ్య కాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)