శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఎనిమిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 8)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఎనిమిదవ సర్గ
సీతా రామ లక్ష్మణులు మరునాడు ఉదయం నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. రాముడు సుతీక్షుని వద్దకు వెళ్లాడు.“మహాత్మా! రాత్రి మీ ఆతిధ్యము స్వీకరించాము. మాకు చాలా సంతోషము అయింది. మీరు అనుమతి ఇస్తే మేము ముగ్గురమూ, మాతో వచ్చిన మునులు కలిసి, ఈ అరణ్యములో ఉన్న ముని ఆశ్రమములను చూచి వస్తాము. ఆ మునుల ఆశీర్వాదములు తీసుకుంటాము." అని అన్నాడు రాముడు..
“రామా! నీకు శుభమగు గాక! నీ ఇష్టము ప్రకారము ఈ వనములో ఉన్న ముని ఆశ్రమములను అన్నిటినీ దర్శించు. ఈ వనములో ఫలములు, పుష్పములు సమృద్ధిగా ఉన్నాయి. నిర్మలమైన నీరు కల జలాశయములు ఎన్నో ఉన్నాయి. కొండలమీది నుండి నేల మీదికి దుముకుచున్న జలపాతములు కూడా చాలా ఉన్నాయి. జింకలు, నెమళ్లు తదితర వన్యప్రాణులు మీకు కనువిందు చేస్తాయి. ఈ అడవిలో ఉన్న అందాలన్నీ తనివిదీరా చూడండి. మరలా మన ఆశ్రమమునకు చేరుకోండి." అని అన్నాడు.
“మహర్షీ! అలాగే చేస్తాను.” అని ఆ మహర్షికి నమస్కరించి, లక్ష్మణుడు, సీత, మునులతో వనములోకి వెళ్లడానికి ప్రయాణము అయ్యాడు. సీత రామునికి లక్ష్మణునికి ధనుర్బాణములు, ఖడ్గములు తెచ్చి ఇచ్చింది. వాటిని రామలక్ష్మణులు ధరించారు. ఆయుధధారులైన రామ లక్ష్మణులు, సీతతో కలిసి ఆ అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు.
శ్రీమద్రామాయణము
అరణ్య కాండము ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment