శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 7)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
ఏడవ సర్గ
రాముడు, సీతతోనూ, లక్ష్మణుని తోనూ, ఇంకా కొందరు మునులతోనూ సుతీక్ష మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు. సుతీక్ష మహర్షి ఆశ్రమము ఒక మహారణ్యములో చదునైన ప్రదేశములో ఉంది. ఆ అడవిలో ఫలవృక్షములు పుష్కలంగా ఉన్నాయి. రాముడు ఆ ఆశ్రమములో ప్రవేశించాడు. తపస్సులో ఉన్న సుతీక్ష మహర్షిని చూచాడు. భక్తితో నమస్కరించాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు.“ఓ మహర్షీ! నా పేరు రాముడు. అయోధ్యాధి పతి దశరథుని కుమారుడను. తండ్రి ఆజ్ఞ మేరకు, నా భార్య, సోదరునితో కలిసి అరణ్యవాసము చేస్తున్నాను. శరభంగ మహర్షి ఆదేశము మేరకు తమ దగ్గరకు వచ్చాను. కళ్లు తెరిచి నాతో మాట్లాడండి.” అని ప్రార్థించాడు.
సుతీక్ష మహర్షి కళ్లు తెరిచాడు. రాముని చూచాడు. పరమానందంతో రాముని కౌగలించుకున్నాడు.
“రామా! నీకు స్వాగతము. నీరాకచే మా ఆశ్రమమునకు ఒక నాధుడు దొరికినట్టయింది. రామా! నీ గురించి విన్నాను. నీవు అరణ్యములలో సంచరిస్తున్నావని తెలిసి నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను. దేవేంద్రుడు వచ్చి నన్ను స్వర్గలోకమునకు ఆహ్వానించాడు. నేను స్వర్గమునకు వెళ్లవలెనని నిశ్చయించుకున్నాను. కాబట్టి నేను ఆర్జించిన తపోఫలమును నీకు ధారపోస్తాను. నీవు స్వీకరించు." అని అన్నాడు.
అప్పుడు రాముడు ఆ మహర్షితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మీ గురించి శరభంగ మహర్షి వలన విని ఉన్నాను. తమరు నాకు ఉండటానికి తగిన ప్రదేశమును నిర్ణయిస్తారని శరభంగ మహర్షి చెప్పాడు.” అని అన్నాడు.
“రామా! ఈ అడవిలో ఈ ప్రాంతము నివాసయోగ్యమైనది. ఇక్కడ ఫలవృక్షములు, పూదోటలు విస్తారముగా ఉన్నాయి. పర్ణశాల నిర్మించుకోడానికి అనువైన చదునైన ప్రదేశము ఉంది. కాబట్టి నీవు పర్ణశాల నిర్మించుకొని ఇక్కడే ఉండవచ్చును. కాని ఈ ప్రదేశమునకు పెద్ద పెద్ద జంతువులు గుంపులు గుంపులుగా వస్తాయి. కాని అవి ఎవరికీ హాని చెయ్యవు. కాసేపు అటూ ఇటూ తిరిగి వెళ్లిపోతాయి. అది తప్ప ఇక్క ఏ విధమైన భయము లేదు. ప్రశాంతంగా ఉంటుంది." అని అన్నాడు సుతీక్ష మహర్షి.
అప్పుడు రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నాకు మృగముల వలన భయము లేదు. నేను వనవాసిని కాను కదా. క్షత్రియుడను. ఈ ధనుర్బాణములతో మనకు హాని కలిగించు మృగములను చంపగలను. కాని నేను మృగములను చంపడం సహజంగా దయాళువులైన మీకు కష్టం కలిగించవచ్చును. కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ కాలము ఉండలేను అనిపిస్తూ ఉంది." అని అన్నాడు రాముడు.
తరువాత రాముడు, లక్ష్మణుడు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. సుతీక్ష మహర్షి రామలక్ష్మణులకు, సీతకు, వారితో వచ్చిన మునులకు ఫలములను ఇచ్చి సత్కరించాడు. ఆ రాత్రికి వారు సుతీక్షుని ఆశ్రమములోనే ఉన్నారు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment