శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఆరవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 6)
శ్రీమద్రామాయణము
అరణ్య కాండము
ఆరవ సర్గ
ఆ ప్రకారంగా శరభంగ మహర్షి బ్రహ్మలోకము చేరుకున్నాడు. తరువాత ఆ వనములో నివసించుచున్న మునులు, ఋషులు అందరూ రాముని వద్దకు వచ్చారు. ఆ వచ్చిన వారిలో వైఖానసులు, వాలఖిల్యులు, సంప్రక్షాలులు, మరీచులు, మొదలగు మహాఋషులుఅక్కడకు వచ్చారు. వారందరూ రామునితో ఇలా అన్నారు.
“ఓ రామా! నీవు ఇక్ష్వాకు వంశములో శ్రేష్ఠుడవు. దేవేంద్రుడు స్వర్గ లోకమును పాలించినట్టు నీవు ఈ భూమిని పాలిస్తున్నావు. నీవు సత్యమునే పలుకుతావు. అమితమైన పరాక్రమ వంతుడవు. పితృవాక్య పరిపాలన నీ ప్రధానధర్మము. నీకు తెలియని ధర్మము లేదు. అందుకని మీతో మా బాధలను చెప్పుకోదలిచాము. నీవు ఏమీ అనుకోవద్దు.
రాజధర్మము గురించి నీకు చెప్ప పనిలేదు. రాజు తన ప్రజల నుండి ఆరవ వంతు ఆదాయమును పన్నుగా తీసుకొని, దానికి ప్రతిగా ప్రజలకు అన్ని సౌకర్యములు కలిగించాలి. ప్రజలను రక్షించాలి. ఇదీ రాజధర్మము. తన పాలనలో ఉన్న ప్రజలందరినీ కన్న బిడ్డలవలె రక్షించే రాజు చిరకాలము రాజ్యము చేస్తాడు. మరణానంతరము అటువంటి రాజుకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. మేము మునులము. తాపసులము. మేము రాజుకు పన్నురూపంలో ఏమీ ఇచ్చుకోలేము. కాని మేము చేసే తపస్సులో నాలుగవ వంతు ఫలము రాజుకు దక్కుతుంది. కాబట్టి మమ్ములను రక్షించే బాధ్యత రాజువైన నీ మీద ఉన్నది.
ప్రస్తుతము మేము నివసించుచున్న ఈముని ఆశ్రమములన్నీ నీ పాలనలో ఉన్నాయి. నీ పాలనలో ఉండి కూడా మేము అభద్రతా భావంతో బతుకుతున్నాము. మాకు ఎలాంటి రక్షణ, భద్రత లేదు. ఈ అరణ్యములో రాక్షసులు ఎక్కువగా ఉన్నారు. వారు ఎంతో మంది మునులను చంపారు. మాకు ఎన్నో బాధలను కలిగిస్తున్నారు. రామా! మాతో రా! ఆ చనిపోయిన మునుల శవములను మీకు చూపిస్తాము.
ఈ రాక్షసులు మందాకినీ నదీ ప్రాంతములోనూ, చిత్రకూట పర్వతప్రాంతములోనూ, పంపానదీ ప్రాంతములోనూ ఎక్కువగా తిరుగుతున్నారు. ఆయా ప్రాంతములలో నివసించే మునులను చంపుతున్నారు. వారు పెట్టేబాధలకు అంతు లేదు. ఆ రాక్షసులు చేసే వినాశనమును ఇంక ఎంతమాత్రము మేము సహించలేకపోతున్నాము. నీవే మమ్ములను రక్షించాలి. మేమంతా నీ రక్షణ కోరుతున్నాము. ఆ రాక్షసుల చేతిలో మేము చావకుండా మమ్ములను కాపాడు రామా! ఎందుకంటే నిన్ను మించి వీరుడు ఈ లోకంలో లేడు అని మా నమ్మకము. నీవే ఈ రాక్షస సంహారమునకు సమర్ధుడవు.” అని పలువిధములుగా తమ బాధలు రామునితో విన్నవించుకున్నారు.
రాముడు ఆ మునుల మాటలను శ్రద్ధగా విన్నాడు. తరువాత రాముడు ఆ మునులకు నమస్కరించి ఇలా అన్నాడు.
“ఓ మహామునులారా! మీరు ఇంత దీనంగా నన్ను ప్రార్థించడం తగదు. మీరు నన్ను ఆజ్ఞాపించాలి కాని అర్థించకూడదు. మిమ్మల్ని రక్షించే అవకాశము నాకు కల్పించినందులకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రాక్షసులు పెట్టే బాధల గురించి నేను వింటూనే ఉన్నాను. మీ బాధలు తీర్చడం రాజుగా నా కర్తవ్యం. బాధ్యత. అందుకే మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము నేను ఈ అరణ్యములో ప్రవేశించాను. రాక్షస సంహారంతో నా వనవాసమునకు గొప్ప ఫలము లభిస్తుంది. మీరింక నిర్భయంగా తపస్సు చేసుకోండి. మీ రక్షణ బాధ్యత నేను వహిస్తాను." అని రాముడు ఆ మునులకు అభయము ఇచ్చాడు.
తరువాత రాముడు, సీతతో, లక్ష్మణునితో కలిసి సుతీక్షుని ఆశ్రమమునకు వెళ్లాడు. రాముని వెంట కొంతమంది మునులు అనుసరించారు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment