శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 5)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

ఐదవ సర్గ

విరాధుని బారి నుండి సీతను కాపాడిన రాముడు, ఆమెను కౌగలించుకొని ఓదార్చాడు. సీత ఆ భయం నుండి తేరుకుంది. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. "లక్ష్మణా! మొదటి సారిగా మనము రాక్షసులను ఎదుర్కొన్నాము. మనకు ఈ వనవాసము అలవాటు లేదు కదా. ముఖ్యంగా సీతకు. అందువల్ల చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనము త్వరగా శరభంగ ముని ఆశ్రమమునకు వెళదాము." అని అన్నాడు.

లక్ష్మణుడు దారి చూపుతూ ఉండగా రాముడు సీత లక్ష్మణుని వెంట నడిచారు. అందరూ శరభంగ ఆశ్రమమునకు చేరుకున్నారు. శరభంగ మహాముని దర్శనము చేసుకున్నారు. అక్కడ వారు చాలా
ఆశ్చర్యకరమైన సంఘటనలు చూచారు. శరభంగ ముని వద్దకు దేవేంద్రుడు, దేవతల సమేతంగా తన రథం మీద ముని వద్దకు వచ్చాడు. దేవేంద్రుని, గంధర్వులు, అమరులు, సిద్ధులు, మునులు స్తుతిస్తున్నారు. దేవేంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉండగా రామలక్ష్మణులు శరభంగ ఆశ్రమము దగ్గరకు వచ్చారు. ఆకాశంలో నిలిచి ఉన్న దేవేంద్రుని రథమును రాముడు లక్ష్మణునికి చూపించి దాని గురించి చెప్పాడు.

తరువాత రాముడు, లక్ష్మణుని అక్కడే ఉండమని, తాను మాత్రము శరభంగ ఆశ్రమము వైపు వెళ్లాడు. ఆశ్రమము వద్దకు వస్తున్న రాముని దేవేంద్రుడు చూచాడు. అక్కడే ఉన్న దేవతలతో ఇలా అన్నాడు. “రాముడు ఇక్కడకు వస్తున్నాడు. రాముడు ఇక్కడకు వచ్చి నాతో మాట్లాడక ముందే మీరు రాముడికి ఏమి కావాలో అవి సమకూర్చండి. రాముడు దేవ కార్యము నిమిత్తము అరణ్యములకు వచ్చాడు. ఆ పని పూర్తి అయిన తరువాతనే నేను రామునితో మాట్లాడతాను. మీరుమాత్రము రామునికి అన్నివిధాలా సాయం చెయ్యండి.” అని అన్నాడు. తరువాత దేవేంద్రుడు శరభంగ ముని వద్ద అనుజ్ఞ తీసుకొని తన రథము మీద స్వర్గమునకు వెళ్లిపోయాడు.
తరువాత రాముడు, లక్ష్మణుడు, సీతతో కలిసి శరభంగ ముని వద్దకు వెళ్లాడు. అందరూ ఆమహామునికి పాదాభివందనము చేసారు. ఆయన ఆశీర్వాదము తీసుకున్నారు. ఆ మహాముని అనుమతితో ఆయన పక్కన కూర్చున్నారు.

రాముడు శరభంగ మహర్షిని చూచి “ఓ మహర్షీ! దేవేంద్రుడు ఇక్కడకు ఎందుకు వచ్చాడో నాకు తెలుపగోరుతాను." అని అన్నాడు. దేవేంద్రుడు తన ఆశ్రమమునకు వచ్చిన పని గురించి శరభంగ మహర్షి రామునికి వివరంగా చెప్పాడు.

“రామా! నేను ఎంతో తపస్సు చేసాను. ఆ తపస్సు ఫలితంగా దేవేంద్రుడు నన్ను బ్రహ్మలోకమునకు తీసుకొని పోవడానికి వచ్చాడు. ఇంతలో నీవు వస్తున్నట్టు నాకు తెలిసింది. నిన్ను చూడకుండా బ్రహ్మలోకమునకు పోవడం నాకు ఇష్టం లేదు. నిన్ను కలుసుకొని, నీతో మాట్లాడిన తరువాతనే నేను బ్రహ్మలోకమునకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాను. రామా! నేను ఎంతో తపస్సు చేసి బ్రహ్మ లోకములను, స్వర్గలోకములను జయించాను. వాటిని నీకు ఇవ్వదలిచాను. స్వీకరించు.” అని అన్నాడు.

దానికి రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షి! పుణ్యలోకములు ఎవరికి వారు సంపాదించుకోవాలే గానీ, ఒకరు ఇస్తే స్వీకరించ కూడదు.కాబట్టి నన్ను మన్నించండి. నా తండ్రి ఆజ్ఞప్రకారము నేను వనవాసము చేస్తున్నాను. కాబట్టి ఈ అరణ్యములో మేము నివసించుటకు అనువైన ప్రదేశమును చూపించండి.” అని అడిగాడు.

ఆ మాటలకు శరభంగ మహాముని ఇలా అన్నాడు.“ఓ రామా! ఈ అరణ్యములో సుతీక్షుడు అనే పేరుగల ముని ఉన్నాడు. నీవు వెళ్లి ఆయనను కలుసుకో. ఆయన నీకు తగిన మార్గము ఉపదేశించ గలడు. నీకు నివసించడానికి తగిన ప్రదేశమును కూడా చూపగలడు. నీవు మందాకినీ నది ప్రవాహమునకు ఎదురు వెళితే, సుతీక్షుడి ఆశ్రమము వస్తుంది. రామా! నీతో మాట్లాడాను. నాకు తృప్తిగా ఉంది. ఇంక నేను ఈ శరీరమును విడిచిపెడతాను. నీవు అలా చూస్తూఉండు." అని అన్నాడు. 

తరువాత శరభంగ మహర్షి అగ్ని గుండము ఏర్పాటు చేయించాడు. అందులో మంత్రపూతంగా హోమాదులు చేసాడు. తరువాత తాను ఆ అగ్నిలో ప్రవేశించాడు. ఆ అగ్ని శరభంగుని శరీరమును పూర్తిగా కాల్చివేసింది. శరభంగుడు అగ్ని కుండము నుండి నవయౌవనుడిగా ప్రకాశిస్తూ దివ్యమైన రూపంతో అగ్ని నుండి వెలుపలికి వచ్చాడు. రాముడు చూస్తూ ఉండగానే బ్రహ్మలోకము వైపుకు వెళ్లిపోయాడు. బ్రహ్మలోకములో శరభంగమహర్షికి ఘన స్వాగతము లభించింది. బ్రహ్మదేవుడు శరభంగ మహర్షిని సాదరంగా బ్రహ్మలోకమునకు ఆహ్వానించాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)