శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 4)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
నాలుగవ సర్గ
ఆ ప్రకారంగా రాముని లక్ష్మణుని విరాధుడు ఎత్తుకొని పోవడం చూచి సీత పెద్దగా ఏడవసాగింది. పెద్ద పెద్ద గా కేకలు వేసింది."ఓ రాక్షసుడా నీకు ఓ నమస్కారము. వాళ్లను వదిలిపెట్టు. కావాలంటే నన్ను తీసుకొనిపో. నాకు భయంగా ఉంది. నేను ఒంటరిగా ఇక్కడ ఉంటే ఈ అరణ్యములో ఉండే క్రూర మృగాలు నన్ను తినేస్తాయి.” అని పెద్ద పెట్టున కేకలు వేసింది.
ఆ కేకలు విన్నారు రామలక్ష్మణులు. వెంటనే విరాధుని చంపడానికి పూనుకున్నారు. వెంటనే లక్ష్మణుడు తన చేతిలో ఉన్న కత్తితో విరాధుని ఎడమచేతిని ఖండించాడు. రాముడు విరాధుని కుడి చేతిని విరిచేసాడు. రెండు చేతులు విరిగిన విరాధుడు రామలక్ష్మణులను కిందికి విసిరేసాడు. బాధతో గిలా గిలా కొట్టుకుంటూ కిందపడి మూర్ఛపోయాడు. కిందపడ్డ విరాధుని రామలక్ష్మణులు కాళ్లతోనూ చేతులతోనూ మర్దించారు. పైకి ఎత్తి నేల మీద పడేసారు. కత్తులతో చీల్చారు. ఏమి చేసినా విరాధుని ప్రాణం పోలేదు. వరప్రసాది అయిన విరాధుడు ఆ ప్రకారంగా చావడు అని గ్రహించాడు రాముడు.
"లక్ష్మణా! ఈ విరాధుడు కత్తులతోనూ, ఆయుధములతోనూ చావడు. అలా చావు రాకుండా వీడికి వరం ఉంది. అందుకని మనం వీడిని గొయ్యి తీసి పాతిపెడదాము. సహజంగా వాడికి ప్రాణం పోతుంది. కాబట్టి నువ్వు వీడిని పూడ్చి పెట్టడానికి తగినంత గొయ్యి తవ్వు." అని అన్నాడు. గొయ్యి తవ్వే లోపల విరాధుడు లేవకుండా రాముడు వాడి గొంతు మీద కాలు పెట్టి నిలుచున్నాడు.
అప్పుడే మూర్ఛనుండి తేరుకున్న విరాధుడు రాముని మాటలు విన్నాడు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు.
“రామా! నువ్వు ఎవరో గుర్తించాను. నీభార్య సీతను, నీ తమ్ముడు లక్ష్మణుని కూడా గుర్తించాను. మీరు మహా పరాక్రమ వంతులు. మీచేతిలో నేను ఎప్పుడో చచ్చాను. ఇప్పుడు ప్రత్యేకంగా
చంపడం ఎందుకు. ఇంక నా గురించి చెబుతాను. నేను తుంబురుడు అనే పేరుగల గంధర్వుడను. ఒక సారి నేను రంభయొక్క వ్యామోహంలో పడి కుబేరుని సేవకు పోలేదు. కుబేరుని శాపము వలన నాకు ఈ రాక్షస రూపము ప్రాప్తించింది. “దశరథుని కుమారుడు రాముడు ఎప్పుడు నిన్ను యుద్ధంలో చంపుతాడో అప్పుడు నీకు నిజరూపం వస్తుంది" అని కుబేరుడు నాకు శాపవిమోచన మార్గము చెప్పాడు. ఇప్పుడు మీ దర్శనభాగ్యము కలిగింది. నాకు శాపవిమోచనము అయింది. నేను నా లోకానికి వెళ్లిపోతాను. నాకు అనుజ్ఞు ఇవ్వండి." అని ప్రార్థించాడు.
రామ లక్ష్మణులు విరాధుని ప్రార్థనను మన్నించారు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఇక్కడికి ఒకటిన్నర యోజనముల దూరములో శరభంగుడు అనే ముని ఆశ్రమము ఉంది. మీరు అక్కడకు వెళ్లండి మీకు శుభం కలుగుతుంది. ప్రస్తుతము మీరు నన్ను ఒక గోతిలో పాతిపెట్టండి. మరణించిన రాక్షసులను గొయ్యి తీసి అందులో పాతి పెట్టడం పురాతన ఆచారము. అలా చేస్తే మాకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.” అని అన్నాడు.
తరువాత విరాధుడు తన ప్రాణాలు వదిలాడు. విరాధుని కోరిక ప్రకారము లక్ష్మణుడు గొయ్యి తీసాడు. రాముడు విరాధుని గొంతు మీది నుండి తన కాలు తీసాడు. విరాధుడు పెద్దపెట్టున అరిచాడు. ఆ అరుపులకు అడవి మారుమోగిపోయింది. వెంటనే లక్ష్మణుడు పెద్దపెద్ద గా కేకలు పెడుతున్న విరాధుని గోతిలో పడదోసాడు.
ఆ ప్రకారంగా రామలక్ష్మణులు, ఏ ఆయుధము చేత కూడా చావని విరాధుని, గోతిలో పెట్టి పూడ్చిపెట్టడం ద్వారా సంహరించారు. రాముని చేతనే చావ వలెనని కోరిక కల విరాధుడు, తన మరణ రహస్యమును కూడా రామునికి చెప్పాడు. అందుకని రాముడు అతడిని గోతిలో పాతిపెట్టడం ద్వారా సంహరించాడు. విరాధుడు మరలా లేవకుండా ఆ గోతి మీద పెద్ద పెద్ద బండ రాళ్లను కూడా పెట్టారు. తరువాత వారు సీత వద్దకు పోయి ఆమె భయాన్ని పోగొట్టారు. విరాధుని మరణంతో సీతారామలక్ష్మణులు సంతోషంగా ఉన్నారు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment