శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 3)

 శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

మూడవ సర్గ

తాను రామలక్ష్మణులను వివరాలు అడుగుతుంటే వాళ్లిద్దరూ ఏవేవో మాట్లాడుకోవడం చూచి సహించలేకపోయాడు విరాధుడు.

“నేను మీ ఇద్దరి గురించి అడుగుతుంటే మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారు. చెప్పండి మీరు ఎవరు? ఈ అరణ్యములకు ఎందుకు వచ్చారు? ఎక్కడికి వెళుతున్నారు?” అని అడిగాడు.

అప్పుడు రాముడు విరాధునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసుడా! మేము క్షత్రియులము. మునులము కాము. నా పేరు రాముడు. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. కాల వశమున ఈ అరణ్యములో తిరుగుతున్నాము. ఇంతకూ నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు?" అని అడిగాడు రాముడు.

"ఓ రామా! నేను రాక్షసుడను. నాపేరు విరాధుడు. నా తండ్రి పేరు జవుడు. నా తల్లి పేరు శతహ్రద. నేను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసాను. ఆయన వలన ఎవరిచేతా గాయపడకుండా,
చావకుండా వరము పొందాను. నాకు ఈమె మీద మోహము కలిగింది. కాబట్టి మీరు ఇద్దరూ ఈమెను నాకు విడిచి పెట్టి ఇక్కడ నుండి పారిపొండి. లేకపోతే మీ ఇద్దరిని చంపి తింటాను. వెంటనే వెళ్లిపొండి." అనిఅన్నాడు విరాధుడు.

ఆ మాటలకు రామునికి కోపం వచ్చింది. కళ్లు ఎర్రబడ్డాయి. కోపంతో విరాధునితో ఇలా అన్నాడు. "ఓ రాక్షసుడా! నీకు నా చేతిలో చావు మూడింది. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నిన్ను ప్రాణాలతో వదలను.”అని ధనుస్సు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని సంధించి విరాధుని మీదికి వదిలాడు.

వరసగా విరాధుని మీద బాణాలు ప్రయోగించాడు రాముడు. రాముడు వదిలిన బాణాలు విరాధుని శరీరం నిండా గుచ్చుకున్నాయి. విరాధుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. ఆ బాణాల బాధకు తట్టుకోలేక విరాధుడు తన తొడమీద ఉన్న సీతను కిందికి దించాడు. శూలాన్ని పట్టుకొని పెద్దగా అరుస్తూ రామలక్ష్మణుల మీదికి దూకాడు.

రామునికి లక్షణుడు కూడా తోడైనాడు. రామలక్ష్మణులు విరాధుని మీద బాణములను వర్షంలా కురిపించారు. ఆ రాక్షసుడు ఒక్కసారి ఆవులించి ఒళ్లు విదిలించగానే అతని శరీరమునకు
గుచ్చుకున్న బాణములు అన్నీ జలజలా కింద రాలిపోయాయి. బ్రహ్మ వరప్రభావము వలన రామ లక్ష్మణులు వదిలిన బాణములు విరాధుని ఏమీ చేయలేకపోయాయి. విరాధుడు మరలా శూలమును పైకెత్తి రామలక్ష్మణుల మీదికి దూకాడు. తన శూలమును రాముని మీదికి విసిరాడు. రాముడు రెండు బాణములతో ఆ శూలమును మధ్యలోనే ఖండించాడు. విరాధుని శూలము రెండు ముక్కలై కిందపడిపోయింది. రామలక్ష్మణులు రెండు కత్తులను తీసుకున్నారు. విరాధునిమీదికి దూకారు. ఆ కత్తులతో విరాధుని బలంగా కొట్టారు. ఇలా కాదని విరాధుడు రామలక్ష్మణులను తన చేతుల మధ్య బంధించాలని అనుకొన్నాడు. విరాధుని ఊహను పసికట్టాడు రాముడు. అక్ష్మణునితో ఇలా అన్నాడు.

“లక్షణా! వీడు మన ఇద్దరినీ చేతులతో ఎత్తుకొని మోసుకొని పోవాలని చూస్తున్నాడు. వాడి ఇష్టం వచ్చినట్టు మనలను మోసుకుంటూ పోనిద్దాము. ఎందుకంటే మనం కూడా ఇదే దారిలో వెళ్లాలి కదా!" అని అన్నాడు.

ఇంతలో విరాధుడు రామలక్ష్మణులను తన చేతులతో ఎత్తుకొని తన బుజాల మీద కూర్చోపెట్టుకున్నాడు. అరణ్యంలోకి పరుగెత్తాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)