శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - రెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 2)

 శ్రీమద్రామాయణము

అరణ్య కాండము

రెండవ సర్గ

రామలక్షణులు, సీత ఆ రాత్రికి ఆ పర్ణశాలలోనే విశ్రమించారు. మరునాడు ఉదయము ఆ మునుల వద్ద అనుజ్ఞ తీసుకొని రాముడు, లక్ష్మణుడు, సీతతో సహా అరణ్యములోకి వెళ్లాడు. వారు అడవిలో ప్రయాణము చేస్తూ ఎన్నో వన్యమృగములను చూచారు. హటాత్తుగా వారి ఎదురుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షం అయ్యాడు. వాడి శరీరం ఒక కొండ మాదిరి ఉంది. వాడు నరమాంసభక్షకుడు అని రాముడు గ్రహించాడు. రామలక్ష్మణులు వాడి వంక నిశితంగా చూచారు.

వాడు నల్లగా కొండ మాదిరి ఉన్నాడు. కళ్లు ఎర్రగా ఉన్నాయి. వికృతాకారంతో ఉన్నాడు. వాడి శరీరం అంతా రక్తంతో తడిసి ఉంది. వాడి బుజం మీద ఒక శూలం ఉంది. దానికి మూడు సింహాలను, నాలుగు పెద్దపులులను, రెండు తోడేళ్లను, పది జింకలను, గుచ్చి తీసుకొని వెళుతున్నాడు.

ఆ రాక్షసుడు రామ లక్ష్మణులను చూచాడు. గట్టిగా అరిచాడు. వారిని చంపడానికి వారి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. వాడి కళ్లకు అందమైన సీత కనిపిపించింది. రావడం రావడం సీతను పట్టుకొన్నాడు. సీతను తీసుకొని పక్కకు వెళ్లాడు. రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు.

“జటలు ధరించిన మీరు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు? మీరు ఎవరైనా ఈ రోజు నా చేతిలో చావడం ఖాయం. మీరు ఇద్దరూ ముని కుమారుల వేషాలలో ఉన్నారు కదా! మీ వెంట ఈ స్త్రీ ఎందుకు ఉంది? ఈమె ఎవరు? ఈమెతో మీకు ఏమి సంబంధం? మునులు జితేంద్రియులు, సన్యాసులు కదా! మరి ముని ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించి మీరు ఎందుకు పాపం చేస్తున్నారు?" అని అన్నాడు ఆ రాక్షసుడు.

దానికి రాముడు ఆ రాక్షసుని చూచి ఇలా అన్నాడు. “నీవు మమ్ములను ఇలా అడుగుతున్నావే. ఇంతకూ నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?" అని అడిగాడు.

“నేను ఒక రాక్షసుడను. నా పేరు విరాధుడు. నేను ఈ అరణ్యములో ఉన్న మునులను చంపి ఆహారంగా తింటూ ఉంటాను. మీ వెంట ఉన్న ఈ స్త్రీ నాకు కావాలి. ఈమెను నేను పెళ్లి చేసుకుంటాను. ముని వేషములలో ఉండి కూడా ఈ స్త్రీని వెంటబెట్టుకొని తిరుగుతూ పాపం చేస్తున్న మిమ్ములను చంపి తింటాను.” అని అన్నాడు విరాధుడు.

ఆ మాటలు విన్న సీత చాలా భయపడింది. సీత శరీరం అంతా భయంతో వణికిపోయింది. విరాధుని ఒడిలో చిగురుటాకులా వణికిపోతున్న సీతను చూచి రాముడు చలించి పోయాడు. రాముడి మొహం పాలిపోయింది. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

"లక్ష్మణా! ఆ దుర్మార్గుడు విరాధుడు సీతను తన ఒడిలోకి ఎలా లాక్కున్నాడో చూచావా! కైక మనకు ఏమి జరగాలని మనసులో అనుకున్నదో అదే జరుగుతూ ఉంది. లక్ష్మణా! కైక తన కుమారుడు భరతునికి రాజ్యం ఇప్పించుకోవచ్చు. మనలను అడవులకు పంపి ఇన్ని కష్టాలకు గురిచెయ్యడం ఎందుకు? కైక మనకు ఏమి జరగాలని కోరుకుంటూ అడవులకు పంపిందో అదే జరుగుతూ ఉంది. నాకు వనవాస ప్రాప్తి, నా తండ్రి మరణము, ఇదుగో ఇప్పుడు నా భార్యను పరపురుషుడు తాకడం, ఒడిలోకి లాక్కోవడం, ఇంతకన్నా కష్టాలు ఏముంటాయి?” అని వాపోయాడు రాముడు.

ఆ మాటలు విన్న అక్ష్మణుడు కోపంతో రగిలిపోయాడు. 

“రామా! ఏమిటీ వెర్రి? నీవు దేవేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడవు. ఇలా బేలగా మాట్లాడటం నీకు తగునా? అసలు ఇలా ఎందుకు పరితపిస్తున్నావు? రామా! నువ్వు చూస్తూ ఉండు. ఒకే బాణంతో వీడిని మట్టి కరిపిస్తాను. వీడి రక్తంతో నేలను తడిపేస్తాను. దేవేంద్రుడు పర్వతముల మీద వజ్రాయుధమును ప్రయోగించినట్టు విరాధుని మీద నేను బాణప్రయోగము చేస్తాను. వీడు కొండ కూలినట్టు కూలిపోతాడు. వీడి వక్షస్థలమును చీలుస్తాను. వీడి ప్రాణాలు హరిస్తాను." అని కోపంతో ఊగిపోతూ అన్నాడు లక్ష్మణుడు. 

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)