శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - మొదటి సర్గ (Ramayanam - Aranyakanda - Part 1)

శ్రీమద్రామాయణము

అరణ్య కాండము

మొదటి సర్గ

రాముడు సీత, లక్ష్మణుడు వెంటరాగా దండకారణ్యములోనికి ప్రవేశించాడు. ఆ దండకారణ్యములో ఎంతో మంది మహా మునులు ఆశ్రమములు కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉండటం చూచాడు రాముడు. ఆ మునుల ఆశ్రమముల దగ్గర వన్య మృగములు పరస్పర వైరము, భయమూ లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. పక్షుల కిల కిలారావములతో, వన్యప్రాణుల విహారములతో ఆ వనసీమలో ఉన్న ముని ఆశ్రమములు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి.

ఆ మునుల ఆశ్రమములు విశాలమైన అగ్ని గృహములతోనూ, యజ్ఞమునకు కావలసిన సంభారములతోనూ, వేలాడుతున్న జింక చర్మములతోనూ, దర్భలతోనూ, అగ్నికార్యమునకు కావలసిన సమిధలతోనూ, నీళ్లతో నిండి ఉన్న పాత్రలతోనూ, తినడానికి కావలసిన ఫలములతోనూ నిండి ఉన్నాయి. ఒక పక్కనుండి వేదమంత్రములు చదువుతున్న ధ్వనులు, మరొక పక్క నుండి పూజా కార్యక్రమముల మంత్ర ధ్వనులు వీనుల విందుగా వినపడుతున్నాయి. ఆ ఆశ్రమములలో కేవలము తపస్సుచేసుకొనే మునులు మాత్రమే నివసిస్తున్నారు. రామలక్ష్మణులకు ఆ ప్రాంతము బ్రహ్మలోకము వలె కనిపించింది.

రాముడు, సీత, లక్ష్మణుడు తమ ఆశ్రమముల వంక రావడం ఆ మునులు చూచారు. వారంతా రామ లక్ష్మణులకు ఎదురు వెళ్లి స్వాగతము పలికారు. వారికి అర్ఘ్యము పాద్యము సమర్పించారు. కొందరు మునులు రామ లక్ష్మణుల దేహధారుఢ్యము, అంగసౌష్ఠవము చూచి ఆశ్చర్యపోయారు. వారిని రెప్ప వెయ్యకుండా చూస్తున్నారు.

ఆ మునులందరూ రామ లక్ష్మణులకు, సీతకు ఒక పర్ణశాలను చూపించారు. వారు అందులో నివాసము ఉండవచ్చునని తెలిపారు. కొందరు రామలక్ష్మణులకు నీళ్లు తెచ్చి ఇచ్చారు. మరి కొందరు తినడానికి మధురమైన ఫలములను తీసుకొని వచ్చి ఇచ్చారు. అందులో ముఖ్యులు, పెద్దవారు అయిన మునులు రాముని చూచి ఇలా అన్నారు.

“రామా! నీవు అయోధ్యకు మహారాజువు. రాజు లోక పూజ్యుడు. రాజు ప్రజలను ధర్మమార్గంలో నడిపిస్తాడు. రాజు దుష్టులను శిక్షిస్తాడు. ప్రజలను రక్షిస్తాడు. అందుకే రాజును అందరూ గౌరవించాలి, పూజించాలి. ప్రజారక్షకుడైన రాజు ఇంద్రునిలో నాలుగవ అంశ అని అంటారు. అందు చేతనే రాజు ప్రజల మన్ననలు పొందుతూ, రాజభోగములు ఇంద్రుని వలె అనుభవిస్తుంటాడు. ఈ ప్రదేశము అయోధ్యారాజ్యములో ఉంది. కాబట్టి నీవే మాకు రాజువు. నీవే మమ్ములను రక్షించాలి. నీవు ప్రస్తుతము వనములో ఉన్నావని రాజువు కాకపోవు. రాజు అయోధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, రాజు రాజే. రామా! మా సంగతి నీకు తెలుసు కదా! మేమే అన్ని సంగములను విడిచి పెట్టి జితేంద్రియులమై, ఆ అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాము. మాకు ఎవరైనా అపకారము చేసినా, వారి మీద కోపగించకోడానికి కూడా మేము ఇష్టపడము. కాబట్టి రాజువైన నీవే మా అందరినీ రక్షించాలి.” అని పలికారు.

తరువాత ఆ మునులు రామలక్ష్మణులకు, సీతకు అనేక ఫలములు, కంద మూలములు, ఇతరములైన ఆహార పదార్థములు తెచ్చి ఇచ్చారు. రాముడు వారు చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించాడు. వారు ఇచ్చిన పదార్థములను, ఫలములను భక్తితో స్వీకరించాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము మొదటి సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)