శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పంతొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 119)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట పంతొమ్మిదవ సర్గ
సీతారాముల కల్యాణ గాధను విన్న అనసూయ ఆనందంతో పరవశించిపోయింది. సీతను గాఢంగా కౌగలించుకొని ఆమె నుదుటి మీద ముద్దుపెట్టుకుంది. అంతలోనే రాత్రి అయింది. మునులు అందరూ వారి వారి సాయంకాల సంధ్యావందనారి కార్యక్రమములను ముగించుకొని తమ కుటీరములకు వస్తున్నారు. అంతలో చంద్రోదయము అయింది.అనసూయ సీతను చూచి, "సీతా! ఇంక నీవు రాముని వద్దకు వెళ్లు. నేను ఇచ్చిన ఆభరణములను, వస్త్రములను నా ఎదుటనే అలంకరించుకో. నిన్ను చూచి ఆనందిస్తాను." అన్నది అనసూయ.
ఆమె కోరిక మేరకు సీత అనసూయ ఇచ్చిన దివ్య వస్త్రములను, ఆభరణములను ధరించి, అనసూయకు నమస్కారము చేసింది. తరువాత సీత అనసూయ వద్ద సెలవు తీసుకొని రాముని వద్దకు వెళ్లింది.
సర్వాలంకార భూషిత అయిన సీతను చూచి రాముడు ఎంతో సంతోషించాడు. సీత కూడా అనసూయ తనకు ఇచ్చిన దివ్య వస్త్రములను, ఆభరణములను రాముని చూపించింది. మహాపతివ్రత అనసూయతో సత్కారమును పొందిన సీతను చూచి రాముడు లక్ష్మణుడు ఎంతో ఆనందించారు. రాముడు, సీత, చల్లని వెన్నెలలో ఆనందంగా విహరించారు.
ఆ రాత్రి గడిచిపోయింది. మరునాడు ఉదయము రామలక్ష్మణులు, ప్రాతఃసంధ్యావందనాది కార్యక్రములు ముగించు కున్నారు. తరువాత అక్కడ నివసించు ఋషుల వద్దకు వెళ్లి వారి ఆశీర్వాదము తీసుకున్నారు. ఆ మునులు రామలక్ష్మణులతో వారు ప్రయాణము చేయు మార్గములో రాక్షస బాధ ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.
“రామా! ఈ అరణ్యములో నరమాంసభక్షకులైన రాక్షసులు నివసిస్తున్నారు. వారినుంచి జాగ్రత్తగా ఉండు. ఒంటరిగా ఎవరైనా కనపడితే వారిని పట్టుకొని చంపి తింటారు. కాబట్టి మీ ముగ్గురూ ఒకటిగా ప్రయాణం చెయ్యండి. ఒంటరిగా ఉండవద్దు. సీతను ఒంటరిగా వదలవద్దు.”
రాముడు వారి సూచనలను అన్నీ శ్రద్ధగా విన్నాడు. వారి వద్ద సెలవు తీసుకొని సీత, లక్ష్మణునితో సహా అరణ్యములలోకి ప్రయాణం అయ్యాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
అయోధ్యాకాండము సర్వం సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment