శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదునెనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 118)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

నూట పదునెనిమిదవ సర్గ

అత్రిమహాముని భార్య అనసూయ చెప్పిన మాటలను సావధానంగా విన్న సీత, ఆమెతో ఇలా అన్నది.

“పూజ్యురాలా! స్త్రీకి పతియే దైవము అన్న విషయం నాకు బాగా తెలుసు. భర్త గుణవంతుడైనా, గుణహీనుడైనా, నాకు పూజ్యుడే. అటువంటప్పుడు గుణవంతుడు, దయాగుణము కలవాడూ, ఇంద్రియములను జయించినవాడు, నా మీద అమితమైన ప్రేమకలవాడూ, ధర్మము తెలిసినవాడూ, నన్ను నా తల్లితండ్రులకంటే ఎక్కువగా ఆదరించేవాడు అయిన నా భర్త రాముని నేను పూజించకుండా ఎలా ఉండగలను.

రాముడు నా మీదనే కాదు, తన తల్లి కౌసల్యమీదా, ఆయన ఇతర తల్లుల మీదా సమానమైన పూజ్యభావంతో ఉంటాడు. మా మామగారు దశరథునికి ఎంతో మంది భార్యలు ఉన్నారు. రాముడు వారి నందరినీ మాతృభావంతో గౌరవిస్తాడు. వారేకాదు. నన్ను తప్ప లోకంలో మిగిలిన స్త్రీలనందరినీ మాతృ భావంతో చూస్తాడు. మీరు చెప్పినమాటలే నేను వనవాసమునకు వచ్చునపుడు మా అత్తగారు కౌసల్యాదేవిగారు కూడా చెప్పారు. అవి ఇంకా నా మనసులో
మెదులుతున్నాయి.

అంతేకాదు, నాకు వివాహము చేసి అత్తగారి ఇంటికి పంపేటప్పుడు మా తల్లిగారు కూడా ఇదే ఉపదేశము చేసారు. అది కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మీ మాటలు వినగానే నాకు మా అమ్మ, అత్తగారు చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. మీరు కూడా నాడు సావిత్రి వలె పతిసేవలో తరించి ఉత్తమ లోకాలు పొందుతారు. పూర్వము కూడా ఎంతో మంది స్త్రీలు తమ భర్తలను సేవించి తరించారు."అని పలికింది సీత.

సీత మాటలకు అనసూయ ఎంతోసంతోషించింది. సీతను పొదివి పట్టుకొని ఆమె తలనిమిరి నుదుటి మీద ముద్దుపెట్టుకుంది. “అమ్మా సీతా! నేను ఎంతో తపశ్శక్తి సంపాదించాను. రాక రాక మా ఇంటికి వచ్చావు. నీకు ఏమైన కానుక ఇవ్వాలని ఉంది. నీకు ఇష్టమైనది ఏమైనా కోరుకో ఇస్తాను." పలికింది అనసూయ.

"అమ్మా! మిమ్ములను చూడటం, కలుసుకోవడం, మీతో మాట్లాడటమే గొప్ప వరం. ఇంకా నాకు ఏమీ కావాలి. మీ సన్నిధిలో నేను తృప్తిగా ఉన్నాను.” అని పలికింది సీత. 

అనసూయ నవ్వింది. "సీతా! నీ మనోభావన కానీ స్త్రీలకు అలంకారముల మీద మమకారము ఉంటుంది కదా. అందుకని నీకు దివ్యమైన ఆభరణములు, వస్త్రములు, అంగరాగములు ఇస్తున్నాను. వాటిని అలంకరించుకో. నేను ఇచ్చే ఆభరణములు, వస్త్రములు దివ్యమైనవి. ఎన్నటికీ మాయవు, నలగవు. నిత్యనూతనంగా ఉంటాయి. వాటిని ధరించి నీ భర్తకు ఆనందము కలిగించు." అని పలికి అనసూయ సీతకు దివ్యమైన ఆభరణములు, వస్త్రములు, మైపూతలు
తన తపశ్శక్తితో సృష్టించి ఇచ్చింది. సీత కూడా వాటిని భక్తితో తీసుకుంది. సీత అనసూయ పక్కనే కూర్చుని ఆమెను సేవించింది. 

ఇంక ఇద్దరూ పాత విషయాలను ముచ్చటించుకుంటున్నారు.

“సీతా! నీ వివాహం ఎలా జరిగింది. నీ తండ్రి నీకు స్వయంవరము ప్రకటించాడని విన్నాను. వాటి విశేషములు ఏమిటి నాకు చెప్పవా!" అని మాతృవాత్సల్యముతో అడిగింది. సీత కూడా తన పెళ్లినాటి ముచ్చట్లు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంది. అనసూయకు ఇలా చెప్పసాగింది.

“అమ్మా! నా తండ్రి జనకుడు మిథిలా నగరానికి రాజు. న్యాయంగా ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు. ఒకసారి ఆయన ఒక యజ్ఞమును చేయ సంకల్పించాడు. దాని కోసరం లాంఛనంగా భూమిని నాగలితో దున్నుతూ చదును చేస్తున్నాడట. అప్పుడు నేను ఆ నాగేటి చాలులో దొరికానట. నేను దొరికినప్పుడు ఆకాశము నుండి ఒక వాక్కు వినపడినదట "ఓరాజా! ఈ శిశువు మనుష్యజాతికి చెందినది కాదు. దేవతా కాంత. నీవు ఆమెను పుత్రికా ధర్మంతో
పెంచు." అని వినపడినదట.

తరువాత జనకుడు నన్ను తన కుమార్తె వలె పెంచి పెద్దచేసాడట. జనకుని భార్యకూడా నన్ను తన తల్లివలె ఆదరించి అల్లారు ముద్దుగా పెంచిందట. ఇంతలో నాకు వివాహము చేయదగిన వయసు వచ్చింది. నా తండ్రి జనకునకు నా వివాహము గురించి దిగులు పట్టుకుంది. ఎందుకంటే నేను అయోనిజను. దేవతా అంశ కలదానిను. కాబట్టి నాకు సమానమైన భర్త దొరకడం దుర్లభం.
ఆయనకు ఏమీ తోచలేదు. అందుకని నాకు స్వయం వరము ప్రకటించాడు. అంతకు ముందు వరుణ దేవుడు మా తండ్రి జనకునకు ఒక దివ్యమైన ధనుస్సు, రెండు అమ్ముల పొదులు ఇచ్చి అవి దాచమన్నాడు. ఆ ధనస్సు చాలా బరువైంది. ఎవరూ కనీసం కదపను కూడా కదపలేరు. ఎక్కుపెట్టడం ఎంతటి బలవంతునికైనా అసాధ్యం. అవి గుర్తుకు వచ్చాయి మా తండ్రిగారికి.
నా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ పిలిచి నా తండ్రి జనకుడు ఈ విధంగా ప్రకటించాడు.

“ఈ థనుస్సు దివ్యమైనది. దీనిని ఎవరైతే ఎత్తి ఎక్కుపెట్ట గలరో,వారికి నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తాను. ఇందులో సంశయం లేదు." అని ప్రకటించాడు.

ఎంతో మంది రాజులు ప్రయత్నించారు కానీ కనీసం ఆ ధనుస్సును కదల్చనుకూడా కదల్చ లేకపోయారు. ఇంక ఎత్తడం, ఎక్కుపెట్టడం అనేది వారందరికీ అసాధ్యం అయింది. అందుకని రాజులందరూ ఆదివ్యమైన ధనుస్సుకు నమస్కరించి వెళ్లిపోయారు. అలాచాలాకాలము గడిచింది. ఆ దివ్య ధనుస్సును ఎవరూ ఎత్తలేకపోయారు. ఎక్కుపెట్టలేకపోయారు. ఇంతలో రఘువంశము లో పుట్టిన రాముడు విశ్వామిత్రుని తో సహా మిథిలకు వచ్చాడు.

విశ్వామిత్రుడు, రామలక్ష్మణులను మా తండ్రికి పరిచయం చేసాడు.

“ఓ జనకమహారాజా! వీరు రామలక్ష్మణులు, అయోధ్యాధిపతి దశరథుని కుమారులు. నీ దగ్గర దివ్యమైన ధనుస్సు ఉందని విన్నాము. దానిని చూడటానికి వచ్చారు. ఆ ధనుస్సును వీరికి చూపించు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

నా తండ్రి ఆ ధనుస్సును అతి కష్టం మీద అక్కడకు తెప్పించాడు. రాముడు ఆ ధనుస్సును అవలీలగాఎత్తి ఎక్కుపెట్టాడు. నారి పట్టుకొని ఒక్కసారి ఆకర్ణాంతము లాగాడు. (ఎడమ చేతితో ధనుస్సు పట్టుకొని, కుడి చేతితో దానికి కట్టిన తాడు పట్టుకొని చెవి దాకా లాగడం.) రాముడు లాగిన వేగానికి పిడుగు పడిన శబ్దం వచ్చింది. ఆ దివ్యమైన ధనుస్సు మధ్యకు విరిగి రెండు ముక్కలయింది. నా జనకుడు ఎంతో సంతోషించాడు. తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారము నన్ను రామునికి ఇచ్చి కన్యాదానము చేయ నిశ్చయించాడు. వెంటనే జలము తెమ్మని ఆదేశించాడు.
కాని రాముడు తన తండ్రి అనుమతి లేనిదే వివాహము చేసుకోను అని అన్నాడు. వెంటనే దశరథునికి వర్తమానము పంపించారు. దశరథమహారాజు మిథిలానగరమునకు వచ్చాడు. నా జనకుడు నన్ను రామునికి ఇచ్చి వివాహము చేసాడు. నా చెల్లెలు ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహము చేసాడు. ఆ విధంగా నా వివాహము రామునితో జరిగింది. అప్పటి నుండి నేను నా భర్త రాముని దైవము వలె పూజిస్తున్నాను."అని తన వివాహ వృత్తాంతమును అనసూయకు తెలిపింది సీత.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదునెనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)