శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదునేడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 117)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట పదునేడవ సర్గ
మునులందరూ వెళ్లిపోయిన తరువాత రాముడు ఆలోచనలో పడ్డాడు. మునులు చెప్పినది నిజమే అనిపించింది. ఆ ప్రదేశంలో ఉండటం క్షేమం కాదనుకున్నాడు. దానికి తోడు రామునికి పాతజ్ఞాపకాలు వెంటాడ సాగాయి. ఆ పర్ణశాలలోనే రాముడు భరతుని, శత్రుఘ్నుని, తన తల్లులను కలుసుకున్నాడు. ఇప్పుడు వారు లేకపోవడంతో మాటి మాటికీ వారే మనసులో మెదులు తున్నారు. వారి జ్ఞాపకాలతోనే మనసు నిండిపోయింది. స్థలం మారితేనే గానీ ప్రయోజనం లేదు అని అనుకున్నాడు.దానికి తోడు భరతుడు తన సేనలతో వచ్చి అక్కడ ఉన్నాడు. వారు అక్కడ ఉన్న కాలంలో వారు వాడేసిన వ్యర్థ పదార్థాలు, గుర్రములు, ఏనుగులు వదిలిన మలమూత్రములతో ఆ ప్రదేశం అంతా దుర్గంధం వ్యాపించింది. ఆ కారణం చేత కూడా ఆ ప్రదేశం తమ నివాసమునకు అనుకూలంగా లేదు అని అనుకున్నాడు రాముడు.
అందుకని ఆ ప్రదేశము విడిచి సీతతో, లక్ష్మణునితో కలిసి అత్రి మహాముని ఆశ్రమమునకు వెళ్లాడు. అత్రి మహాముని రాముని తన కుమారుని వలె ఆదరించాడు. వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించాడు. తినడానికి ఫలములు ఇచ్చాడు. తన భార్య వృద్ధురాలు అయిన అనసూయకు రాముని, సీతను పరిచయం చేసాడు.
“రామా! ఈమె నా భార్య అనసూయ. నా సహధర్మచారిణి. ఒకసారి పది సంవత్సరములు కరువు వచ్చి లోకము అంతా దగ్ధము అయిపోతున్న సమయంలో, జనులకు ఫలములను జలములను ఇచ్చి కాపాడింది. ఈమె గొప్ప తపస్వి. ఈమె నీకు తల్లి వంటిది. ఈమె సార్థక నామధేయురాలు. అసూయ అంటే ఏమిటో తెలియని అనసూయ. పైగా వృద్ధురాలు. సీతకు ఆమె గురించి చెప్పి పరిచయం చెయ్యి" అని అన్నాడు అత్రి.
రాముడు సీతతో ఇలా అన్నాడు. "సీతా! విన్నావుగా మహాఋషి మాటలు. మహాతపస్వి అనసూయా దేవిని సేవించు. నీకు శుభం కలుగుతుంది."అనిఅన్నాడు.
వెంటనే సీత అనసూయ వద్దకు వెళ్లి ఆమెకు ప్రదక్షణ పూర్వకంగా నమస్కారము చేసింది. తన పేరు, తన గురించి చెప్పుకుంది. వృద్ధురాలు అనసూయ కూడా సీతను ఆలింగనము చేసుకొని ఆమెను కుశలప్రశ్నలు వేసింది.
ఇంకా ఇలా అంది. "సీతా! నీవు ధర్మమును పాటిస్తున్నావు. అందుకే ఏ మాత్రంఅహంకారము, అభిజాత్యము, కోపం లేకుండా, నీ రాజభోగములను, ఐశ్వర్యమును వదిలిపెట్టి, పతి వెంట వనవాసము నకు వచ్చావు. నీ వంటి సౌభాగ్యవతి ఎక్కడా లేదు. తన భర్త రాజుగా రాజాంత:పురములలో ఉన్నా, లేక వనములలో కష్టాలు పడుతూ ఉన్నా, తన భర్త పుణ్యాత్ముడైనా, పాపాత్ముడైనా, భర్తను విడిచిపెట్టకుండా సదా అనుసరించి ఉంటుందో ఆ భార్య ఉత్తమలోకములను పొందుతుంది. ఉత్తమ స్త్రీలకు తన భర్త ధనవంతుడైనా, దరిద్రుడైనా, గుణవంతుడైనా, దురభ్యాసాలకు అలవాటు పడినవాడైనా, అతడే దైవము. అటువంటి స్త్రీ తన భర్తమును దైవము వలె పూజిస్తుంది. స్త్రీలకు భర్తను మించిన ఆప్త బంధువు వేరొకరు లేరు అనడంలో అతిశయోక్తిలేదు. కాని కొంత మంది స్త్రీలు కోరికలకు బానిసలై, తన భర్త తాను కోరిన కోరికలు తీర్చలేదని భర్తను నిరాదరిస్తుంటారు. భర్తలమీద అధికారము చేస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలు ధర్మభ్రంశమును పొంది అపకీర్తి పాలవుతారు.
కాని నీ వంటి స్త్రీలు మంచి చెడ్డలను పరిశీలించి భర్తకు అనుకూలంగా నడుచుకుంటూ ఉత్తమలోకములు పొందుతారు. అందుకని నీవు కూడా ఎల్లప్పుడూ నీ భర్తనే అనుసరిస్తూ, భర్త మాట జవదాటకుండా, ఉత్తమ స్త్రీగా వర్ధిల్లు. దాని వలన నీకు కీర్తి, సౌభాగ్యము సంప్రాప్తిస్తాయి."అని పలికింది అనసూయ.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదునేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment