శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదునారవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 116)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట పదునారవ సర్గ
భరతుడు అయోధ్యకు వెళ్లిపోయాడు. రామలక్ష్మణులు, సీత, వనవాసము చేస్తున్నారు. రాముడు అక్కడున్న ఋషుల మొహాల్లో ఏదోభయాన్ని చూచాడు. వారు ఆందోళనగా ఉన్నట్టు గమనించాడు. ప్రదేశమును వదిలి వెళ్లబోతున్నట్టు తెలుసుకున్నాడు. రాముని చూచి వారు ఏదో గుసగుసగా రహస్యంగా మాట్లాడుకోవడం చూచాడు రాముడు.రామునికి ఏమీ అర్థం కావడం లేదు. తాము అక్కడ ఉండటం వలన ఆ ఋషులకు ఏమైనా అసౌకర్యం కలిగిందేమో అని అనుమాన పడ్డాడు. ఏమైనా సరే అనుమానము నివృత్తి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ ఋషుల కందరిలోకీ పెద్దవాడి దగ్గరకు వెళ్లాడు. ఆయనకు భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు.
“మహాత్మా! గత కొద్దిరోజులుగా ఇక్కడ ఉన్న ఋషుల ప్రవర్తనలో ఏదో మార్పుకనపడుతూ ఉంది. కారణం తెలియడం లేదు. మా వల్ల ఏదైనా అపరాధము జరిగిందా? నా తమ్ముడు తమరి పట్ల ప్రమాదవశాత్తు అనుచితంగా ప్రవర్తించాడా! నా భార్య సీత తమరికి కూడా సేవలు చేస్తూ ఉంది కదా. ఆమెసేవలలో ఏమైనా లోపం కనిపించిందా! మా వల్ల ఏమైనా అపరాధము జరిగితే చెప్పండి
సరిదిద్దుకుంటాము." అని అన్నాడు రాముడు.
సరిదిద్దుకుంటాము." అని అన్నాడు రాముడు.
దానికి ఆ వృద్ధుడైన ఋషి ఇలాఅన్నాడు. “రామా! నీ భార్య కల్యాణి. కల్యాణ స్వభావము కలది. ఆమె వల్ల లోపం ఎందుకుంటుంది. కాని ఒకవిషయం నీకు చెప్పాలి. మీరు ఇక్కడ నివసిస్తున్నారు కదా. మీమీద రాక్షసులకు వైరము ఉంది. మీకూ రాక్షసులకు ఉన్న వైరము కారణంగా మా తాపసులకు ఏమైనా అపకారము కలుగుతుందేమో అని ఈ ఋషులు భయపడుతున్నారు. దాని గురించి వారు రహస్యంగా మాట్లాడు కుంటున్నారు. నీ ఎదుట పడి చెప్పడానికి భయపడుతున్నారు.
రామా! ఇక్కడ రావణుని తమ్ముడు ఖరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు సామాన్యుడు కాడు. అతి క్రూరుడు. నరమాంస భక్షకుడు. మహావీరుడు. వాడు జనస్థానములో తపస్సు చేసుకుంటున్న ఋషులను అందరినీ చంపాడు. వాడికి నీ మీద కోపముగ ఉందని తెలిసింది. నీవు ఇక్కడకు వచ్చి పర్ణశాల నిర్మించుకొన్నది మొదలు ఆ రాక్షసుల బాధ ఎక్కువ అయింది.
రాక్షసులు మమ్ములను నానాబాధలకు గురి చేస్తున్నారు. వారు చూడటానికే భయంకరంగా ఉండే ఆకారాలతో వచ్చి మమ్ములను బాధిస్తున్నారు. మేము చేసు కొనే హోమములలో తినకూడని పదార్థములను వేస్తున్నారు. మా ఎదుటనే ఋషులను చంపుతూ మమ్ములను భయభ్రాంతులను చేస్తున్నారు. వాళ్లు ఎక్కడుంటారో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. హటాత్తుగా వస్తారు. అందినవాడిని అందినట్టు చంపుతారు. ఆనందంతో కేరింతలు కొడతారు. హెూమగుండంలో నీళ్లు పోసి ఆర్పుతారు. మేము వాడుకొనే పాత్రలు పగుల కొడతారు. తరువాత అందకుండా పారిపోతారు.
వారి బాధలు భరించలేకుండా ఉన్నాము. ఈ చోటు విడిచి వేరేచోటికి పోదామని అందరూ అనుకుంటున్నారు. వాళ్లు మమ్ములను శారీరకంగా హింసిస్తున్నారు. వారి బాధలు పడలేకుండా ఉన్నాము. ఇక్కడికి సమీపములోనే మరొక అరణ్యము ఉంది. అక్కడ ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. మేము తపస్సు చేసుకోడానికి అక్కడ అనువుగా ఉంటుంది. అందుచేత అక్కడకు పోదామని నన్ను బలవంతం చేస్తున్నారు. ఇంతలో నువ్వే అడిగావు.అందుకని వివరంగా చెప్పాను.
వారి బాధలు భరించలేకుండా ఉన్నాము. ఈ చోటు విడిచి వేరేచోటికి పోదామని అందరూ అనుకుంటున్నారు. వాళ్లు మమ్ములను శారీరకంగా హింసిస్తున్నారు. వారి బాధలు పడలేకుండా ఉన్నాము. ఇక్కడికి సమీపములోనే మరొక అరణ్యము ఉంది. అక్కడ ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. మేము తపస్సు చేసుకోడానికి అక్కడ అనువుగా ఉంటుంది. అందుచేత అక్కడకు పోదామని నన్ను బలవంతం చేస్తున్నారు. ఇంతలో నువ్వే అడిగావు.అందుకని వివరంగా చెప్పాను.
ఆ ఖరుడు మమ్ములనే కాదు నిన్ను కూడా బాధించగలడు. నీకు కూడా ప్రాణాపాయము కలుగుతుంది. అందుకని నీకు ఇష్టం అయితే నువ్వు కూడా ఈ ప్రదేశము విడిచి మా వెంట వచ్చెయ్యి. ఎందుకంటే మీ తోపాటు నీ భార్యకూడా ఉంది. ఆమెను ఎల్లప్పుడూ రక్షించుకోడం కష్టం కదా! ఎప్పుడో ఒకప్పుడు ఆమె ఒంటరిగా ఉండవలసి వస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న సీతకు రాక్షసుల వలన ఏదో ఒక ఆపద కలుగుతుంది. అందువలన మీరు ఇక్కడ ఉండటం అంతక్షేమంకాదు. " అన్ని గబా గబా చెప్పాడు.
తరువాత ఆ మునులందరూ ఆ ప్రదేశమును విడిచి వెళ్లడానికి ఉద్యుక్తులవు తున్నారు. రాముడు మాత్రము అక్కడ నుండి వెళ్లడానికి ఇష్టపడలేదు. అందుకని ఆ మునులందరూ రాముని అక్కడే విడిచి వెళ్లిపోయారు. రాముడు కొంతదూరము వారితో వెళ్లి వారికి వీడ్కోలు చెప్పాడు. తిరిగి తన పర్ణశాల వద్దకు వచ్చాడు.
ఆరోజుదాకా ఋషులతో వారి వేదఘోషలతో మార్మోగిన ఆ ప్రదేశములో ఒక్కసారి నిశ్శబ్దం ఆవరించింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదునారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment