శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదునాలుగు, పదునైదవ సర్గలు (Ramayanam - Ayodhyakanda - Part 114 & 115)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట పదునాలుగు, పదునైదవ సర్గలు
భరతుడు అయోధ్యలో ప్రవేశించాడు. అయోధ్య నిర్మానుష్యంగా ఉంది. కళావిహీనంగా ఉంది. పిల్లులు గుడ్లగూబలు తిరుగుతున్నాయి కానీ మనుషులు, పెంపుడు జంతువుల సంచారం లేదు. హోమాగ్నులు జ్వలించనందున, హెూమధూమములు పైకి లేవడంలేదు. కార్యాలయములు పనిచేయడం లేదు. విపణివీధులలో వ్యాపారం జరగడం లేదు. సంగీతవాద్యధ్వనులు, నాట్య విన్యాసములు మచ్చుకైనా కానరావడం లేదు.ఇదంతా జాగ్రత్తగా గమనిస్తూ వెళుతున్నాడు భరతుడు . రాముడు అయోధ్యను విడిచి వెళ్లడం తోటే రాజ్యలక్ష్మి రామునితోనే వెళ్లిపోయినట్టుంది అని అనుకున్నాడు భరతుడు. భరతుడు దశరథుని మందిరములోనికి ప్రవేశించాడు. సింహము వెళ్లిపోయిన తరువాత సింహము నివసించిన గుహ ఎలా ఉంటుందో అలా ఉంది దశరథుని మందిరము. భరతునికి కన్నీళ్లు ఆగలేదు. ధారాపాతంగా కారుతున్నాయి.
తరువాత భరతుడు తన తల్లులతోనూ కులగురువు వసిష్ఠునితోనూ బ్రాహ్మణులతోనూ సమావేశం అయ్యాడు. అక్కడ తన నిర్ణయాన్ని వెళ్లడించాడు.
“నేను ఇప్పుడు అయోధ్య సరిహద్దులలో ఉన్న నందిగ్రామమునకు వెళుతున్నాను. నా తండ్రి దశరథుడు, నా అన్న రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేను. నేను నందిగ్రామము నుండి రాముడి రాజ్యప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను. రాముడు వచ్చేవరకూ అక్కడే వేచి ఉంటాను."అని అన్నాడు భరతుడు.
భరతుని మాటలకు అందరూ తమ ఆమోదమును తెలిపారు. వెంటనే రథము సిద్ధ చేయమన్నాడు భరతుడు. తల్లులందరికీ నమస్కరించి భరతుడు రథం ఎక్కాడు. శత్రుఘ్నుడు భరతుని అనుసరించాడు. వసిష్ఠుడు, గురువులు, బ్రాహ్మణులు వారిని అనుసరించారు. అందరూ నందిగ్రామము చేరుకున్నారు. పురప్రముఖులు కూడా వారి వెంట నంది గ్రామమునకు వెళ్లారు.
భరతుడు కుల గురువు వసిష్ఠుని చూచి ఇలా అన్నాడు. "గురువర్యా! మా అన్న రాముడు ఈ రాజ్యభారమును నాయందు ఉంచాడు. ఆయనకు బదులు ఆయన పాదుకలు నాకు ఇచ్చాడు. రాజలాంఛనములు, ఛత్రచామరములు అన్నీ ఈ పాదుకలకు జరుగుతాయి. రాజ్యపాలన ఈ పాదుకలే నిర్వహిస్తాయి. రాముడు తిరిగి వచ్చువరకూ ఈ పాదుకల సాక్షిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను. రాముడు తిరిగి వచ్చిన తరువాత నేనే స్వయంగా ఈ పాదుకలు రాముని పాదములకు తొడిగి ఆయన పాదములకు నమస్కరిస్తాను. తరువాత ఆయన రాజ్యము ఆయనకు అప్పగించి రామునికి పట్టాభిషేకము చేస్తాను. అయోధ్య ప్రజలందరూ రాముని పరిపాలనలో సుఖంగా ఉంటారు."అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికాడు.
భరతుడు రాముని పాదుకలకు పట్టాభిషేకము జరిపించాడు. రాముని బదులు అయోధ్యను పాలిస్తున్నాడు. రాముడికి లేని సుఖాలు నాకు ఎందుకు అని జటలు, నారచీరలు ధరించాడు భరతుడు. ప్రతిరోజూ తాను నిర్వహించిన రాజ్యపాలనా విశేషములను ఆ పాదుకలకు నివేదించేవాడు. ఏ సమస్య వచ్చినా ఆ పాదుకలకు నివేదించేవాడు భరతుడు. రామునికి సేవకుడి వలె రాజ్యపాలన సాగించాడు భరతుడు. ఎవరు ఏమి తెచ్చి ఇచ్చినా, ఏ కానుకలు వచ్చినా అవన్నీ పాదుకలకు సమర్పించేవాడు భరతుడు. ఆ ప్రకారంగా భరతుని రాజ్యపాలన సాగిపోయింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదునాలుగు, పదునైదవ సర్గలు సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment