శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదమూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 113)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట పదమూడవ సర్గ
భరతుడు, శత్రుఘ్నుడు, తల్లులు, మంత్రులు, వసిష్ఠుని తో సహా అందరూ అయోధ్యకు తిరుగు ప్రయాణం అయ్యారు. భరతుడు రాముని పాదుకలను గౌరవ పూర్వకంగా తన శిరస్సుమీద ధరించాడు. వారందరూ చిత్రకూటపర్వతమును దాటి మందాకినీ నది వైపుకు ప్రయాణం చేసారు. భరద్వాజ ఆశ్రమమునకు చేరుకున్నారు.భరతుడు, వసిష్ఠుడు వెంటరాగా భరద్వాజుని దర్శనార్థము వెళ్లాడు. భరతుని చూచి భరద్వాజుడు కుశల ప్రశ్నలు వేసాడు. వెళ్లిన కార్యము సఫలము అయిందా అని అడిగాడు. భరతుడు భరద్వాజునితో ఇలా అన్నాడు.
“మహాత్మా! నేను రాముని అయోధ్యకురమ్మని పలువిధముల ప్రార్థించాను. రాముడు అంగీకరించలేదు. “నా తండ్రి ఆజ్ఞ ప్రకారము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యములలో ఉండెదను" అని తన నిర్ణయాన్ని తెలియజేసాడు. అప్పుడు కులగురువు వసిష్ఠుడు రాముని తో ఇలా అన్నాడు. “రామా! ఇవిగో బంగారముతో చేసిన పాదుకలు. వీటిని నీవు
తొడుగుకొని వాటిని మాకు ఇమ్ము. ఇవి నీ ప్రతినిధిగా మనసులో తలంచి, భరతుడు అయోధ్యను పాలిస్తాడు." అని అన్నాడు. రాముడు సంతోషంతో అంగీకరించాడు. రాముడు తూర్పు వైపుకు తిరిగి ఆ బంగారు పాదుకలను తొడుగుకొన్నాడు. వాటిని నాకు ఇచ్చాడు. నేను ఆ పాదుకలను రామునికి బదులుగా స్వీకరించాను. రాముని అనుజ్ఞ తీసుకొని నేను ఈ రామ పాదుకలను తీసుకొని అయోధ్యకు వెళు తున్నాను." అని అన్నాడు భరతుడు.
"భరతా! నీవు సుగుణ శీలుడవు. పుణ్యాత్ముడవు. నీ వంటివాడు దశరథునికి కుమారుడిగా జన్మించడం ఆయన అదృష్టం. నీవలన నీ తండ్రి కీర్తిని పొందాడు." అని అన్నాడు భరద్వాజుడు.
తరువాత భరతుడు భరద్వాజునకు నమస్కరించి తన పరివారముతో సహా అయోధ్యకు ప్రయాణము అయ్యాడు. వారందరూ గంగానదిని దాటి శృంగిబేరపురము ప్రవేశించారు. అక్కడ గుహుని కలుసుకొని, అయోధ్యకు ప్రయాణం అయ్యారు. భరతుడు అయోధ్యకు చేరుకున్నాడు. రాముడు లేని అయోధ్య కళావిహీనంగా ఉండటం చూచాడు భరతుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment