శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పన్నెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 112)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట పన్నెండవ సర్గ
ఆ ప్రకారంగా రాముడు, భరతుని మధ్య జరిగిన వాదోప వాదములు చూచి, విని అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపోయారు. వారంతా రాముని ధర్మనిరతిని ప్రశంసించారు. అక్కడ ఉన్న ఋషులు భరతునితో ఇలా అన్నారు."భరతా! నీవు గొప్పవంశములో జన్మించావు. సకల శాస్త్రములు అభ్యసించావు. బుద్ధిమంతుడవు. నీ అన్న రాముడు ఎలా చెబితే అలా చెయ్యి. రాముని బలవంత పెట్టకు. నీ తండ్రి దశరథుడు తన భార్య ఋణము తీర్చుకొని స్వర్గానికి వెళ్లాడు. రాముడు తండ్రి ఋణము తీర్చుకుంటున్నాడు. కాబట్టి రాముని వనవాసము చెయ్యనివ్వు." అని చెప్పారు. తరువాత వారు ఎవరి ఆశ్రమములకు వారు వెళ్లిపోయారు. కాని భరతునికి మాత్రము వారి మాటలు రుచించలేదు. ఆఖరి ప్రయత్నంగా, మాటలు తొట్రుపడుతుంటే గద్గద స్వరంతో, వణుకుతూ, చేతులు జోడించి, భయం భయంగా రామునితో ఇలా అన్నాడు.
“అన్నయ్యా! రాజధర్మము, కులధర్మము ప్రకారము పెద్దవాడే రాజుగా ఉండాలి కానీ చిన్నవాడు కాదు. ఇప్పుడు నీవు రాజధర్మమునకు కులధర్మమునకు విఘాతము కలిగించకు. నా మాట నా తల్లి మాట మన్నించు. అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టు. ఎందుకంటే నేను నీ కన్నా చిన్నవాడిని. ఈ రాజ్యభారము మోయలేను. నేను అసమర్థుడను. మన బంధువులు మిత్రులు అందరూ నీవే రాజు కావాలని ఎదురు చూస్తున్నారు. వారందరి దృష్టిలో నీవే రాజు కావడానికి సమర్ధుడివి. కాబట్టి వెంటనే అయోధ్యకు బయలుదేరు.” అని అన్నాడు భరతుడు.
అనడమే కాదు. రాముని పాదముల మీద పడి ప్రార్థించాడు. రాముడు భరతుని రెండు చేతులతో లేవనెత్తాడు. తన తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. భరతుని తల ప్రేమతో నిమిరాడు.
"భరతా! నీవు సామాన్యుడివి కావు. బుద్ధిమంతుడివి. గురువుల దగ్గర అన్ని విద్యలూ నేర్చుకున్నావు. నీవు రాజ్యమును పాలించడానికి సమర్థుడివి. అధైర్యపడకు. ధైర్యంగా అయోధ్యకు వెళ్లు. రాజ్యాధికారము చేపట్టు. నీకు తోడుగా కులగురువు వసిష్ఠులవారు, అమాత్యులు, సైన్యాధిపతులు ఉన్నారు. వారి సాయంతో రాజ్యము పాలించు. అంతేగాని నన్ను అయోధ్యకు రమ్మని కోరకు. చంద్రుడు తన వెన్నెలను కోల్పోయినా, హిమవత్పర్వతము తన చల్లదనాన్ని కోల్పోయినా, సముద్రము చెలియలి కట్టదాటినా, నేను మాత్రము తండ్రి ఆజ్ఞను అతిక్రమించను, అయోధ్యకు రాను. మరొకమాట. నీ తల్లి మితి మీరిన ఆశవలననో, నీ మీద ఉన్న అధిక ప్రేమ వలననో ఇదంతా చేసింది. ఫలితం మనం ఇద్దరం అనుభవిస్తున్నాము. నాతో పాటు సీత, లక్ష్మణుడు అనుభవిస్తున్నారు. గతం గత: అంతా మరిచిపో. నీ తల్లి కేవలం నిమిత్త మాతురాలు. ఇప్పటికే భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉంది. ఆమెను ఏమీ అనవద్దు. దూషించవద్దు. ఒక కొడుకు తల్లిని గౌరవించినట్టు గౌరవించు. ఆమె మనసు బాధపెట్టకు." అని హితబోధ చేసాడు రాముడు.
అప్పుడు భరతుడు బంగారముతో చేసిన పాదుకలు తెప్పించాడు. రాముని పాదముల వద్ద పెట్టాడు. రామునితో ఇలా అన్నాడు.
"రామా! ఇవి బంగారముతో చేసిన పాదుకలు. వీటిమీద నీ పాదములు ఉంచు. ఇవే నాకు శిరోధార్యములు. ఇంక నుంచి ఈ రామ పాదుకలే అయోధ్యను నీకు బదులుగా పాలిస్తాయి. నేను కేవలం నీ ప్రతినిధిని మాత్రమే. నీ ప్రతినిధిగా అయోధ్యను పాలిస్తాను.” అని అన్నాడు.
రాముడు భరతుని మాటలను మన్నించాడు. ఆ పాదుకల మీద తన పాదములను పెట్టి ఆ పాదుకలను భరతునికి ఇచ్చాడు. భరతుడు ఆ పాదుకలకు నమస్కరించాడు.
“రామా! నేటి నుంచి ఈ పాదుకలు నాకు దిశానిర్దేశము చేస్తాయి. నేను కూడా నీ మాదిరి నారచీరలు, జటలు ధరిస్తాను. అయోధ్య బయట ఆశ్రమము వేసుకొని ఉంటాను. అక్కడ ఈ పాదుకలను ప్రతిష్ఠిస్తాను. నీకు ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను. నీరాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను.
రామా! ఈ పదునాలుగు సంత్సరములు గడువు పూర్తి అయిన మరునాడు నువ్వు అయోధ్యకు రావలెను. అలా రాకపోతే ఆరోజే నేను అగ్నిప్రవేశము చేస్తాను." అని పలికాడు భరతుడు. రాముడు భరతుని మాటలకు అంగీకరించాడు. శత్రుఘ్నుని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని శిరస్సు ముద్దుపెట్టుకున్నాడు. తరువాత భరతుని చూచి ఇలా అన్నాడు.
“భరతా! నీ తల్లిని జాగ్రత్తగా చూసుకో. ఆమెపై కోపించవద్దు. నీవు ఆమెను చిన్న మాట అన్నా నామీద, సీత మీద ఒట్టు." అని అన్నాడు. కళ్లనిండా నీళ్లు నిండగా రాముడు భరతునికి వీడ్కోలు పలికాడు. భరతుడు రాముని పాదుకలకు పూజచేసాడు. వాటిని భద్రగజము మీద రాజు కూర్చునే స్థానములో పెట్టాడు. అయోధ్యకు ప్రయాణం అయ్యాడు. రాముడు అయోధ్యనుండి వచ్చిన వారికి సాదరంగా వీడ్కోలు పలికాడు. రాముడు తన తల్లులందరికీ పాద నమస్కారము చేసాడు. దు:ఖము ఆపుకోలేక పర్ణశాలలోకి వెళ్లిపోయాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పన్నెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment