శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదకొండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 111)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట పదకొండవ సర్గ
వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశరాజుల నందరి గురించి చెప్పి, వారందరూ రాజధర్మమును పాటించారనీ, ఆ వంశముల రాజులందరూ జ్యేష్టునికే పట్టం కట్టారనీ వివరించాడు. కానీ రాముడు ఏమీ మాట్లాడలేదు. వసిష్ఠుడు మరలా చెప్పనారంభించాడు.“ఓరామా! జన్మఎత్తిన ప్రతివాడికీ ముగ్గురు గురువులు ఉంటారు. వారు తల్లి, తండ్రి, విద్యనేర్పిన గురువు. తండ్రి పురుషుని జన్మకు కారకుడవుతాడు. తల్లి జన్మనిస్తుంది. గురువు జ్ఞానమును ఉపదేశిస్తాడు. నేను నీ తండ్రిగారికీ. ఇప్పుడు నీకూ గురువును. గురువుచెప్పిన మాటలు వినడం లోకధర్మం. గురువుచెప్పిన మాటలు వినకపోతే నీవు పెద్దల మాటలను ఎదిరించినవాడివి అవుతావు.
నీకు సహజ గురువు నీ తల్లి కౌసల్య. ఆమె భర్తను పోగొట్టుకొని వృద్ధాప్యములో ఉంది. ఒక కుమారునిగా నీ తల్లికి సేవచేయడం నీ ధర్మం. నీ తల్లి సేవను మరిచి, నీవు అడవులలో ఉంటే నీవు నీ ధర్మమును అతిక్రమించిన వాడవు అవుతావు. భరతుడు నీ తమ్ముడు. చిన్న వాడి మాటలు మన్నించడం పెద్దల ధర్మము. కాబట్టి నీ తమ్ముని మాటలు మన్నించు.ఒక గురువుగా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను." అని పలికాడు వసిష్టుడు.
కులగురువు వసిష్ఠుడు చెప్పిన మాటలను సావధానంగా విన్నాడు రాముడు. గురువు గారికి నేరుగా ప్రత్యుత్తరం ఇచ్చి వారిని అగౌరవ పరచినట్టు కాకుండా, పక్కన ఉన్న వారితో అన్నట్టు ఇలా అన్నాడు.
“నా తల్లి, తండ్రి నన్ను పుట్టినప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచారు. నేను కోరకుండానే అన్నీ సమకూర్చారు. వారి ఋణం తీర్చుకోడం నా కర్తవ్యము. నా తండ్రి దశరథుని ఎదుట నేను ప్రతిజ్ఞ చేసాను. దానిని పాటించడం నా ధర్మము. నా తండ్రి ఇప్పుడు లేడని ఏవేవో కుంటి సాకులు చెప్పి ఆయనకు ఇచ్చిన మాటను అబద్ధం చేయలేను. కాబట్టి నేను అయోధ్యకు రాలేను. ఇది నా నిశ్చయము.” అని ముక్తసరిగా చెప్పి ఊరుకున్నాడు.
రాముని మాటలు విన్న భరతుడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “సుమంత్రా! నీవు దర్భలు తీసుకొని వచ్చి ఇక్కడ పరుచు. రాముడు అయోధ్యకు వచ్చువరకు రాముని కదలనీయను. నేను ఇక్కడే పడుకుంటాను. ఆహారము, నీరు ముట్టను. రాముడు అయోధ్యకు రావడానికి అంగీకరించే వరకూ ఇక్కడే పడుకుంటాను.” అని అన్నాడు.
భరతుని ఆదేశము మేరకు సుమంత్రుడు దర్భలు తెచ్చి అక్కడ పరిచాడు. ఇదంతా చూస్తున్న రాముడు భరతునితో ఇలా అన్నాడు.
"భరతా! ఏమిటీ పని. నేనేం పాడు పని చేసానని నీవు ఇలా దీక్ష చేస్తున్నావు. ఎవరైనా బ్రాహ్మణుని వద్ద అప్పు తీసుకొని ఎగవేస్తే, వారి ఇంటి ముందు, ఆ బ్రాహ్మణుడు ఇలా నిరాహార దీక్ష చెయ్యవచ్చు కానీ క్షత్రియులకు ఇది తగదు. కాబట్టి ఈ నిరశనవ్రతమును విడిచిపెట్టి అయోధ్యకు వెళ్లు." అని అన్నాడు.
దీనితో భరతునికి తిక్కరేగింది. అక్కడ ఉన్న పురప్రముఖులను చూచి ఇలా అన్నాడు. “మీరందరూ ఇక్కడకువచ్చి ఏం చేస్తున్నారు. ఎంత సేపటికీ నేను మాట్లాడటం తప్ప మీరు ఏమీ మాట్లాడరా. రాముని అయోధ్యకు తీసుకురావడినికి మీవంతు ప్రయత్నం చేయరా! మీరంతా అన్నగారికి చెప్పండి." అని అన్నాడు భరతుడు.
అప్పుడు వారంతా భరతునితో ఇలాఅన్నారు.“భరతా! రాముడు అన్యాయంగా అధర్మంగా మాట్లాడుతుంటే ఆయనను వారించ వచ్చుగానీ, రాముడు ధర్మంగా, న్యాయంగా మాట్లాడుతున్నాడు. ఆయనను మేము ఏమని వారించగలము. రాముడు చెప్పే ప్రతి మాటా యుక్తియుక్తముగా ఉంది. రాముడు తండ్రి మాటను మీరడం లేదు. అది ప్రతి పౌరుడి ధర్మము. ఆ ధర్మాన్నే రాముడు నెరవేరుస్తు న్నాడు. రాముడే తండ్రి మాటను కాదని రాజు అయితే ఇంక రాజ్యంలో రాముని మాట ఎవరు వింటారు. అది అరాచకానికి దారి తీస్తుంది. కాబట్టి రామునికి ఎదురు చెప్పలేము.” అని ముక్తకంఠంతో పలికారు పౌరులు.
రాముడు చిరునవ్వు నవ్వాడు. “భరతా! చూచావా పౌరులు ఏమంటున్నారో! వారిది ధర్మదృష్టి. అందుకే ధర్మం చెప్పారు. నీవు కూడా ధర్మం ఆలోచించు. నీ ప్రయత్నం మానుకో. అయోధ్యకు వెళ్లు." అని అన్నాడు రాముడు.
భరతుడు పైకి లేచాడు. ఆచమనం చేసాడు. అక్కడ సమావేశమయిన మంత్రులు, విద్వాంసులు, సేనానాయకులు, పురప్రముఖులను ఉద్దేశించి ఇలా అన్నాడు.
“ నా మాటలను శ్రద్ధగా వినండి. నేను ఎన్నడూ రాజ్యము నాకు ఇమ్మని నా తండ్రిని అడగలేదు. బలవంతం చేయలేదు. నేను రాజు కావాలని ఎన్నడూ నా తల్లి కైకతో అనలేదు. ఆమెను ఆ దిశగా ప్రేరేపించలేదు. నా తల్లి చేసిన పనికి నా అనుమతి లేదు. కాని దురదృష్టవశాత్తు ఈ పరిణామాలకు నేను కారణం అయ్యాను కాబట్టి నా తండ్రిగారి మాట ప్రకారము రామునికి బదులు నేను పదునాలుగు సంత్సరములు అరణ్య వాసము చేస్తాను. నన్ను వద్దు అనడానికి ఎవరికీ అధికారము లేదు." అని అన్నాడు భరతుడు.
“ నా మాటలను శ్రద్ధగా వినండి. నేను ఎన్నడూ రాజ్యము నాకు ఇమ్మని నా తండ్రిని అడగలేదు. బలవంతం చేయలేదు. నేను రాజు కావాలని ఎన్నడూ నా తల్లి కైకతో అనలేదు. ఆమెను ఆ దిశగా ప్రేరేపించలేదు. నా తల్లి చేసిన పనికి నా అనుమతి లేదు. కాని దురదృష్టవశాత్తు ఈ పరిణామాలకు నేను కారణం అయ్యాను కాబట్టి నా తండ్రిగారి మాట ప్రకారము రామునికి బదులు నేను పదునాలుగు సంత్సరములు అరణ్య వాసము చేస్తాను. నన్ను వద్దు అనడానికి ఎవరికీ అధికారము లేదు." అని అన్నాడు భరతుడు.
రాముడు ఆశ్చర్యంగా భరతుని వంక చూచాడు. ఒక్క నవ్వు నవ్వి ఇలా అన్నాడు. “పౌరులారా! నా తండ్రి గారి పాలనలో జరిగిన అమ్మకాలూ, కొనుగోళ్లు, కుదువలు, ఆయన చనిపోయినాడని రద్దు చేస్తామా. లేక మరొకరి పేరుతో మార్చుకుంటామా! లేదు కదా. ఇదీ అంతే. నా తండ్రి నన్ను అరణ్యములకు వెళ్లమన్నాడు. నేను అరణ్యములకు వచ్చాను. ఇప్పుడు మా తండ్రిగారు లేరని నా ప్రతిజ్ఞను మార్చుకోలేము కదా! నాకు మారుగా భరతుడు అరణ్యవాసము చేయలేడు కదా! నాకు ప్రతినిధిగా భరతుడు రాజ్యం చేయవచ్చుకానీ, అరణ్యవాసం చెయ్యడం హాస్యాస్పదము, జుగుప్సాకరము. నా తల్లి వరాలు కోరడం, నా తండ్రి ఆ వరాలు ఇవ్వడం, నేను అరణ్యములకు రావడం అన్నీ ధర్మబద్ధములే. భరతుడు రాజ్యం చేస్తాడు. అతనికి అన్నీ శుభాలే జరుగుతాయి. నేను తొందరలోనే వనవాసము నుండి తిరిగి వచ్చి లక్షణ, భరత, శత్రుఘ్నుల సాయంతో రాజ్యపాలన చేస్తాను.
భరతా! మహారాజు దశరథుడు నీకు రాజ్యము, నాకు వనములు ఇచ్చాడు. వాటిని మనం సమర్థవంతంగా పాలిద్దాము. మహారాజునకు అసత్యదోషం రాకుండా చేద్దాము. నేను చెప్పిన మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించు" అని అన్నాడు రాముడు.
(అరణ్యంలో నేను శత్రు సంహారం చేసి అయోధ్యను శత్రుశేషం లేకుండా చేస్తాను. అంతవరకూ నీవు అయోధ్యను పాలించు అని రాముని మాటల్లోని భావము అని చెప్పవచ్చు.)
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment