శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 110)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

నూట పదవ సర్గ

సభలో జరుగుతున్న వాదోపవాదాలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు కులగురువు వసిష్ఠుడు. ఎవరు చెప్పినా రాముడు ఒప్పుకోడంలేదు. జాబాలి మాటలతో రాముడు కోపగించుకున్నాడు అని అర్ధం అయింది వసిష్ఠునకు. జాబాలి సామాన్యుడు కాదు. అందుకని జాబాలి మాటలను సర్దిచెప్పడానికి ప్రయత్నం చేసాడు వసిష్ఠుడు.

“ఓ రామా! ఈ లోకంలో జనులు పుడుతూ చస్తూ ఉంటారనీ, పుణ్య లోకాలకు, పాప లోకాలకూ పోయి మరలా జన్మ ఎత్తుతుంటారనీ జాబాలికి కూడా తెలుసు. కానీ నిన్ను ఎలాగైనా అయోధ్యకు రప్పించాలనే తాపత్రయంతో అలా మాట్లాడాడు కానీ వేరు కాదు. ఇంతకూ ఈ సృష్టి ఎలా మొదలయిందో నాకు తెలిసినంత వరకూ చెబుతాను విను.

ఈ సృష్టి ప్రారంభం కాక ముందు ఈ లోకమంతా నీటితో నిండి ఉంది. ఆ జలంలో నుండి భూమి ఆవిర్భవించింది. తరువాత దేవతలు, బ్రహ్మదేవుడు పుట్టారు. తరువాత బ్రహ్మ వరాహ రూపంలో భూమిని పైకి తీసుకొని వచ్చాడు. ( విష్ణుదేవుడు వరాహావతారంలో భూమిని పైకి తీసుకొని వచ్చాడు అని నానుడి కాని బ్రహ్మ దేవుడు వరాహావతారము ధరించాడని కొన్ని పురాణాలలో ఉంది అని
పండితుల అభిప్రాయము.) శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు అయిన బ్రహ్మ నుండి మరీచి, కశ్యపుడు పుట్టారు. కశ్యపునికి సూర్యుడు కుమారుడు. సూర్యుని కుమారుడు మనువు. మనువు కుమారుడు ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకువు మొట్ట మొదటగా ఈ అయోధ్యను పాలించాడు. అందుకే మీ వంశమును ఇక్ష్వాకు వంశము అని పిలుస్తారు.

ఇక్ష్వాకు కుమారుడు కుక్షి, కుక్షికి వికుక్షి అనే కుమారుడు పుట్టాడు. వికుక్షి కి బాణుడు జన్మించాడు. బాణుడి కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుడు ఈ దేశమును సుభిక్షంగా పరిపాలించాడు. అనరణ్యుని కుమారుడు పృథువు. పృథువు కుమారుడు త్రిశంకుడు. ఆ త్రిశంకువే విశ్వామిత్రుని సాయంతో సశరీరంగా స్వర్గమునకు వెళ్లాడు. ఆ త్రిశంకుని కుమారుడు దున్ధుమారుడు, దున్ధుమారుని కుమారుడు యవనాశ్వుడు. ఆ యవనాశ్వుని కుమారుడు మాంధాత. మాంధాత కుమారుడు సుసంధి. సుసంధి కుమారుడు ధృవసంధి. ధృవసంధి కుమారుడు భరతుడు. (ఆ భరతుని పేరు మీదనే భారత దేశము, భరత ఖండము అని పిలువబడుతూ ఉంది.)

భరతుని కుమారుడు అసితుడు. ఈ అసితునికి ఒక కధ ఉండి. అసితునికి హైహయులు, తాలజంఘులు, శశిబిందువులు అనే రాజవంశీయులు శత్రువులు. వారు అసితుని రాజ్యము నుండి తరిమివేసారు. అసితుడు భార్యలతో సహా అడవులకు పారిపోయాడు. అప్పుడు అసితుని భార్యలు గర్భవతులు. అసితుని భార్యలకు ఒకరంటే ఒకరికి పడదు. అందులో ఒకామె రెండవ ఆమెకు గర్భం స్రావం అయేట్టు విషం పెట్టింది.

భృగు వంశమునకు చెందిన చ్యవనుడు హిమవత్పర్వతము మీద ఉంటున్నాడు. అసితుని భార్య కాళింది. కాళిందికే ఆమె సవతి విషం పెట్టింది. కాళింది చ్యవనుడి దగ్గరకు పోయి ఆయనకు నమస్కరించింది. “నీకు లోకముచే పూజింపబడేవాడు, ధార్మికుడు, మంచి శీలము కలవాడు, మీ వంశము నిలబెట్టేవాడు అయిన పుత్రుడు జన్మిస్తాడు" అని ఆశీర్వదించాడు.

చ్యవనుని ఆశీర్వాదము ఫలించి కాళిందికి సర్వలక్షణ సమన్వితుడైన కుమారుడు జన్మించాడు. విషమును విరిచి పుట్టాడు కాబట్టి అతనికి సగరుడు అనే పేరు సార్థకమయింది. సగర చక్రవర్తి ఒక యజ్ఞము చేసాడు. యజ్ఞాశ్వమును వదిలిపెట్టాడు. ఆ యజ్ఞాశ్వము మాయం అయింది. దానిని వెదికించే ప్రయత్నంలో సముద్రమును తవ్వించాడు. సముద్రమును తవ్వడానికి సగరుడు కారకుడు అయ్యాడు కాబట్టి ఆయనపేరు మీద సముద్రమునకు సాగరము అనే పేరు సార్థకమయింది.

సగరునకు అసమంజుడు అనే కుమారుడు పుట్టాడు. వాడు చిన్నప్పటినుండి పాపకృత్యాలకు అలవాటుపడ్డాడు. కాబట్టి సగరుడు అసమంజుని వదిలివేసాడు. (ఈ అసమంజుడి గురించే కైక వాదించింది. దానిని మంత్రులు తిప్పికొట్టారు). అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. (ఈ భగీరథుడే గంగను భూమి మీదికి తీసుకొని వచ్చాడు. అందుకే గంగానదికి భాగీరధి అనే పేరు వచ్చింది).

భగీరథుని కుమారుడు కకుతుడు. ఆ కకుత్తుని పేరు మీద మీ వంశమునకు కాకుత్థ్స వంశము అనే పేరు వచ్చింది. కకుత్ప్రునకు రఘువుకుమారుడు. అతని పేరుమీదుగానే మీ వంశమునకు రఘువంశము అనే పేరు, మీ అందరికీ రాఘువులు అనే పేరు వచ్చింది.

రఘువు కుమారుడు కల్మాషపాదుడు. కల్మాషపాదుని కుమారుడు శంఖణుడు. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు. అతని కుమారుడు శీఘ్రగుడు. అతని కుమారుడు మరువు. మరువు కుమారుడు ప్రశుశ్రువుడు. అతని కుమారుడు అంబరీషుడు. అంబరీషుని కుమారుడు నహుషుడు. నహుషుని కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అజుడు. అజుని కుమారుడు మీ తండ్రి దశరథమహారాజు. నీవు ఆ దశరథుని పెద్దకుమారుడవు.

మీ వంశములో అందరూ తమ పెద్దకుమారులకు రాజ్యాధికారము సంక్రమింపజేసారు. వంశపారంపర్యంగా పెద్దవాడివైన నీకు రాజ్యాధికారము లభించింది. అందుకని నీవు కాదనకుండా అయోధ్యను పాలించు. ఇక్ష్వాకు వంశములో ఇప్పటి వరకూ జ్యేష్టుడే రాజు అయ్యాడు. జ్యేష్టుడు ఉండగా చిన్నవాడు రాజుకావడం ధర్మవిరుద్ధము.

కాబట్టి ఓ రామా! ఇప్పుడు నీవు నీ వంశ గౌరవమును వారు కాపాడుకుంటూ వస్తున్న రాజధర్మమును నాశనం చెయ్యవద్దు. నీ తండ్రి పరిపాలించినట్టు నీవు కూడాఅయోధ్యను పాలించు." అని
అన్నాడు వసిష్ఠుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)