శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 109)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట తొమ్మిదవ సర్గ
జాబాలి చెప్పినది అంతా శ్రద్ధగా విన్నాడు రాముడు. జాబాలితో ఈ విధంగా పలికాడు.“ఓ మహాత్మా! మీరు నా హితము కోరి చెప్పిన మాటలు నాకు బాగున్నా లోకసమ్మతము కావు. అవి లోకానికి హితమును చేకూర్చలేవు. మీ మాటలు ఆచరిస్తే ప్రజలలో కట్టుబాటు తప్పుతుంది. స్వేచ్ఛా విహారము పెచ్చరిల్లుతుంది. ఎవడి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తారు. అరాచకము నెలకొంటుంది. అటువంటి వారిని ఎవరూ గౌరవించరు.
ఒక మనిషియొక్క గుణగణములు అతని ప్రవర్తనను బట్టి తెలుస్తాయి. అదీ కాకుండా పైకి ఒకటీ లోన ఒకటి పెట్టుకొని ప్రవర్తించేవారు అంటే పైకి గౌరవనీయుల మాదిరి కనపడుతూ లోపల ఎన్నో చెయ్యకూడని పనులుచేసేవారు, పైకి ఉత్తమ లక్షణములు కనబరుస్తూ లోపల పరమ నీచంగా ప్రవర్తించేవారు, పైకి నీతి మంతుడి మాదిరి కనపడుతూ లోపల నీతి బాహ్యమైన పనులు చేసేవారు, అటువంటి వారు ఎల్లప్పుడూ ధర్మము విడిచి అధర్మమునే ఆచరిస్తారు. కాని పైకి మాత్రం ధర్మాత్ములు మాదిరి కనపడతారు.
మీరు చెప్పిన మాదిరి చేస్తే నేను కూడా అలాగే అవుతాను. పైకి నీతులు చెబుతూ లోపల సింహాసనము కోసరం వెంర్లాడేవాడినవుతాను. ఈనాడు నన్ను వెంటనే అయోధ్యకు రమ్మని ఆహ్వానించే వారు కూడా రేపు నన్ను దురాత్ముడని నిందిస్తారు. నన్ను ఎవరూ గౌరవించరు. గౌరవం లేని రాముడు జీవించి కూడా వృధా!
నేను నా తండ్రి మాటను పక్కన బెట్టి రాజ్యము స్వీకరిస్తే, లోకంలో అందరూ నా మాదిరే ఆడిన మాట తప్పడంలో పోటీ పడతారు తప్ప నన్ను ఎవరూ గౌరవించరు. నీమాటలు నమ్మిన వారికి నీవు నమ్మిన ఈలోకంలో సుఖం దక్కదు. పైగా, వారికి, నేను నమ్మిన పరలోకంలో నరకం ప్రాప్తిస్తుంది.
రాజు అనే వాడు ప్రజలకు ఆదర్శప్రాయుడుగా ఉండాలి. రాజు ఆచరించే ఆదర్శాలను ప్రజలు కూడా ఆచరిస్తారు. అలా కాకుండా నేనే మాటతప్పి రాజ్యం స్వీకరిస్తే, ప్రజలుకూడా నా మార్గాన్నే అనుసరిస్తారు. స్వేచ్ఛాజీవులు అవుతారు. అది దీర్ఘకాలంలో చెడుఫలితాలను ఇస్తుంది.
రాజధర్మము సనాతనమైనది. సత్యము, ధర్మము ఈ రెంటి మీదనే రాజ్యము నడవాలి. అప్పుడు ప్రజలకు రాజుమీద నమ్మకం కలుగుతుంది. కాబట్టి సత్యమును మించిన ధర్మము మరొకటి లేదు. మేము చేసే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ ఆ సత్యము మీదనే ఆధారపడ్డాయి. కాబట్టి మానవునకు సత్యవ్రతమును అవలంబించడం ఆవశ్యకము. నేను కూడా ఆ సత్యవాక్పరిపాలననే నమ్ముకున్నాను. ఆడిన మాట తప్పను. నా తండ్రికి ఇచ్చిన మాటను జవదాటను.
ఈ లోకంలో జనులు పలురకాలు. ఒకడు రాజ్యపాలన చేస్తాడు. మరొకడు పాపపు పనులు చేస్తాడు. మరొకడు వంశ గౌరవాన్ని కాపాడుతాడు. మరొకడు నరకద్వారాలు వెతుక్కుంటూ నరకానికి వెళతాడు. ఎవరు చేసిన కర్మలకు తగ్గ ఫలములను వారు అనుభవిస్తారు. నేను సత్యమును పాటించడమే ధర్మంగా పెట్టుకున్నాను. అదే ఆచరిస్తాను. తగిన ఫలితాన్ని పొందుతాను.
నేను నా తండ్రి గారికి ఇచ్చిన మాటను, మోహము చేతగానీ, ఆశాపాశముల చేతగానీ, చిత్తభ్రమలో గానీ, అజ్ఞానమువలన గానీ, ఇంకా ఎటువంటి పరిస్థితులలో గానీ తప్పను. ఇదే నా నిశ్చయం. నేనే గనక ఆడిన మాట తప్పితే దేవతలు గానీ, నా పితృదేవతలు గానీ నేను చేసిన పనిని సమర్థించరు.
నేను ఆడిన మాట కోసరము నా క్షత్రియ ధర్మమును కూడా త్యజించుటకు వెనుకాడను. ఎందుకంటే క్షత్రియ ధర్మంలో ఎక్కువగా క్రూరత్వానికి, దురాశకు తావు ఉంటుంది కానీ సత్యధర్మానికి తావు లేదు.
మానవుడు తాను చెప్పదలచుకొన్నది ముందుగా మనసులో తలచుకుంటాడు. దానిని వాక్కురూపంలో బయటకు చెబుతాడు. కాబట్టి నీవు చెప్పినవి అన్నీ నీచెడ్డ ప్రవర్తనను సూచిస్తున్నాయి. నేను నా తండ్రి ఎదుట వనవాసమునకు పోతాను అని అంగీకరించాను. అప్పుడు నా తండ్రి దశరథుడు, నా తల్లి కైక, ఎంతోసంతోషించారు. ఇప్పుడు భరతుని మాట, నీ మాట విని ఎలా అయోధ్యకు పోగలను. కాబట్టి వనవాసమే నాకు శ్రేయోదాయకము. ఇక్కడ స్వచ్ఛమైన గాలి
పీలుస్తూ, కందమూలములు తింటూ, నిర్మలమైన జలములు త్రాగుతూ, హాయిగా కాలం గడుపుతాను.ఇది కర్మభూమి. మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలు వస్తాయి. నీ మాట విని నేను అధర్మంగా ప్రవర్తిస్తే నాకు చెడుఫలితాలే వస్తాయి. దేవేంద్రుడు నూరు అశ్వమేధ యాగములు చేసి ఇంద్రపదవి అధిష్ఠించాడు. ఎంతో మంది మహాఋషులు ఘోరమైన తపస్సులు చేసి ఉత్తమలోకములు పొందారు. వారే కాకుండా, సత్యము, ధర్మము, పరాక్రమము, భూతదయ, సరళమైన మాట, దేవతలను, బ్రాహ్మణులను పూజించడం, వీటిని మార్గములుగా చేసుకొని మానవులు ఉత్తమ లోకములు పొందారు. ఆ మానవులలో కూడా, బ్రాహ్మణులు, పైన చెప్పబడిన మార్గంలో పయనించి ఉత్తమలోకములు పొందారు.
నీవు బ్రాహ్మణుడవు. కాని అపమార్గంలో పయనిస్తున్నావు. నీ వంటి అధర్మపరుడిని, అవినీతి పరుడిని దగ్గర చేర్చి నా తండ్రి తప్పుచేసాడు. నీవు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ మాటలు అన్నావో ఆ బుద్ధుడు, తథాగతుడు, పరమ నాస్తికుడు, ఒట్టి దొంగ. అందుకే ప్రజలు అతనిని నమ్మలేదు. జ్ఞానులు ఎప్పుడూ నాస్తికులతో సంబంధం పెట్టుకోరు.
ఓ జాబాలీ! నీకు పూర్వులు చాలామంది ఉన్నారు. వారు ఎన్నో యజ్ఞయాగములు, శుభమైన కర్మలు చేసారు. వారు ఈ లోకము లోనూ పరలోకములోనూ సుఖాలు అనుభవించారు. బ్రాహ్మణులు మానవుల చేత యజ్ఞములు, యాగములు మొదలగు మంగళ కరమైన కార్యములు చేయిస్తారు కానీ నీ మాదిరి నాస్తిక వాదమును వ్యాప్తి చేయరు. ఎల్లప్పుడూ ధర్మమును ఆచరించువారు. మంచివారి స్నేహము చేయువారు, తేజస్సు కలవారు, దానవ్రతులు, అహింసాపరులు, పాపము చేయని వారూ, ఉత్తములు అయిన వారు లోకములో పూజింపబడతారు. నీ లాంటి వారిని ప్రజలు గౌరవించరు.” అని కోపంతో అన్నాడు రాముడు.
రాముని మాటలు విన్న జాబాలి రాముని అనునయిస్తూ ఈ విధంగా అన్నాడు. “రామా! నీవు పొరపడుతున్నావు. నేను నాస్తికుడను కాను. నాస్తికత్వమును వ్యాప్తిచేయడం లేదు. కేవలము నిజాలు చెప్పడమే నా సంకల్పము అది నాస్తికత్వము మాదిరి అనిపిస్తుంది. నేను కూడా ఆస్తికుని వలె మాట్లాడగలను. కేవలము నిన్ను మరలా అయోధ్యకు పట్టాభిషిక్తుని చేసి, అయోధ్యాప్రజలు, భరతుని కోరిక నెరవేరవలెననే కోరికతో అలా మాట్లాడాను కానీ వేరు కాదు.” అని రాముని అనునయించాడు జాబాలి. అంతటితో ఆ వివాదము ముగిసిపోయింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment