శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 108)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట ఎనిమిదవ సర్గ
త్రేతాయుగంలో జాబాలి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నాస్తిక వాది. ఈ ప్రాకృతిక ప్రపంచము తప్ప వేరే ఏమీ లేదు. ఉన్నంత కాలం సుఖాలు అనుభవించడం మాత్రమే మనము చెయ్యాల్సిన పని అని నమ్మే వాడు. అలాంటి భావాలు ఉన్న జాబాలి ఆసభలో ఉన్నాడు. రాముడు, భరతుడు చేసిన సంవాదమును విన్న జాబాలి ఇలామాట్లాడసాగాడు.“రామా! నీవు ఎంతో బుద్ధిమంతుడివి, జ్ఞానము కలవాడవు అనుకున్నాను. కాని ఇంతమూర్ఖంగా ఆలోచిస్తావు అని అనుకోలేదు. నీ ఆలోచన ఎందుకూ పనికిరాదు.
రామా! మానవుడు పుట్టేటప్పుడు ఒంటరి వాడు. చచ్చేటప్పుడు ఒంటరి వాడే. ఈ బంధుత్వాలు, మమతలు మమకారాలు అన్నీ నడుమ వచ్చినవే. చచ్చిన తరువాత ఎవరూ ఎవరికీ ఏమీ కారు. అందుకే ఈ బంధుత్వాలు అన్నీ వ్యర్థము. తల్లి, తండ్రి,మనకు దైవసమానులు, వాళ్ల మాటలను పాటించాలి, అని అనుకోవడం అవివేకము. మీ తండ్రి మరణించాడు. ఇంక ఆయన మాటకు విలువేముంది.
దూర ప్రయాణాలు చేసే వాళ్లు రాత్రిళ్లు సత్రములలో బస చేస్తారు. ఆ రాత్రికి కొంతమందితో పరిచయం ఏర్పడుతుంది. మరునాడు ఉదయం ఎవరి దోవన వారు వెళతారు. ఈ జీవితాలూ
అంతే. తల్లి, తండ్రి, ధనము, భార్య, సంతానము అన్నీ సత్రములలో పరిచయాల్లాంటివే. కాలం తీరగానే ఎవరి దోవ వారిది. ఆ కాస్త పరిచయంతో మాటకు కట్టుబడి ఉండాలి అని అనుకోవడం అవివేకము. విజ్ఞులైన వారు ఈ బంధుత్వాలకు విలువ ఇవ్వరు.
అంతే. తల్లి, తండ్రి, ధనము, భార్య, సంతానము అన్నీ సత్రములలో పరిచయాల్లాంటివే. కాలం తీరగానే ఎవరి దోవ వారిది. ఆ కాస్త పరిచయంతో మాటకు కట్టుబడి ఉండాలి అని అనుకోవడం అవివేకము. విజ్ఞులైన వారు ఈ బంధుత్వాలకు విలువ ఇవ్వరు.
నీకు రాజ్యము సంక్రమించింది. భరతుడు కూడా అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడవై రాజ్యపాలన చెయ్యమంటున్నాడు. హాయిగా రాజభోగాలు అనుభవించక తండ్రిమాటకు కట్టుబడి వనవాసము చెయ్యడం ఏమిటి? ఈ చెడు ఆలోచన నీకు ఎలా కలిగింది. రామా! నా మాటవిను. అయోధ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. వెంటనే అయోధ్యకు వెళ్లి పట్టాభిషిక్తుడివై స్వర్గలోకముతో సమానమైన రాజభోగాలు అనుభవించు.
అసలు దశరథుడు ఎవరు? నీకు జన్మను ఇచ్చాడు. వెళ్లిపోయాడు. అంతే. అతనికి నీకు ఏమి సంబంధం? ఆయన మాటకు నీవు ఎందుకు కట్టుబడి ఉండాలి? మరొక మాట. తండ్రి బీజము. తల్లి క్షేత్రము. తల్లి తండ్రి సంగమించినప్పుడు, తండ్రి బీజము(శుక్లము) తల్లి శోణితములో కలిసి అండము అవుతుంది. అది శిశువుగా మారుతుంది. వీడు నీ తండ్రి అని తల్లి చెబితేనే అతను నీ తండ్రి అని తెలుస్తుంది. నీ తండ్రి తన జీవిత కాలము నీ తండ్రిగా నిన్ను పెంచి పెద్దచేసాడు. కాలం తీరగానే తన దారిన తాను వెళ్లిపోయాడు.
చనిపోయిన తండ్రి గురించి నీవు బాధలు పడటం ఎందుకు? నీ మాదిరి ధర్మము, ధర్మము ప్రకారమే అర్థకామములు అనుభవించాలి అనే వాళ్లు అవివేకులు. వారు ఏ సుఖాలు అనుభవించకుండానే చచ్చిపోతారు. అలాంటి వారిని చూచి నాకు జాలికలుగుతుంది.
ఇంకొక మాట. మానవులు పితరులకు శ్రాద్ధకర్మము చేస్తూ ఉంటారు. ఎందుకు? చచ్చిన వాడు తింటాడా? ఇక్కడ బ్రాహ్మణులు తింటే, చచ్చినవాడు తిన్నట్టేనా! ఒకరు తిన్న ఆహారము మరొకరి ఆకలి ఎలా తీరుస్తుంది. అలాగైతే, దూరదేశములలో ఉన్న వారికి, మనము ఇక్కడ శ్రాద్ధము పెట్టి, బ్రాహ్మణునికి అన్నం పెడితే, ఇతర దేశములలో ఉన్న వారికి ఆకలి తీరుతుందా! ఈ భూమిమీద ఉన్న వారి ఆకలే తీరనప్పుడు, చచ్చిన వాడి ఆకలి ఏమి తీరుతుంది.
రామా! యజ్ఞములు చేయమనీ, దానాలు ఇవ్వమనీ, తపస్సు చేయమనీ గ్రంధాలు రాసి, దానాలు చెయ్యమని ప్రోత్సహిస్తారు. దానాలు స్వీకరించి లాభం పొందుతారు. దానాలు ఇచ్చినవాడు నాశనమై పోతాడు. ఇక్కడ దానాలు చేస్తే, శ్రాద్ధాలు పరలోకంలో ఉన్న వాళ్లు సంతోషిస్తారు అన్న మాట శుద్ధ అబద్ధం. అసలు పరలోకమే లేనపుడు ఇంక సంతోషించడం ఎక్కడిది. నీవు ఏమి చేసినా నీ తండ్రి చూడడు కదా. కాబట్టి భరతుని మాటవిని అయోధ్యకు పోయి హాయిగా రాజ్యపాలన చెయ్యి సుఖించు.” అని చెప్పాడు జాబాలి.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment