శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 107)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

నూట ఏడవ సర్గ

తన మనోనిశ్చయాన్ని రాముడు భరతునికి ఈ విధంగా తెలిపాడు.

“భరతా! ఇప్పటి దాకా నీవు చెప్పినది అంతా మిగుల యుక్తి యుక్తముగా ఉంది. అందులో ఏ దోషమూ లేదు. చాలా చక్కగా చెప్పావు. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కానీ నీకు తెలియని విషయములు కొన్ని నీకు చెప్పక తప్పదు. మన తండ్రి దశరథుడు తాను నీ తల్లి కైకను వివాహమాడు సందర్భంలో తన రాజ్యమునకు ఉత్తర అధికారిగా నిన్ను చేస్తాను అని మీ మాతామహులకు (కైక తండ్రికి) వాగ్దానం చేసాడట. అదీకాకుండా దేవాసుర సంగ్రామంలో నీ తల్లి మన తండ్రి ప్రాణములు రెండు సార్లు కాపాడినందుకు గాను, రెండు వరములు ఇస్తాను అని వాగ్దానము చేసాడట. నీ తల్లి ఆ వరములను తనకు తరువాత ప్రసాదించమని అడిగినదట. ఆ వరములను నా పట్టాభిషేక సందర్భములో కోరినది. అందులో మొదటి వరము నాకు 14 ఏళ్ల వనవాసము. రెండవ వరము నీకు అయోధ్య రాజ్య పట్టాభిషేకము. ఆ వరములను మన తండ్రి నీ తల్లికి ఇచ్చాడు. నన్ను 14 ఏళ్లు అరణ్యములకువెళ్లమని ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞమేరకు నేను అరణ్యములకు వచ్చాను. నన్ను విడిచి ఉండలేక నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు నా వెంట అడవులకు వచ్చారు. దీనితో మొదటి వరము నెరవేరినది.

మన తండ్రి నీ తల్లికి ఇచ్చిన రెండవ వరమును అనుసరించి నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడివి కావాలి. అప్పుడే నీవు నీ తల్లి తండ్రుల మాటను పాటించినట్టవుతుంది. నీవు నీ తండ్రిని ఋణవిముక్తుని చేసినట్టవుతుంది. దీనికి ఒక ఇతిహాసమును కూడా చెబుతాను విను.
పూర్వము గయుడు గయా క్షేత్రంలో పితృదేవతల గురించి ఒక యాగము చేసాడట. ఆ సందర్భంలో గయుడు ఈవిధంగా చెప్పాడు అని పెద్దలు చెబుతారు. పుత్రుడు అనే వాడు పితరులను పున్నామ నరకము నుండి రక్షిస్తాడట. అందుకని అతడికి పుత్రుడు అనే పేరు వచ్చిందట. అందుకే తల్లితండ్రులు తమకు చాలా మంది పుత్రసంతానము కావాలని కోరుకుంటారట. ఎందుకంటే, అందులో కనీసం ఒకడైనా గయకు వెళ్లి అక్కడ పితృకార్యము చేస్తాడని వారి ఆశ.

ఓభరతా! నీవు కూడా నీ తండ్రి మాటను పాటించి ఆయనను పున్నామ నరకమునుండి రక్షించు. నీ తండ్రి నీ తల్లికి ఇచ్చిన మాట ప్రకారము వెంటనే అయోధ్యకు వెళ్లి, పట్టాభిషిక్తుడిపై, శత్రుఘ్నుని సాయంతో అయోధ్యను పాలించు. నేను కూడా ఇక్కడ ఉండను. సీత, లక్ష్మణులతో కలిసి దండకారణ్యమునకు వెళతాను. నీవు అయోధ్యను పాలిస్తుంటే, నేను అడవిలో ఉన్న మృగములను పాలిస్తాను. నీవు సంతోషంగా అయోధ్యకు వెళ్లు, నేను అంతే సంతోషంగా దండకారణ్యమునకు వెళతాను.

నీకు నీ సింహాసనము మీద ఉన్న తెల్లటి గొడుగు (శ్వేతఛత్రము) ఎలా నీడనిస్తుందో, నాకు కూడా ఈ అడవిలో ఉన్న ఫలవృక్షములు నీడనిస్తాయి. నీవు శ్వేతఛత్రఛాయలో, నేను వటవృక్షఛాయలో సుఖిద్దాము. నీకు తోడుగా శత్రుఘ్నుడు ఉంటాడు. నాకు తోడుగా లక్ష్మణుడు ఉంటాడు. దశరథునికి కుమారులుగా పుట్టినందుకు, మనము నలుగురము ఆయన మాటను సత్యవ్రతమును నిలబెడదాము." అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)